2019 sedition case : జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు బెయిలు మంజూరు

ABN , First Publish Date - 2022-09-30T18:48:40+05:30 IST

జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థి షార్జీల్

2019 sedition case : జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు బెయిలు మంజూరు

న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)  విద్యార్థి షార్జీల్ ఇమామ్‌ (Sharjeel Imam)కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఫలితంగా 2019లో జామియా నగర్‌లో హింస చెలరేగిందని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన రాజద్రోహానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది. 


ఎన్ఎఫ్‌సీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో షార్జీల్ ఇమామ్‌కు బెయిలు మంజూరు చేస్తూ అడిషినల్ సెషన్స్ జడ్జి అనూజ్ అగర్వాల్ శుక్రవారం తీర్పు చెప్పారు. 2019 నాటి ఈ రాజద్రోహం కేసులో బెయిలు మంజూరైనప్పటికీ ఆయన ఇంకా కస్టడీలోనే కొనసాగుతారు. ఆయనపై ఇతర కేసులు పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం. 


తాను 31 నెలల నుంచి కస్టడీలో ఉన్నానని, తనకు బెయిలు మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఇమామ్ కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆయన పిటిషన్‌ను పరిశీలించాలని ఆదేశించింది. ఆయనకు రెగ్యులర్ బెయిలు ఇచ్చేందుకు 2021 అక్టోబరులో సాకేత్ కోర్టు తిరస్కరించింది. ఆయన ప్రసంగాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపే విధంగా ఉన్నాయని, శాంతి, సామరస్యాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని తెలిపింది. 


జామియా నగర్ విద్యార్థులు, ప్రజలు పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా 2019 డిసెంబరులో ప్రదర్శన నిర్వహించారు. వీరు రోడ్డును దిగ్బంధనం చేసి, వాహనాలు, ఆస్తులపై కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడులు చేశారని 2019 డిసెంబరు 15న నమోదైన ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఈ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు (డిసెంబరు 13న) ఇమామ్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగంతో రెచ్చిపోయినవారు ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలిపింది. 


Updated Date - 2022-09-30T18:48:40+05:30 IST