జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌పై.. భగ్గు

ABN , First Publish Date - 2021-06-22T06:08:20+05:30 IST

ఉద్యోగాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం.. మా ఆశలు నీరుగారుస్తూ జగనన్న జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేశారంటూ నిరుద్యోగ యువత భగ్గుమంది.

జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌పై.. భగ్గు
గుంటూరు ఏసీ కాలేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు

‘ఉద్యోగాల విప్లవ’ ప్రకటనపై ఆగ్రహం

గుంటూరులో నిరుద్యోగ యువత ఆందోళన

క్యాలెండర్‌లో జాబ్‌లు ఎక్కడ జగనన్నా అంటూ నినాదాలు 

అన్ని ఖాళీలతో కొత్త క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌


గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం.. మా ఆశలు నీరుగారుస్తూ జగనన్న జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేశారంటూ నిరుద్యోగ యువత భగ్గుమంది. సోమవారం గుంటూరులో నిరుద్యోగ యువత రోడ్డెక్కింది. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్‌ సెంటర్‌లో నిరసన తెలిపారు. రాష్ట్ర నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏసీ కళాశాల వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. శుక్రవారం విడుదలైన జాబ్‌ క్యాలెండర్‌తో ఒక్కసారిగా ఆశలు గల్లంతయ్యాయని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలల్లో పోస్టులు ప్రకటిస్తారనుకుంటే కనీసం వందల్లో కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ప్రతీ ఏటా జాజ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న జగన్‌ హామీని గుడ్డిగా నమ్మి ఘోరంగా మోసపోయామంటూ నినాదాలు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌లో జాబ్‌లు ఎక్కడ? జగనన్నా అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. శంకర్‌విలాస్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం కిరణ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు మాట్లాడుతూ సీఎం విడుదల చేసిన జాబ్‌ల విప్లవం.. జాబ్‌ల క్యాలెండర్‌లో జాబ్‌ల ఉసే లేదన్నారు. పేద బిడ్డలు చదువుకుంటేనే ఉన్నతస్థితికి వస్తారంటూ మాటల్లో చెబుతూ జాబ్‌ క్యాలెండర్‌లో ఒక్క ఉపాధ్యాయ పోస్టు లేకపోవడం దారుణమన్నారు.  ప్రతి ఏటా 6,500 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. జీవో 39ని సవరించి ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చి నూతనంగా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బీ ఆర్య, ఎం. కిరణ్‌, కబీర్‌, పూర్ణమహేష్‌, ఎం సందీప్‌, రాజా, అయ్యప్ప, రాజేష్‌, తరుణ్‌, వెంకటేష్‌, కిన్నెర తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలి : నిరుద్యోగ ఐక్యవేదిక

జీవో 39తో ఇచ్చిన క్యాలెండర్‌ రద్దు చేసి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,80,000 వేల పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రాష్ట్ర నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్‌ కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. ఏసీ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన వార్షిక క్యాలెండర్‌ కాకుండా 36 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్‌ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే అన్ని ఖాళీలను భర్తీ చేస్తూ తక్షణమే క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, 6 వేల పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షరీఫ్‌, నాయకులు ఈడే రవి, కే శేఖర్‌, శ్రీనివాస్‌రెడ్డి, బుజ్జిబాబు, షేక్‌ షాహినా, జెస్సి, అరుణ, సౌజన్యకుమారి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల నిరసనతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  

Updated Date - 2021-06-22T06:08:20+05:30 IST