మళ్లీ ఉద్యోగమా!

ABN , First Publish Date - 2021-07-28T05:09:58+05:30 IST

ఎటువంటి ఉద్యోగ నియామకాలు జరగని ప్రస్తుత సమయంలో జిల్లా అధికారిగా ఉద్యోగ విరమణ పొందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల్లోనే మళ్లీ అదే శాఖలో వేరొక పోస్టు దక్కించుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కోఆర్డినేటర్‌ నియామక ప్రక్రియ జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఇన్‌చార్జి ఎస్‌ఈగా పనిచేసి గత నెల చివరిలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన అదే శాఖలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రాజెక్టులో జిల్లా కోఆర్డినేటర్‌ పోస్టు సంపాదించుకున్నారు.

మళ్లీ ఉద్యోగమా!
జిల్లా గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం

ఉద్యోగ విరమణ పొందిన శాఖలోనే వేరొక పోస్టు

గ్రామీణ మంచి నీటి సరఫరా విభాగంలో ట్విస్టు

కలెక్టరేట్‌, జూలై 27: ఎటువంటి ఉద్యోగ నియామకాలు జరగని ప్రస్తుత సమయంలో జిల్లా అధికారిగా ఉద్యోగ విరమణ పొందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల్లోనే మళ్లీ అదే శాఖలో వేరొక పోస్టు దక్కించుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కోఆర్డినేటర్‌ నియామక ప్రక్రియ జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఇన్‌చార్జి ఎస్‌ఈగా పనిచేసి గత నెల చివరిలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన అదే శాఖలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రాజెక్టులో జిల్లా కోఆర్డినేటర్‌ పోస్టు సంపాదించుకున్నారు. జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి ఈ పోస్టును భర్తీ చేయలేదు. ఇప్పటికిప్పుడు ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి కేటాయించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఆయన పనిచేసిన కాలంలోనే కోఆర్డినేటర్‌ పోస్టు కోసం ఉన్నతాధికారులకు ఫైల్‌ పెట్టడం విశేషం. నాలుగు సంవత్సరాల కిందట స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం  చేపట్టారు. అప్పట్లో అధికార యంత్రాంగమంతా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేశారు. కీలకమైన ఆ సమయంలో భర్తీ చేయలేని పోస్టును ఇప్పుడు భర్తీ చేయడం మరో విశేషం. గతంలో మూడు పోస్టులకు ఆయనొక్కరే ఇన్‌చార్జిగా ఉండేవారు. ఆ సమయంలో ఆయనపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. గ్రామాల్లో చేపట్టిన నిర్మాణాల్లో పిల్లర్‌ బోర్డుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని బహిరంగ విమర్శలు వచ్చాయి. అధిక డబ్బులకు నాణ్యత లేని బోర్డులు ఏర్పాటు చేయడాన్ని అప్పట్లో కొందరు డీఈలు కూడా వ్యతిరేకించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే అధికారికి జిల్లా కోఆర్టినేటర్‌ పోస్టు ఇవ్వడంపై ఉద్యోగుల నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..కనీసం అగ్రిమెంట్‌ కూడా చేసుకోకుండా.. ఏ నిబంధనలూ పాటించకుండా పోస్టులో కొలువుదీరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇన్‌చార్జి ఎస్‌ఇ శివానందకుమార్‌ వద్ద ప్రస్తావించగా కోఆర్డినేటర్‌ పోస్టు భర్తీ తన హయాంలో జరగలేదన్నారు. కలెక్టర్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఎమ్‌డీ స్థాయిలో నియామకం ఉంటుందని చెప్పారు. ఆయన విధుల్లో కూడా చేరారని వెల్లడించారు.



Updated Date - 2021-07-28T05:09:58+05:30 IST