కష్టపడి చదివి ఉద్యోగం సాధించండి : సీఅండ్‌ఎండీ ఎన్‌. శ్రీధర్‌

ABN , First Publish Date - 2021-01-22T05:23:22+05:30 IST

సింగరేణి నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాలు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు, ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు.

కష్టపడి చదివి ఉద్యోగం సాధించండి : సీఅండ్‌ఎండీ ఎన్‌. శ్రీధర్‌
సింగరేణి సంస్థ లోగో

సింగరేణిలో తొలి విడతగా 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 

వివరాలు వెల్లడించిన సీఅండ్‌ఎండీ ఎన్‌. శ్రీధర్‌

కొత్తగూడెం, జనవరి 21: సింగరేణి నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాలు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు, ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. పైరవీలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు చెప్పినా అది పచ్చి బూటకమని, కనుక నిరుద్యోగులెవరూ ఇటువంటి మోసకారుల మాటలను నమ్మవద్దని సీఎండీ కోరారు. ఈ విధంగా ఎవరైనా ప్రలోభ పెడుతున్నట్టు దృష్టికి వస్తే సింగరేణి విజిలెన్స్‌ శాఖకు తెలియజేయాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 372 పోస్టులకు నోటిఫికేషన్‌ 

సింగరేణిలో తొలి విడతగా 372 పోస్టులకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. రాత పరీక్ష ఆధారంగా  అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి 372 పోస్టుల భర్తీకి సింగరేణి దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో 305 పోస్టులను లోకల్‌ వారికి అనగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించారు. (ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 16 జిల్లాలుగా విభజించబడిన విషయం తెలిసిందే.) ఇక అన్‌ రిజర్వ్‌డ్‌గా కేటాయించబడిన 67 పోస్టులకు మొత్తం తెలంగాణ జిల్లాలకు చెందిన వారంతా అర్హులే. ఫిట్టర్‌ ట్రైనీకి 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానికంగా ఉన్న వారికి 105 పోస్టులు, అన్‌ రిజర్వుడ్‌ (అందరికీ) 23 మందికి కేటాయించనున్నారు. అలాగే ఎలక్ట్రీషియన్‌ ట్రైనీకి 51 పోస్టులుండగా, 43 స్థానికులకు, 8 అందరికీ అవకాశం ఉంది. వెల్డర్‌ ట్రైనీకి 54 పోస్టులుండగా, 44 స్థానికులకు, 10 పోస్టులకు అందరికీ అవకాశముంది. టర్నర్‌ మిషనిస్టు ట్రైనీకి 22 పోస్టులకు, 18 స్థానికులకుగాను, 4 అందరికీ ఉన్నాయి. మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ 14 పోస్టులుండగా, 12 స్థానికులకు, 2 అందరికీ, ఫౌండ్రి మ్యాన్‌/మౌల్టర్‌ ట్రైనీకి 19 పోస్టులు ఉండగా, 16 స్థానికులకుగాను, 3 అందరికీ అవకాశముంది. జూనియర్‌ స్టాఫ్‌ నర్సు (మహిళ - టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్‌-డి) 84 పోస్టులకుగాను 67 స్థానికులకుగాను, 17 అందరికీ అవకాశం కల్పించడం జరిగింది. పైన పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి, విద్యార్హతలు, జీత భత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎస్‌సీసీఎల్‌మైన్స్‌.కాం)లోకి వెళ్లి అక్కడ హోం పేజీలోగల కెరీర్స్‌ లింక్‌ను ఓపెన్‌చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. 

 ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి 

అర్హులైన అభ్యర్థులంతా ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా సింగరేణి వెబ్‌సైట్‌లోని కెరీర్‌ లింక్‌ నుంచి తమ దర ఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుతో పాటు తమ అర్హతల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కనుక ఎవరూ తమ దరఖాస్తులు హార్డు కాపీలను సింగరేణి రిక్రూట్‌మెంట్‌ విభాగానికి పంపవద్దని అధికారులు తెలియజేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్న సమయంలోనే ఇవ్వబడిన ఎస్‌బీఐ లింక్‌ ద్వారా రూ.200ల ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు కాగా ఎస్‌సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ఐదు సంవత్సరాల వరకూ సడలింపు ఉంటుందని రిక్రూట్‌మెంట్‌ విభాగం వారు తెలియజేస్తున్నారు. అయితే ఇంటర్నల్‌ అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన వర్తించదు. అలాగే పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదు.


 


Updated Date - 2021-01-22T05:23:22+05:30 IST