సీఎం కేసీఆర్ ప్రకటనతో ఓయూలో సంబరాలు

ABN , First Publish Date - 2022-03-09T19:53:04+05:30 IST

సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటనతో ఓయూలో సంబరాలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేయడంతో ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్‌ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్ తెలిపారు.


సీఎం కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి స్వయంగా నోటిఫికేషన్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్‌ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. తక్షణమే 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. కాగా.. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టు వెల్లడించారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతితో నియామకాలు ఉండవు. కేసీఆర్‌ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ పరిమితి పదేళ్లు పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49, దివ్యాంగులు 54 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2022-03-09T19:53:04+05:30 IST