జాబేది జగనన్నా!

ABN , First Publish Date - 2022-05-29T06:01:01+05:30 IST

ప్రతి ఏడాది జనవరి నెలలో తమ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి, ఏడాదంతా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతుందని వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

జాబేది జగనన్నా!

- పత్తా లేని జగనన్న జాబ్‌ క్యాలెండర్‌  

- నిరుద్యోగుల ఆశలను నెరవేర్చని వైసీపీ ప్రభుత్వం

- గిరిజన ప్రత్యేక డీఎస్‌సీ కోసం నిరీక్షణ

- ఉద్యోగార్థుల్లో అసంతృప్తి

ప్రతి ఏడాది జనవరి నెలలో తమ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి, ఏడాదంతా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతుందని వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో గిరిజన నిరుద్యోగులు తమకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఎంతో ఆశపడ్డారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినప్పటికీ ఒక స్పెషల్‌ డీఎస్‌సీగాని, ఇతర ఉద్యోగాల భర్తీకి గాని ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో గిరిజన నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. 

(పాడేరు, ఆంధ్రజ్యోతి) 

గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డీఎస్‌సీ ద్వారా టీచర్‌  పోస్టులు భర్తీ చేస్తామన్న నేతల హామీలు నీటిమూటలుగానే మిగిలాయి. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు తీస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మూడేళ్లు అయినా ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో గిరిజన నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా నిర్వహించే డీఎస్‌సీల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు టీచర్‌ పోస్టుల నియామకాలు చేపడుతుంది. అలాగే గిరిజన ప్రాంతంలో బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థుల కోసం ‘ప్రత్యేకంగా(గిరిజన) డీఎస్‌సీ’ని నిర్వహించి, అందులో అన్ని(శత శాతం) పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తుంది. ఇందులో భాగంగా 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక డీఎస్‌సీ ద్వారా 640 పోస్టులు భర్తీ చేస్తామని జీవో 233ను జారీ చేసింది. కానీ అమలుకు నోచుకోలే దు. కాగా 2019 ఫిబ్రవరిలో 611 పోస్టుల భర్తీకి తెలుగుదేశం ప్రభుత్వం జీవో 10ని జారీ చేసింది. పాలకుల నిర్లక్ష్యంతో ఆ రెండు జీవోలు అమలుకు నోచుకోలేదు. దానిపై గతంలో గిరిజన నిరుద్యోగులు, స్పెషల్‌ డీఎస్‌సీ సాధన సమితి, విద్యార్థి, గిరిజన సంఘాలు అనేక ఆందోళనలు చేపట్టాయి. 2015లో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డీఎస్‌సీని నిర్వహిస్తామని ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలోకి రాలేదు.  ప్రస్తుతం గిరిజన సంక్షేమ విద్యాశాఖ పరిధిలో ఉన్న పాఠశాలల్లో 650, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 373.. మొత్తం 1,023 టీచర్‌ పోస్టులు ఏజెన్సీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. గతంలో జారీ చేసిన జీవోల ప్రకారం ఏ ఒక్క ప్రత్యేక డీఎస్‌సీని నిర్వహించినా కనీసం 600 ఉపాధ్యాయ పోస్టులైనా భర్తీ అవుతాయని గిరిజన నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.

----

ఖాళీలను భర్తీ చేయాలి 

గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలోని ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలి. చాలా ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. పాడేరు కేంద్రంగా కొత్తగా జిల్లా ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- కొర్రా ప్రభుదాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, పాడేరు 

---

నిరుద్యోగులకు ప్రభుత్వం మోసం 

వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి, ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ, వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపట్టకపోవడం ఘోరం. ఇక గిరిజనుల కోసం ఎటువంటి ప్రత్యేక డీఎస్‌సీ, ఇతర మార్గాల్లో ఉద్యోగాలు తీసే ప్రయత్నమే చేయలేదు. ఏ కోణంలో చూసినా వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- టి.సత్యనారాయణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు


Updated Date - 2022-05-29T06:01:01+05:30 IST