4 కోట్లమందికి ఉద్యోగాల్లేవ్‌

ABN , First Publish Date - 2022-10-03T09:23:58+05:30 IST

దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఆందోళన వ్యక్తం చేశారు.

4 కోట్లమందికి ఉద్యోగాల్లేవ్‌

దేశంలో 1% మందికే 20% సంపద.. 50% ప్రజల సంపద 13 శాతమే


అసమానతలు శుభ పరిణామం కాదు 

చాలాప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు, పోషక ఆహారం అందడం లేదు 

ఆరెస్సెస్‌ నేత హొసబలె ఆందోళన 


న్యూఢిల్లీ, అక్టోబరు 2: దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఆరెస్సెస్‌  ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. పారిశ్రామిక రంగానికి అనువైన వాతావరణం కల్పిస్తే ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని సూచించారు. భారత్‌ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిరుద్యోగం,  ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు వంటి సమస్యలను ప్రస్తావించిన సమయంలోనే ఆరెస్సెస్‌ నేత ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆదివారం ఢిల్లీలో ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ స్వావలంబి భారత్‌ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘దేశంలో ఇప్పటికీ పేదిరకం భూతంలా తిష్ఠ వేసింది. మనం ఈ భూతాన్ని పారదోలడం చాలా ముఖ్యం. ఇప్పటికీ 20 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండటం చాలా బాధాకరం. 23 కోట్ల మందికి పైగా ప్రజల దినసరి ఆదాయం రూ.375 కంటే తక్కువగా ఉంది.


దేశంలో నిరుద్యోగ రేటు 7.6 శాత ఉన్నట్టు కార్మిక శక్తి సర్వే చెబుతోంది. ప్రపంచంలో టాప్‌-6 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే దేశ జనాభాలో ఒక శాతం మంది చేతిలో దేశ సంపదలో 20 శాతం ఉండటం శుభ పరిణామమా? అదే సమయంలో దేశ జనాభాలో 50 శాతం మందికి దేశ సంపదలో 13 శాతం మాత్రమే ఉంది’’ అని హొసబలె అన్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీరు, పోషక ఆహారం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేని విద్య, పౌర కలహాలు, వాతావరణ మార్పులు, ప్రభుత్వ అసమర్థత పేదరికానికి కారణాలని విశ్లేషించారు. పట్టణ ప్రాంతాల్లోనే ఉద్యోగాలు ఉండటం, ఉపాధి కోసం గ్రామీణులు వలస వెళ్లడం వల్ల నగర జీవితాలు దుర్భరంగా మారాయని అన్నారు. స్థానిక అవసరాలకు తగినట్టుగా ఎక్కడికక్కడ ప్రతిభను ఉపయోగించుకుని గ్రామీణ స్థాయిలో ఉద్యోగాలు సృష్టించవచ్చునని కొవిడ్‌ సమయంలో తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రతి పని ముఖ్యమైనదని, సమాన గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు. మన ఆలోచనలను మార్చుకోవాలన్నారు. 

Updated Date - 2022-10-03T09:23:58+05:30 IST