ఉద్యోగాలు షిఫ్ట్‌!

ABN , First Publish Date - 2020-07-06T10:34:34+05:30 IST

విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టేశారు.

ఉద్యోగాలు షిఫ్ట్‌!

విద్యుత్‌ శాఖలో ఆపరేటర్ల తొలగింపు?

టీడీపీ హయాంలో నియమితులైనవారే టార్గెట్‌!

నాన్‌లోకల్‌ పేరిట ఇంటికి!

తమవారి కోసం అధికార పార్టీ నాయకుల ప్రయత్నం

తొలిగా సర్వేపల్లిలో 8 మందికి ఉద్వాసన

జిల్లావ్యాప్తంగా ఇదే పంథాకు సన్నాహాలు

ప్రమాదంలో 1,110 మంది భవితవ్యం


నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), జూలై 4 : విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలకు  ఎసరు పెట్టేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారిని నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించి ఆ స్థానాల్లో తమ పార్టీకి చెందిన వారిని నియమించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే ఈ ప్రక్రియకు సర్వేపల్లి నియోజకవర్గం శ్రీకారం చుట్టింది. మెల్లమెల్లగా ఇది జిల్లా అంతా పాకే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే జిల్లావ్యాప్తంగా 33-11 కేవీ సబ్‌ స్టేషన్లలో పనిచేస్తున్న 1100 మంది ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడబోతున్నది.


సర్వేపల్లి నియోజకవర్గంలో కొద్ది రోజులుగా షిఫ్ట్‌ ఆపరేటర్ల తొలగింపు వివాదం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గం పరిధిలోని 8 మంది షిఫ్ట్‌ ఆపరేటర్లను పక్కన పెట్టేశారు. దీనికి కారణం వీరంతా నాన్‌ లోకల్‌ కాబట్టి విధుల నుంచి తప్పించామని చెబుతున్నా, వాస్తవం మాత్రం రాజకీయ కారణమనే ప్రచారం జరుగుతోంది. వీరంతా గత తెలుగుదేశం హయాంలో మాజీ మంత్రి సోమిరెడ్డి సిఫార్సుతో నియమితులైన వారుగా తెలుస్తోంది. అప్పట్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నా నియామకాల విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు అధికారం కాకాణి చేతుల్లోకి రావడంతో తన మనుషులను ఆ పోస్టులో పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ క్రమంలో  2014-15లో షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నియమితులైన వారందరిని విధుల నుంచి తొలగిస్తున్నారని తెలిసింది. తొలి విడతగా నియోజకవర్గ పరిధిలోని 8 మందిని పక్కన పెట్టేశారు. వీరికి అన్యాయం చేయవద్దని ట్రాన్స్‌కో ఉద్యోగ సంఘాలు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, వీరంతా నాన్‌లోకల్‌ కాబట్టి  తొలగిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది. ఈ కారణమే నిజమైతే నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న మరింత మందికి దశల వారీగా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. 


వెయ్యి మంది ఉద్యోగాలకు ప్రమాదం

సర్వేపల్లితో మొదలైన ఈ రాజకీయ ప్రతీకార వ్యవహారం మెల్లమెల్లగా జిల్లా అంతా వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. నాయుడుపేట డివిజన్‌లో 180, నెల్లూరు రూరల్‌ డివిజన్‌లో 190, నెల్లూరు టౌన్‌ డివిజన్‌లో 100, గూడూరులో 200, ఆత్మకూరులో 240, కావలిలో 200 మొత్తం సుమారు 1110 మంది షిఫ్ట్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. వీరిలో అత్యఽధికులు చిన్నాచితకా రాజకీయ నాయకులకు లక్షలాది రూపాయలు పారితోషికంగా చెల్లించి, ఈ ఉద్యోగాలు సంపాదించారు. ఎప్పటికైనా పర్మినెంట్‌ కాకపోతామా అనే ఆశతో భారీగా ముడుపులు చెల్లించి కూడా కొందరు ఉద్యోగాల్లో చేరారు. భవిష్యత్తు మీద ఆశతో రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే సర్వేపల్లిలో మొదలైన తొలగింపులతో వీరిందరికి ప్రమాదం ఏర్పడనుంది. ఒకవేళ తొలగించకున్నా, తొలగించకుండా ఉండేందుకు మరోసారి పారితోషకాలు చెల్లించుకోవాల్సి రావచ్చు.


పెద్ద నాయకులు నిజాయితీగా ఉన్నా, ద్వితీయశ్రేణి నాయకులు ఈ అవకాశాన్ని వదులుకుంటారనే గ్యారెంటీ లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న షిఫ్ట్‌ ఆపరేటర్లను తొలగించి కొత్తగా నియమాకాలు చేపట్టడానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రితో చర్చలు జరిగినట్లు ట్రాన్స్‌కో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎటు చూసినా షిఫ్ట్‌ ఆపరేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. 

Updated Date - 2020-07-06T10:34:34+05:30 IST