హెచ్-1బీ వీసాలపై బైడెన్ మరో కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2021-03-13T12:58:16+05:30 IST

హెచ్‌1బీ వీసాపై పనిచేసే విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమలును 60 రోజులపాటు వాయిదావేస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. అమెరికా కార్మిక శాఖ ఫిబ్రవరి 1న ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు 15 రోజులు సమయమిచ్చింది. మొత్తం 57 అభిప్రాయాలు వచ్చాయి.

హెచ్-1బీ వీసాలపై బైడెన్ మరో కీలక నిర్ణయం !

కనీస వేతన పెంపుపై ట్రంప్‌ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలు వాయిదా!

బైడెన్‌ సర్కారు నోటిఫికేషన్‌ విడుదల

గతంలో వార్షిక వేతనం 65 వేల డాలర్లు

1,10,000కు పెంచిన ట్రంప్‌

భారతీయ అమెరికన్ల ప్రతిభకు గుర్తింపు

వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ

అమెరికా కోలుకుంటోంది: బైడెన్‌ 

వాషింగ్టన్‌, మార్చి 12: హెచ్‌1బీ వీసాపై పనిచేసే విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమలును 60 రోజులపాటు వాయిదావేస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. అమెరికా కార్మిక శాఖ ఫిబ్రవరి 1న ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు 15 రోజులు సమయమిచ్చింది. మొత్తం 57 అభిప్రాయాలు వచ్చాయి. వాటిని పరిశీలించిన కార్మిక శాఖ.. వేతన పరిమితి పెంపుపై ట్రంప్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం అమలు తేదీని మే 14కు వాయిదా వేసింది. హెచ్‌1బీ వీసాపై పనిచేసేవారి వార్షిక వేతన పరిమితి 65 వేల డాలర్లుగా ఉండేది. దాన్ని ఏకంగా లక్షా పదివేల డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ సర్కారు గత ఏడాది అక్టోబరులో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అమలు తేదీని మార్చి 15గా అప్పట్లో ప్రకటించారు. దాన్నిప్పుడు బైడెన్‌ సర్కారు వాయిదా వేసింది. ఈ నిర్ణయం అమెరికాలో పనిచేసే చాలామంది విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ టెకీలకు ఊరట కలిగించేదే. ఎందుకంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. 1,10,000 డాలర్ల కన్నా తక్కువ వార్షిక వేతనం ఉన్నవారు స్వదేశానికి తిరిగిరావాల్సిందే. కొత్తగా వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. 


కంపెనీలు ఆచితూచి తమ ఉద్యోగులను అమెరికాకు పంపుతాయి. కాగా.. హెచ్‌1బీ వీసాలకు సంబంధించి ట్రంప్‌ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను బైడెన్‌ సర్కారు వెనక్కితీసుకోవడాన్ని ‘ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ రిఫార్మ్‌ (ఫెయిర్‌) వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా.. హెచ్‌1బీ వీసాల విషయంలో లాటరీ పద్ధతికి మళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల.. విదేశీయుల్లో అత్యుత్తమ ప్రతిభ గలిగినవారు మాత్రమే అమెరికాలో ఉంటారని ఫెయిర్‌ పేర్కొంటోంది. ట్రంప్‌ నిర్ణయాలను అమలు చేయడం వల్ల హెచ్‌1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని.. దానివల్ల అమెరికన్‌ ఉద్యోగులకు మేలు కలుగుతుందని తెలిపింది. కాగా... సైన్స్‌ అయినా, విద్యారంగమైనా.. ప్రభుత్వంలోనైనా.. భారతీయ అమెరికన్లు గొప్ప పాత్ర పోషిస్తారని బైడెన్‌ విశ్వసిస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ తెలిపారు. అందుకే ప్రవాసభారతీయులను గుర్తించి, గౌరవిస్తున్నట్టు తెలిపారు. కిందటివారం నాసా శాస్త్రవేత్తలతో మాట్లాడినప్పుడు బైడెన్‌ భారతీయుల ప్రతిభాసామర్థ్యాలను ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌.. తన యంత్రాంగంలో దాదాపు 58 మంది భారతీయులను నియమించుకున్న సంగతి తెలిసిందే. వారిలో దాదాపు సగం మంది మహిళలే కావడం గమనార్హం. 


కలలు సాకారం..

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 50 రోజులైన సందర్భంగా ప్రజలతో గురువారంనాడు మాట్లాడిన బైడెన్‌.. ‘అమెరికా కోలుకుంటోంది’ అని ప్రకటించారు. కరోనా మహమ్మారిని జయించిందని, ఆ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ కోలుకుంటోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా.. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ, సరఫరా.. అన్నీ ఒక అద్భుతంలా జరిగాయని ఆయన వివరించారు. అలాగే.. అంగారక గ్రహంపై పర్‌సర్వెన్స్‌రోవర్‌ దిగి అద్భుతమైన చిత్రాలను పంపిందని, అమెరికన్ల కలలను సాకారం చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు.. కోట్లాది మంది అమెరికన్లకు ఉపశమనం కలిగించే ‘అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ చట్టంపై తాను సంతకం చేసినట్టు తెలిపారు. ఈ చట్టం ప్రకారం 1400 డాలర్ల రెస్క్యూ చెక్‌లను ఆపన్నులకు అందజేస్తామన్నారు. సగటున 1,10,000 డాలర్లు సంపాదించే నలుగురు సభ్యుల కుటుంబం కరోనా వల్ల దెబ్బతింటే.. దీని ద్వారా వారికి5600 డాలర్లు అందుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో తాను, తన భార్య, అమెరికా ఉపాధ్యక్షురాలు, ఆయన భర్తతో కలిసి అమెరికన్‌ ప్రజలను నేరుగా కలిసి మాట్లాడి.. ఈ చట్టం గురించి వివరిస్తానన్నారు. ‘‘మనమంతా ఎవరి పనులు వారు చేస్తే దేశప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని, ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని తెలిపారు.


Read more