బిల్ క్లింటన్ తర్వాత.. ఆ ఘనత బైడెన్‌కే దక్కింది !

ABN , First Publish Date - 2020-11-14T21:33:12+05:30 IST

జార్జియాలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చారిత్రాత్మక విజయం సాధించారు. దీంతో బిల్ క్లింటన్ తర్వాత ఓ అరుదైన ఘనత బైడెన్‌కు దక్కింది.

బిల్ క్లింటన్ తర్వాత.. ఆ ఘనత బైడెన్‌కే దక్కింది !

జార్జియాలో చారిత్రాత్మక విజయంతో బైడెన్ అరుదైన ఘనత !   

వాషింగ్టన్: జార్జియాలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చారిత్రాత్మక విజయం సాధించారు. దీంతో బిల్ క్లింటన్ తర్వాత ఓ అరుదైన ఘనత బైడెన్‌కు దక్కింది. 1992లో చివరిసారిగా డెమొక్రటిక్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో బిల్ క్లింటన్ గెలిచారు. క్లింటన్ తర్వాత డెమొక్రట్స్ ఇక్కడ గెలిచిన దాఖాలాలు లేవు. దీంతో ఈ రాష్ట్రం రిపబ్లికన్స్‌కు కంచుకోటగా మారింది. కానీ, ఈఎన్నికల్లో ఈ పరంపరను బైడెన్ బ్రేక్ చేశారు. బిల్ క్లింటన్ తర్వాత జార్జియాలో గెలిచి చరిత్ర సృష్టించారు. శుక్రవారం జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. జార్జియాలో బైడెన్ గెలవగా... నార్త్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు. జార్జియాలో బైడెన్‌కు 49.5 శాతం ఓట్లు పోలవగా.. ట్రంప్‌కు 49.2 ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ 14,152 ఓట్ల తేడాతో ట్రంప్‌ను ఓడించారు. 


అయితే ఇక్కడ ఒక యాధృచ్ఛికత చోటు చేసుకుంది. అదేంటంటే... 2016లో ట్రంప్ సాధించిన మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 306 కాగా, డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలో దిగిన హిల్లరీ క్లింటన్ 232 ఎలక్టోరల్ ఓట్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఇవే డిజిట్స్ రిపీట్ అయ్యాయి. కాకపోతే తారుమారు అయ్యాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తే.. ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. ఇక అధ్యక్ష పీఠం అధిష్టించడానికి కావాల్సిన 270 మేజిక్ ఫిగర్‌ను బైడెన్ ఎప్పుడో అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు బైడెన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.    


అలాగే నార్త్ కరోలినాలో ట్రంప్‌కు 50 శాతం ఓట్లు రాగా... బైడెన్‌కు 48.6 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో బైడెన్‌పై ట్రంప్ 73,600 ఓట్ల తేడాతో భారీ విజయం నమోదు చేశారు. ఇక శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కౌంటింగ్ 97 శాతం పూర్తి కాగా... బైడెన్‌కు 50.8 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్‌కు 47.4 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో 3.4 శాతం ఓట్ల తేడాతో(సుమారు 5.3 మిలియన్ల ఓట్లు) ట్రంప్‌ను బైడెన్ ఓడించారు. ఇక మొత్తం ఫలితాలు వచ్చేసరికి బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే.. ట్రంప్ 232 ఓట్లు మాత్రమే సాధించారు.

Updated Date - 2020-11-14T21:33:12+05:30 IST