టీకా పంపిణీలో అమెరికా అసాధారణ విజయం

ABN , First Publish Date - 2021-04-22T18:08:18+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 200 మిలియన్ డోసుల టీకా పంపిణీ పూర్తైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రభుత్వ పనితీరుపట్ల

టీకా పంపిణీలో అమెరికా అసాధారణ విజయం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 200 మిలియన్ డోసుల టీకా పంపిణీ పూర్తైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రభుత్వ పనితీరుపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్న నిర్దేశించుకున్న గడువు కంటే వారం రోజుల ముందే లక్ష్యాన్ని సాధించినట్టు పేర్కొన్నారు. టీకా పంపిణీలో అమెరికా అద్వితీయ విజయం సాధించినట్టు బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘200 మిలియన్ డోసుల వ్యాక్సిన్ పంపిణీ లక్ష్యాన్ని నేడు సాధించాం. ఇది అసాధారణ విజయం. అయితే మనం ఏకాస్త ఏమరపాటుగా ఉన్నా మహమ్మారి పంజా విసురుతుంది. మనం సాధించిన అభివృద్దిని దెబ్బతీస్తుంది’ అని పేర్కొన్నారు. 


కాగా.. అమెరికా అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి వందరోజుల్లో 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్దేశించుకున్న గడువుకు ముందే అమెరికాలో 100 మిలియన్ డోసుల టీకా పంపిణీ ప్రక్రియ పూర్తైంది. ఈ క్రమంలో బైడెన్ తన లక్ష్యాన్ని 200 మిలియన్ డోసులకు పెంచుకున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్న గడువుకు వారం రోజుల ముందే అమెరికా చేరుకుంది. అమెరికాలో దాదాపు నాల్గొవ వంతుపైగా ప్రజలు కొవిడ్ టీకాను తీసుకున్నారు.  


Updated Date - 2021-04-22T18:08:18+05:30 IST