బైడెన్‌కు ఫైజర్ టీకా రెండో డోసు

ABN , First Publish Date - 2021-01-12T13:53:33+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ టీకా రెండో డోసు తీసుకున్నారు.

బైడెన్‌కు ఫైజర్ టీకా రెండో డోసు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ టీకా రెండో డోసు తీసుకున్నారు. 78 ఏళ్ల బైడెన్ నెవార్క్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) వ్యాక్సిన్ వేయించుకున్నారు. గతేడాది డిసెంబర్ 21న టీకా మొదటి డోసు తీసుకున్న బైడెన్.. ప్రజల్లో టీకా పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ఆయన బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికన్లందరికీ టీకా అందించడమే తన ప్రథమ లక్ష్యమని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. ఇక ఫైజర్, మోడెర్నా టీకాలకు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం ఇప్పటి వరకు సుమారు 25.5 మిలియన్ల మొదటి డోసు వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులు, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్‌కు చేరవేసింది. అయితే, వీటిలో కేవలం 9 మిలియన్ల డోసులు మాత్రమే ఉపయోగించినట్లు అధికారిక డేటా లెక్కలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే.. అమెరికాను వణికిస్తున్న మహమ్మారి ఇప్పటికే 3.75 లక్షలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికీ ప్రతిరోజు 3వేలకు పైగా మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగించే విషయమని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 


Updated Date - 2021-01-12T13:53:33+05:30 IST