300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు ఖాయం: బైడెన్

ABN , First Publish Date - 2020-11-07T20:15:53+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాల పీటముడి ఇంకా వీడలేదు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఐదింటిలో మూడు రాష్ట్రాల్లో(నెవెడా, జార్జియా, పెన్సిల్వేనియా) డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు ఖాయం: బైడెన్

విల్మింగ్టన్(యూఎస్): అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాల పీటముడి ఇంకా వీడలేదు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఐదింటిలో మూడు రాష్ట్రాల్లో(నెవెడా, జార్జియా, పెన్సిల్వేనియా) డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువైన బైడెన్... వీటిలో ఏ ఒక్క రాష్ట్రంలో గెలిచిన అధ్యక్ష పీఠం అధిరోహించడం ఖాయం. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి డెలావేర్‌లోని వెల్మింగ్టన్ నుంచి ప్రసంగించారు. "మనం ట్రంప్‌పై భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో సంయమనం, కలిసికట్టుగా ఉండడం ఎంతో ముఖ్యం" అన్నారు. 


"ప్రస్తుతం మన దగ్గర తుది ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం లేనప్పటికీ... ఈ పోటీల్లో గెలుపు మాత్రం కచ్చితంగా మనదే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నా అంచనా ప్రకారం సుమారు 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లతో విజయం సాధించబోతున్నాం." అని అక్కడికి వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ అన్నారు. "నేను టీవీలో చూస్తున్నాను. ప్రస్తుతం ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతోంది. ఇప్పుడు వస్తున్నవి కేవలం నంబర్స్ మాత్రమే. వాటి వెనకాల అమెరికన్ల ఆశలు, ఆశయాలు ఉన్నాయని నాకు తెలుసు. వాటిని తప్పకుండా తీరుస్తాను. నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు సమస్య, జాతి విద్వేషం అంశాలపై మొదట దృష్టిసారించాలి. నాకు మద్దతుగా మీరు వేసిన ఓటుకు కచ్చితంగా ఫలితం ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చిన వారిలో డెమొక్రట్స్ ఉండొచ్చు, రిపబ్లికన్స్ ఉండొచ్చు.. కానీ, మొదట మనం అమెరికన్స్ అని మరిచిపోవద్దు." అని అన్నారు. 


ప్రస్తుత సమయంలో మహమ్మారి కరోనా విజృంభణ దేశవ్యాప్తంగా మళ్లీ మొదలైందని, ఇక్కడికి వచ్చిన వారు సామాజిక దూరం పాటించాలని బైడెన్ సూచించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే కొవిడ్-19 నిర్మూలనపై తక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికను అధికారులతో చర్చించి సిద్ధంగా ఉంచామన్నారు. అప్పటివరకు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ కూడా పాల్గొన్నారు. కానీ, ఆమె ఏమీ మాట్లాడాలేదు. ఇక ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు వస్తే... ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇంకా ఫలితాలు రావాల్సిన పెన్సిల్వేనియా- 27,130 ఓట్లు, అరిజోనా- 29,861, జార్జియా-4,020, నెవెడా-22,657 ఓట్ల ఆధిక్యంలో బైడెన్ కొనసాగుతున్నారు. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశం ఉంది.    

Updated Date - 2020-11-07T20:15:53+05:30 IST