Joe Biden: రాగల 24-36 గంటల్లో కాబూల్‌‌లో మరోసారి పేలుళ్లు!

ABN , First Publish Date - 2021-08-29T17:38:39+05:30 IST

రాగల 24-36 గంటల్లో కాబూల్‌ విమానాశ్రయంలో మరోసారి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

Joe Biden: రాగల 24-36 గంటల్లో కాబూల్‌‌లో మరోసారి పేలుళ్లు!

వాషింగ్టన్: రాగల 24-36 గంటల్లో కాబూల్‌ విమానాశ్రయంలో మరోసారి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఈ విషయంలో తమకు కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు. అమెరికన్ బలగాలు శనివారం ఐఎస్ఎస్​-కే ఉగ్రసంస్థ స్థావరాలపై డ్రోన్‌ దాడి ఘటన అనంతరం బైడెన్ ఈ ప్రకటన చేశారు. డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఉగ్రమూకలు రానున్న 24-36 గంటల్లో కాబుల్‌ విమానాశ్రయంపై మరోసారి ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై తమకు సైన్యాధికారుల ద్వారా కచ్చితమైన సమాచారం అందినట్లు బైడెన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న యూఎస్ సైన్యం వారించింది. 


కాగా, కాబూల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా బైడెన్‌ ప్రకటించారు. దాదాపు 350 మంది అమెరికా పౌరులు ఇంకా అఫ్గానిస్థాన్‌లో ఉన్నారని తెలిపారు. ఇక శనివారం ఐఎస్ఎస్​-కే ఉగ్రసంస్థ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన డ్రోన్‌ దాడిలో గురువారం నాటి ఆత్మాహుతి దాడి సూత్రధారితో పాటు మరో ఉగ్రవాది హతమయ్యారు. అంతకుముందు కాబుల్ విమానాశ్రయంలో ఐసిస్ జరిపిన దాడుల్లో మొత్తం 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇదిలాఉంటే.. ఇస్లామిక్ స్థావరాలపై శనివారం జరిపిన డ్రోన్‌ దాడులు చివరికి కావని బైడెన్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడిలో తమ పౌరుల ప్రాణాలు బలిగొన్నవారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారు. 

Updated Date - 2021-08-29T17:38:39+05:30 IST