మరో ప్రచ్ఛన్నయుద్ధాన్ని కోరుకోవట్లేద్ఙు: Joe biden

Sep 22 2021 @ 02:02AM

యుద్ధాన్ని ముగించి దౌత్యశకాన్ని ఆరంభిస్తున్నాం

ఆఖరు అస్త్రంగానే సైనిక శక్తి వినియోగం

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జో బైడెన్‌


ఐక్యరాజ్యసమితి, సెప్టెంబరు 21: మరో కొత్త ప్రచ్ఛన్నయుద్ధాన్ని.. విభజిత ప్రపంచాన్ని అమెరికా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సాక్షిగా ప్రకటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జోబైడెన్‌ మంగళవారంనాడు ఐక్యర్యాజ్యసమితి సాధారణసభలో ప్రసంగించారు. చైనా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా.. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణవాతావరణం గురించి అన్యాపదేశంగా ప్రస్తావించారు. 

అఫ్ఘాన్‌లో సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధాన్ని.. అక్కణ్నుంచీ అమెరికా సేనలను ఉపసంహరించాలనే నిర్ణయం ద్వారా ముగించిన విషయాన్ని బైడెన్‌ గుర్తుచేశారు. ‘‘అఫ్ఘానిస్థాన్‌లో 20 ఏళ్ల సంఘర్షణకు మేం ముగింపు పలికాం. కఠినమైన యుద్ధాన్ని ఆపేసి.. దృఢమైన దౌత్య శకాన్ని ఆరంభిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆఖరు అస్త్రంగా మాత్రమే సైనికశక్తిని వినియోగిస్తామని తెలిపారు. అఫ్ఘాన్‌లోని మహిళలు, బాలికల హక్కుల కోసం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం నుంచి అమెరికా తనను తాను కాపాడుకుంటూనే, తన మిత్రదేశాలను కూడా కాపాడుకుంటుందని తెలిపారు. అలాగే.. ఇరాన్‌ అణ్వాయుధాలను పొందకుండా చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, జర్మనీలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. 

ఐరాసతో కలిసి పని చేస్తాం

ఐక్యరాజ్యసమితిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం ఐరాసతో కలిసి ముందుకు సాగుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ప్రసంగించే ముందు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్‌సతో బైడెన్‌ సమావేశమయ్యారు. కాగా, ఐక్యరాజ్యసమితితో అమెరికా సంబంధాలపై బైడెన్‌ సానుకూల వైఖరితో ఉన్నారని, ఇది ప్రపంచ దేశాలకు మేలు చేకూరుస్తుందని గుటెరస్‌ పేర్కొన్నారు. బైడెన్‌ అధ్యక్షుడయ్యాక ట్రంప్‌ నిర్ణయాలను రద్దు చేయడంతోపాటు ప్రపంచ ఆరోగ్యసంస్థ వంటి వాటికి నిధుల చెల్లింపునూ పునరుద్ధరించిన విషయాన్ని గుటెరస్‌ గుర్తుచేశారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.