అదే నిజమైతే.. అమెరికా అధ్యక్షుడు బైడెనే !

ABN , First Publish Date - 2020-11-03T17:08:02+05:30 IST

ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. అయితే, ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఎప్పిటిలా కాకుండా కొంచెం ఆలస్యం కావొచ్చని నిపుణుల అభిప్రాయం.

అదే నిజమైతే.. అమెరికా అధ్యక్షుడు బైడెనే !

వాషింగ్టన్ డీసీ: ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. అయితే, ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఎప్పటిలా కాకుండా కొంచెం ఆలస్యం కావొచ్చని నిపుణుల అభిప్రాయం. కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మెయిల్ ఇన్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో ముందుస్తుగా సుమారు 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటి లెక్కింపుకు సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈసారి ఫలితాలు వెంటనే వెల్లడి కావని స్పష్టం అవుతోంది. ఇదిలాఉంటే... ఇప్పటికే చాలా సర్వేలు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు తేల్చేసిన విషయం విదితమే. ఇక తాజాగా వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాల్లో బైడెన్ ఏకంగా 10(పది శాతం) పాయింట్ల అధికంలో ఉన్నట్లు తేలింది. సీఎన్ఎన్ పోల్స్ ప్రకారం బైడెన్‌కు 52 శాతం, ట్రంప్ 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తేలింది.


మిగతా సర్వే పోల్స్‌ కూడా బైడెనే ట్రంప్ కంటే 8 నుంచి 10 పాయింట్ల అధిక్యంలో కొనసాగుతున్నట్లు తేల్చిన సంగతి తెలిసిందే. వీటిలో అమెరికాలోని ప్రముఖ పబ్లికేషన్స్ సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ ఉన్నాయి. ఇక సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ ఎప్పుడూ పెదవి విరుస్తుంటారు. వీటిని ఫేక్ న్యూస్ పబ్లికేషన్స్‌గా ఆయన చెబుతుంటారు. కానీ, ఫాక్స్ న్యూస్‌పై ఆయనకు మంచి సానుభూతి ఉంది. వారికి పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అయితే, ఫాక్స్ న్యూస్ కూడా బైడెన్‌దే పైచేయి అని తేల్చేయడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ సర్వే పోల్స్‌లో బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకంజలో ఉన్నట్లు తేలింది. కాగా, 2016 అధ్యక్ష ఎన్నికల పోల్స్ ఫలితాలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు మద్దతు కాస్తా ఎక్కువగా ఉంది. 


2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆగస్టు నెలలో ట్రంప్‌పై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 10 పాయింట్ల అధిక్యంలో ఉన్నారు. అయితే, పోలింగ్ డే నవంబర్ 8 కంటే ఒక్కరోజు ముందు అంటే.. నవంబర్ 7న ఆమె అధిక్యత నాలుగు పాయింట్లకు పడిపోయింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 42 శాతంగా ఉంది. ఇక వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ అయితే హిల్లరీ కేవలం 2 పాయింట్ల కంటే కూడా తక్కువ అధిక్యతలో ఉన్నట్లు చెప్పాయి. చివరకు స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ విజయం సాధించి అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. కానీ ఈసారి దీనికి పూర్తి భిన్నంగా బైడెన్ అధిక్యతలోనే కొనసాగుతున్నారు. పోలింగ్ డే మంగళవారానికి ఒక్కరోజు ముందు సోమవారం వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాలలోనూ బైడెనే 10 పాయింట్ల స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శించడం విశేషం. చాలా మంది అమెరికన్లు మహమ్మారిని ఎదుర్కొవడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారనే భావంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ ఫ్యాక్టరే ట్రంప్‌కు ప్రతికూలంగా మారింది. ప్రాజెక్ట్ 538 ప్రకారం 67 శాతం మంది అమెరికన్లు కరోనా సంక్రమణతో బాధపడుతుంటే... 57.2 శాతం మంది ఈ సంక్షోభంపై ట్రంప్ స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. 2.30 లక్షల మంది అమెరికన్లు ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే కొవిడ్‌కు బలయ్యారని మండిపడుతున్నారు. 


అలాగే 2016లో స్వింగ్ స్టేట్స్‌లో గెలిచి అధ్యక్షుడైన ట్రంప్ ఈసారి ఆ రాష్ట్రాల్లో సైతం వెనుకంజలో ఉన్నట్లు సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. హోరాహోరీ పోరు ఉంటే మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెనే మెరుగైన స్థితిలో ఉన్నారని సీఎన్ఎన్ తాజా నివేదిక తెలిపింది. కనుక ఈసారి పోల్స్ ఫలితాలు నిజమైతే మాత్రం బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం.  

Updated Date - 2020-11-03T17:08:02+05:30 IST