సెక్యూరిటీ సిబ్బందిపై.. బైడెన్ శునకం మళ్లీ దాడి !

ABN , First Publish Date - 2021-03-31T18:56:15+05:30 IST

అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన జర్మన్ షెపార్డ్ శునకం మేజర్ మరోసారి వైట్‌హౌస్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడింది.

సెక్యూరిటీ సిబ్బందిపై.. బైడెన్ శునకం మళ్లీ దాడి !

వాషింగ్టన్: అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన జర్మన్ షెపార్డ్ శునకం మేజర్ మరోసారి వైట్‌హౌస్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఇటీవలే అధ్యక్షుడి రెండు పెంపుడు శునకాలు మేజర్, చాంప్‌లను శ్వేతసౌధానికి తీసుకువచ్చారు. ఇంతకుముందు కూడా రక్షణ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతో వీటిని డెలావేర్‌లోని ఆయన పాత ఇంటికి పంపించారు అధికారులు. ఇందులో మేజర్ అనే శునకం ఏకంగా సిబ్బందిని కరవడం, చాంప్ కూడా సిబ్బందిపై తరచూ మొరగడం చేస్తుండడంతో ఈ రెండింటినీ విల్మింగ్టన్‌లోని డెలావేర్‌లో ఉన్న బైడెన్ పాత నివాస గృహానికి తరలించారు. కొన్నిరోజులు అక్కడే ఉన్న ఈ రెండు శునకాలను ఇటీవలే వైట్‌హౌస్‌కు తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మేజర్ మరోసారి సిబ్బందిని గాయపరిచినట్లు తెలుస్తోంది. 

కాగా, ఈ రెండు శునకాలను అధ్యక్షుడు బైడెన్, ఆమె సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ 2018లో డెలావేర్ హ్యూమన్ అసోసియేషన్ నుంచి దత్తత తీసుకున్నారు. ఇక బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనవరి 25న తనకు సంబంధించిన శునకాలను అధ్యక్ష భవనానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మేజర్, చాంప్ శ్వేతసౌధంలోనే ఉంటున్నాయి. అయితే, మొదటి నుంచి ఇవి రక్షణ సిబ్బంది పట్ల దూరుసుగానే ప్రవర్తిస్తున్నాయి. ఇక గతేడాది నవంబర్‌లో మేజర్‌తో ఆడుతున్నప్పుడే బైడెన్ పాదానికి గాయం కూడా అయిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-03-31T18:56:15+05:30 IST