Jeo Root ఖాతాలో మరో రికార్డ్!

ABN , First Publish Date - 2021-08-28T00:37:24+05:30 IST

ఈ ఏడాది తిరుగులేని ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ సారథి జో రూట్ మరో రికార్డును సమం చేశాడు. ఒకే క్యాలెండర్

Jeo Root ఖాతాలో మరో రికార్డ్!

లీడ్స్: ఈ ఏడాది తిరుగులేని ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ సారథి జో రూట్ మరో రికార్డును సమం చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్ల సరసన చేరాడు. భారత్‌తో లీడ్స్‌లో జరుగుతున్న మూడో తొలి ఇన్నింగ్స్‌లో రూట్ నిన్న సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికిది వరుసగా మూడో సెంచరీ కాగా, ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇది ఆరోది. అంతకుముందు 1947లో డెనిస్ కాంప్టన్, 2002లో మైఖేల్ వాన్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఆరేసి సెంచరీలు బాదారు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టులో 109 పరుగులు చేసిన రూట్.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 180 పరుగులు చేశాడు. నిన్న 121 పరుగులు చేశాడు. కాగా, నిన్నటి సెంచరీతో రూట్ ఖాతాలోని శతకాల సంఖ్య 23కు చేరింది.


అలాగే, ఇంగ్లండ్ తరపున అన్ని ఫార్మాట్లలోనూ కలిపి అత్యధికంగా 39 సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్‌దే. భారత్‌పై అత్యధికంగా 8 శతకాలు బాదిన ఐదో ఆటగాడిగా రూట్‌ మరో రికార్డును తన పేర లిఖించుకున్నాడు. అతడికంటే ముందు గ్యారీ సోబర్స్‌, వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌ ఉన్నారు. ఇక, తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ సేన 1-0తో ముందంజలో నిలిచింది. 

Updated Date - 2021-08-28T00:37:24+05:30 IST