
విభిన్న పాత్రలు, విలక్షణ చిత్రాలతో అభిమానులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham). యాక్షన్ పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటారు. తాజాగా ‘ఏక్ విలన్-2’ (Ek Villain 2)సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీ (OTT) ప్రాజెక్టుల్లో నటించడం తనకిష్టముండదని జాన్ అబ్రహం తెలిపారు. ‘‘నిర్మాతగా ఓటీటీలంటే నాకిష్టం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా సినిమాలు నిర్మిస్తాను. నటుడిగా వెండితెర మీద కనిపించడానికే నేను ఇష్టపడతాను. నేను బిగ్ స్క్రీన్ హీరోను. పెద్ద తెరమీద కనిపించడమే నాకిష్టం. అందువల్ల వెండి తెర మీద ఆడే సినిమాలనే నేను చేయాలనుకుంటాను. కొంత మందికి ఇది అభ్యంతరకరంగా అనిపించవచ్చు. నేను ఓటీటీల్లో రూ.299, రూ. 499లకు అందరికి అందుబాటులో ఉండదలచుకోలేదు. అందువల్లే ఓటీటీలతో నాకు సమస్య ఉంది’’ అని జాన్ అబ్రహం చెప్పారు. కొన్ని రోజుల క్రితం జాన్ అబ్రహం ప్రాంతీయ సినిమాలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగు లేదా మరే ప్రాంతీయ సినిమాల్లో నటించనని తెలిపారు. తాను బాలీవుడ్ హీరోనని..ఎప్పటికీ ఇతర భాషల్లో డబ్బు కోసం రెండో హీరో, సహ నటుడి పాత్రలు చేయనన్నారు. ప్రస్తుతం జాన్ ‘టెహ్రాన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (Ayyappanum Koshiyum)హిందీ రీమేక్‌ను పట్టాలెక్కిస్తారు. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) దర్శకత్వం వహిస్తారని సమాచారం.