ఓటర్లుగా చేరండి.. చేర్పించండి

ABN , First Publish Date - 2022-10-07T05:33:54+05:30 IST

పట్టభద్రుల నియోజకవర్గాల్లో అధికారపార్టీ అభ్యర్థుల గెలుపునకు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వినియోగించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ మేరకు మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు వివిధ రకాల మౌఖిక ఆదేశాలు జారీ అవుతున్నాయి. కొన్నిచోట్ల వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు కొందరు అభ్యర్ధులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఓటర్లుగా చేరండి..  చేర్పించండి
ఓటర్లను చేర్పించాలని వలంటీర్లకు వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లు

వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి మున్సిపల్‌ కమిషనర్ల హుకుం

  నిబంధనలకు విరుద్ధం అంటున్న పట్టభద్రులు 

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పట్టభద్రుల నియోజకవర్గాల్లో అధికారపార్టీ అభ్యర్థుల గెలుపునకు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వినియోగించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ మేరకు మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు వివిధ రకాల మౌఖిక ఆదేశాలు జారీ అవుతున్నాయి. కొన్నిచోట్ల వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు కొందరు అభ్యర్ధులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎస్‌ఈసీ శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. ఆ మేరకు పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యే ప్రక్రియను ఎస్‌ఈసీ  ప్రారంభించింది. ఈనెల 7వతేదీ వరకు అందుకు గడువునిచ్చింది. కాగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోని పలుచోట్ల వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు సంబంధిత ఉన్నతాధికారులు వివిధరకాల మౌఖిక ఆదేశాలు ఇవ్వటం ప్రారంభించారు. తాజాగా కందుకూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు వివిధ రూపాల్లో ఆదేశాలు జారీచేశారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్లు అయిన వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వెంటనే ఓటరుగా నమోదయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గురువారం కందుకూరు మున్సిపల్‌ కమిషనర్‌ అయితే మరో అడుగు ముందుకేసి శుక్రవారం సాయంత్రంలోపు మీ సర్టిఫికెట్లు అన్నింటినీ మున్సిపల్‌ కార్యాలయంలో ఇవ్వాలని ఆదేశిస్తూ వాట్సా్‌పలలో సందేశం పంపారు. ఓటరుగా నమోదు చేసుకుని ఓటుహక్కు వినియోగించుకోమని చెప్పటంలో తప్పు లేకపోవచ్చు. కానీ సర్టిఫికెట్లను 24గంటల్లోగా మున్సిపల్‌ కార్యాలయంలో ఇవ్వాలని ఆదేశించటమే చర్చనీయాంశమైంది. పైగా ఇది కలెక్టరు, జాయింట్‌ కలెక్టర్లు ఇచ్చిన సూచన మేరకు ఇస్తున్న ఆదేశాలని స్పష్టంగా పేర్కొంటుండటం విశేషం. ఇంకోవైపు కొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి మీ పరిధిలోని పట్టభద్రుల సమాచారాన్ని సేకరించాలని, అలాగే వారందరు ఓటు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వలంటీర్లని ఆదేశిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు కూడా మౌఖికంగా ఇలాంటి సమాచారమే ఇచ్చారు. 

వలంటీర్లకు ఎన్నికల పనులా?

వలంటీర్లు రంగంలోకి వెళ్లి వారి పరిధిలోని కుటుంబాల్లో పట్టభద్రులను ఓటుహక్కు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించటం ఎన్నికల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైన వ్యవహారం. ఇప్పటికే వలంటీర్లుని ఎలాంటి ఎన్నికల ప్రక్రియలోను వినియోగించరాదని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేసి ఉంది. అయినా కింది స్థాయిలోని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను పరోక్షంగా వినియోగించుకునేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పులివెందుల కమిషనర్‌ ఒక వలంటీర్‌కు ఇచ్చిన ఫోన్‌ ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు కందుకూరు, మరికొందరు కమిషనర్లు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలు ఇస్తుండటంతో ఇప్పటికే అభ్యర్థులుగా ప్రచారం ప్రారంభించిన వారు ఈ విషయంపై దృష్టి సారించారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గం పరిధిలో వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా వారు కొంతకాలంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తాజాగా పీడీఎఫ్‌ తన అభ్యర్థులను ప్రకటించగా వారూ ప్రచారం ప్రారంభించారు. ఇంకోవైపు స్వతంత్య్ర అభ్యర్థులూ ప్రచారంలో ఉన్నారు. వీరిలో కొందరు తాజాగా అధికారుల చర్యలను తెలుసుకుని ఆ విషయంపై రేపో మాపో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఆ మేరకు కొందరు కమిషనర్లు వలంటీర్లకు పంపిన మెసేజ్‌లను సేకరించుకున్నట్లు కూడా తెలిసింది.


Updated Date - 2022-10-07T05:33:54+05:30 IST