ప్లాస్మా దానం చేసి ప్రాణాలను నిలపండి

ABN , First Publish Date - 2020-08-09T11:22:03+05:30 IST

ణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్లాస్మా దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి కోరారు.

ప్లాస్మా దానం చేసి ప్రాణాలను నిలపండి

ప్లాస్మా దాతను అభినందిస్తున్న అధికారులు 


జీజీహెచ్‌(కాకినాడ), ఆగస్టు 8: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్లాస్మా దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి కోరారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌లో ప్లాస్మాను దానం చేసిన వాకలపూడికి చెందిన జి.సత్యనారాయణను జేసీ కీర్తి, కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ పుండ్కర్‌ అభినందించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొవిడ్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మాను ఎక్కించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ సోకి ఆరోగ్యవంతంగా కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి ఈ వైరస్‌ బారిన పడినవారికి ఎక్కించవచ్చన్నారు.


సత్యనారాయణ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయడం శుభపరిణామమని అన్నారు. ప్లాస్మాను దానం చేయడంలో అవగాహన పెంపొందించుకుని మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపారు. కమిషనర్‌ స్వప్నిల్‌ మాట్లాడుతూ నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు ప్లాస్మాను దానం చేశారన్నారు. ప్లాస్మాను దానం చేయడం ద్వారా మరో వ్యక్తికి ప్రాణదానం చేసిన వారవుతారన్నారు. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య గల పురుషులు ప్లాస్మాను దానం చేయవచ్చన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారన్నారు. వారందరికీ పీహెచ్‌సీ డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు ప్లాస్మా దానం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. అదే విధంగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వ్యక్తులు ఉపయోగించిన బయో మెడికల్‌ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడివేయకుండా ఒక ప్రత్యేక బాక్స్‌లో వేసి ఉంచాలన్నారు. దానిని పారిశుధ్య కార్మికులు వచ్చి తీసుకెళతారన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-09T11:22:03+05:30 IST