కొలిక్కి రాని అటవీభూముల జాయింట్‌ సర్వే

ABN , First Publish Date - 2022-06-26T03:50:29+05:30 IST

జిల్లాలో అటవీ భూముల జాయింట్‌ సర్వే ఓ కొలిక్కి రావడం లేదు. పోడు భూముల వ్యవహారంలో దశాబ్ధాలుగా హద్దులపై స్పష్టత లేకపోవటమే ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఫలితంగా ఏటా అటవీశాఖ, పోడురైతులకు మధ్య వివాదాలు సర్వసాధారణంగా మారాయి.

కొలిక్కి రాని అటవీభూముల జాయింట్‌ సర్వే

- జిల్లాలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య 23వేల ఎకరాల్లో వివాదాలు?

- ప్రతిపాదనలకే పరిమితమైన సమగ్ర సర్వే

- సమస్యలు వచ్చిన చోట మొక్కుబడి సర్వేలు

- తరచూ ఘర్షణలకు కారణం ఇదే 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో అటవీ భూముల జాయింట్‌ సర్వే ఓ కొలిక్కి రావడం లేదు. పోడు భూముల వ్యవహారంలో దశాబ్ధాలుగా హద్దులపై స్పష్టత లేకపోవటమే ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఫలితంగా ఏటా అటవీశాఖ, పోడురైతులకు మధ్య వివాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా పెంచికల్‌పేట మండలం కొండపల్లి, బెజ్జూరు మండలం తలాయి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మండలాల్లో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ పట్టాలున్నా అటవీశాఖ ఆ భూములు తమవిగా క్లెయిం చేసుకుంటుండటంతో సమస్యలు ఉత్పన్నమవు తున్నాయని చెబుతున్నారు. 70 ఏళ్లుగా భూముల హద్దులను తెల్చేందుకు సంయుక్త సర్వే జరపాలన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఈ క్రమంలో అటవీప్రాంత గ్రామాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రెవెన్యూ పట్టాలు కలిగిన రైతులకు మధ్య తారతమ్యం లేకుండా పోయింది. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ జిల్లాలో అడవులను ఆనుకొని ఉన్న వాంకిడి, కెరమెరి, జైనూరు, తిర్యాణి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు మండలాల పరిధిలో వేలాది ఎకరాల భూములకు స్పష్టమైన హద్దులు లేవు. అయితే ఇదంతా ఒకప్పుడు అటవీ ప్రాంతమని అటవీ శాఖ చెబుతుండగా ఇవి రెవెన్యూ భూములు కాబట్టే పట్టాలిచ్చామంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇలా ఒక్కో మండలంలో సగటున 800నుంచి 1500 ఎకరాల వరకు రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2019లో సేకరించిన గణాంకాల ప్రకారం 23వేల ఎకరాల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలున్నట్టు తేలిందని చెబుతున్నారు. అయితే ఇందులో 80శాతానికి పైగా రెవెన్యూ భూములేనని ఆ శాఖ వాదిస్తుండగా వారు ఇచ్చిన పట్టాలు నకిలీవని వాదిస్తూ అటవీ అధికారులు వాటిని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కొత్తసార్సాల మొదలుకొని కొండపల్లి వరకు ఉత్పన్న మైన వివాదాలన్నింటి వెనుక ఈ తరహా వివాదాలే కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అటవీశాఖ ఎందుకు పూర్తిస్థాయిలో సమగ్రసర్వేకు ప్రయత్నించడం లేదన్న దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సమస్యలు వచ్చిన చోట మొక్కుబడి సర్వేలు

జిల్లాలో విడమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా రైతులు, అటవీశాఖల మధ్య వివాదం రాజకీయ పక్షాలకు సంకటంగా మారిందని చెబుతున్నారు. 2015నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదేళ్లలో సమస్యలు ఉత్పన్న మైన వాటిలో మాత్రమే సంయుక్త సర్వేల పేరిట హడావుడి చేసి తర్వాత ఈ ప్రతిపాదనలను పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా అటవీశాఖ ఎలాంటి ఆధారాలు లేకుండానే దశాబ్ధాలుగా రైతులు సాగు చేసుకుం టున్న భూములను ఏ ఆధారంతో తమవిగా చెబుతోందని రాజకీయ పక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రెండుశాఖల మధ్య వివాదం కారణంగా పలుసార్లు దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. తాజాగా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో గతంలో రెవెన్యూశాఖ రైతులకు లావుణి పట్టాలిచ్చింది. అయితే రెండేళ్లుగా ఆ భూములు అటవీశాఖకు చెందినవని చెబుతూ ఆ శాఖ సిబ్బంది రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు అడ్డుకుంటున్నారు. ఇటీవల ఈ వివాదం కాస్త ముదిరి ఓ రైతు అధికారుల సమక్షంలోనే ఆత్మహుతి చేసుకునేందుకు ప్రయ త్నించడంతో ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సిర్పూరు శాసనసభ్యుడు కోనప్ప విపక్షాలకు చెందిన నాయకులు ఈ వ్యవహారాన్ని తేల్చాలంటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ భూములు ఎవరివో తేల్చేందుకు సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఓ వైపు సంయుక్త సర్వే జరుగుతుండగానే మరోసారి రైతులకు, అటవీశాఖకు మధ్య వివాదం తలెత్తింది. అయితే భూముల నిగ్గు తేలేంత వరకు రైతులు తమ భూములను యధావిధిగా సాగు చేసుకోవచ్చంటూ కలెక్టర్‌ అనుమతి ఇచ్చినా అటవీసిబ్బంది మళ్లీ వివా దాన్ని సృష్టించే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కొండపల్లితో పాటు బెజ్జూరు, ఆసిఫాబాద్‌లోనూ ఇదే తరహాలో సంయుక్త సర్వే జరపాలని నిర్ణయించినట్టు సమాచారం. 

సమస్యలు వచ్చిన చోటే సంయుక్త సర్వే..

-శాంతారాం, జిల్లా అటవీశాఖ అధికారి 

జిల్లాలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న పలుచోట్ల రెవెన్యూశాఖ పట్టాలిచ్చిన విషయం మాదృష్టిలో ఉంది. అయితే ప్రస్తుతం వివాదాలు ఉత్పన్న మైన చోట మాత్రమే సంయుక్త సర్వే జరుపుతున్నాం. చాలాచోట్ల రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టాలు సరైనవి కావని తేలింది. సర్వే తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాం.

Updated Date - 2022-06-26T03:50:29+05:30 IST