టీడీపీలో జోష్‌

ABN , First Publish Date - 2022-07-07T07:18:07+05:30 IST

అటు పార్టీ నిర్మాణం, ఇటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అంశాలపై పోరాటాలకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిరోజూ నియోజకవర్గాల వారీ పార్టీశ్రేణుల పనితీరుపై అధినేత చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు.

టీడీపీలో జోష్‌

ఇటు నిర్మాణం అటు బాదుడే బాదుడుతో బిజీ

ఉత్సాహంగా  పాల్గొంటున్న పార్టీశ్రేణులు

అన్ని అంశాల్లోనూ అగ్రస్థానంలో కనిగిరి

ఆతర్వాత మార్కాపురం డివిజన్‌ 

దర్శిలో అయోమయ పరిస్థితి

బాపట్ల సెగ్మెంట్‌లో ముందున్న ఎస్‌ఎన్‌పాడు, పర్చూరు 

చివర్లో చీరాల

కందుకూరులో ఇంటూరి  ఒంటరి పోరు

 రోజువారీ సమీక్ష చేస్తున్న  అధినేత చంద్రబాబునాయుడు

అటు పార్టీ నిర్మాణం, ఇటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అంశాలపై పోరాటాలకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిరోజూ నియోజకవర్గాల వారీ పార్టీశ్రేణుల పనితీరుపై అధినేత చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. వారంలో రెండు, మూడుసార్లు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి బాగా చేసిన నాయకులను మెచ్చుకుంటూ, వెనుకబడిన వారిని హెచ్చరిస్తున్నారు. దీంతో టీడీపీలోనే నియోజకవర్గాల నాయకుల మధ్య పోటీతత్వం పెరిగింది. పార్టీ సభ్యత్వ నమోదులో కనిగిరి జిల్లాలోనే అగ్రస్థానంలో ఉండటమే కాక రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో ఉంది. ఇక పార్టీ కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు నిర్వహణ తదితర అంశాల్లో కూడా ముందుంది. ఆ తర్వాత మార్కాపురం డివిజన్‌లో జోరుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. అకస్మాత్తుగా దర్శి ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో అక్కడ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. బాపట్ల లోక్‌సభ పరిధిలోని ఎస్‌ఎన్‌పాడు, పర్చూరు ముందుండగా చీరాల చివర్లో ఉంది. కందుకూరులో ఇన్‌చార్జ్‌ నాగేశ్వరరావు ఒంటరి పోరాటం చేస్తున్నారు.  

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పార్టీ నిర్మాణ వ్యవహారాలకు ఆరంభం నుంచి టీడీపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే ప్రజా ఉద్యమాల్లోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఆపార్టీ అధినేత చంద్రబాబు మొత్తం పార్టీ యంత్రాంగాన్ని ఆ వైపే నడుపుతున్నారు. నిర్మాణపరంగా సభ్యత్వ నమోదును ముమ్మరంగా చేయాలని.. గ్రామ, మండల, క్లష్టర్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందుకు కూడా నిర్ణీత సమయాన్ని కేటాయించారు. కమిటీల ఏర్పాటు సమయం దాటిపోయి ప్రస్తుతం సభ్యత్వ నమోదు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు పన్నులు, పెట్రో, నిత్యావససరాల ధరల పెంపును నిరసిస్తూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఊరూరా నిర్వహించాలని ఆదేశించారు. వీటన్నింటి పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నేరుగా చంద్రబాబే సమీక్షలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ నేతల పనితీరు, కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై సమీక్షించారు.


అన్నింటా ముందున్న కనిగిరి

పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల విషయాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం అగ్రస్థానంలో కొనసాగుతోంది. సభ్యత్వ నిర్వహణలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. పార్టీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డిని రెండురోజుల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాన్ని 31,627మంది తీసుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రాతినిఽథ్యం వహిస్తున్న కుప్పంలో 51,000మంది సభ్యత్వం తీసుకోగా లోకేష్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న మంగళగిరిలో 45,000మంది సభ్యత్వం తీసుకున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కనిగిరి నియోజకవర్గంలోని 107 గ్రామాల్లో 155 ప్రాంతాల్లో నిర్వహించారు. గ్రామ, మండల, క్లస్టర్‌ కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పడ్డాయి. 


మార్కాపురం డివిజన్‌లో ఊపు

కనిగిరి తర్వాత ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం సభ్యత్వాలు, కమిటీల ఏర్పాటు, బాదుడేబాదుడులోనూ ముందున్నాయి. వైపాలెంలో 9,417మంది సభ్యత్వం తీసుకోగా జిల్లాలో ఆ నియోజకవర్గం ద్వితీయస్థానంలో ఉంది. ఆ తర్వాత గిద్దలూరులో 6,035మంది, మార్కాపురంలో 5,237 మంది పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఒంగోలులో 6,747మంది సభ్యత్వాన్ని తీసుకున్నప్పటికీ ఇతర కార్యక్రమాల నిర్వహణలో ఆ నియోజకవర్గాలు ముందున్నాయి. కొండపిలో 4,757మంది సభ్యత్వం తీసుకున్నారు. ఇక బాదుడేబాదుడులో 133 కార్యక్రమాలతో మార్కాపురం, 115తో గిద్దలూరు, 112తో కొండపి, 93తో వైపాలెం, 79కార్యక్రమాలతో ఒంగోలు నియోజకవర్గాలు వరుసగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంతమంది పాల్గొన్నారో అని కూడా అధిష్ఠానం పరిశీలించింది. అత్యధికంగా 107 గ్రామాలకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఉగ్ర ఇక్కడ కూడా ముందున్నారు. ఆ తర్వాత గిద్దలూరు ఇన్‌చార్జ్‌ అశోక్‌రెడ్డి 62, వైపాలెం ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు 50, మార్కాపురం ఇన్‌చార్జ్‌ నారాయణరెడ్డి 46, ఒంగోలు ఇన్‌చార్జ్‌ దామచర్ల జనార్దన్‌ 18, కొండపి ఎమ్మెల్యే స్వామి 8 గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక గ్రామ, మండల క్లస్టర్‌ పార్టీ కమిటీల ఏర్పాటులోనూ కనిగిరి ముందుంది.


వెనుకబడిన దర్శి

అనూహ్యంగా ఈ అన్ని అంశాల్లో దర్శి నియోజకవర్గం వెనుకబడింది. అక్కడ 3,921మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం 113 ప్రాంతాల్లో జరిగినప్పటికీ ఇన్‌చార్జ్‌ కేవలం ఒక ప్రాంతంలో పాల్గొన్నట్లు అధిష్ఠానం గుర్తించింది. క్లస్టర్‌ కమిటీల ఏర్పాటు నియోజకవర్గంలో జరగనేలేదు. గత కొద్దిరోజులుగా ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ఆ నియోజకవర్గానికి వెళ్తున్న దాఖలాలు లేవు. దర్శిలోని పార్టీ కార్యాలయం కూడా మూసేశారు. అయితే ఆయన ఇటీవల బాబును కలిసి వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని అని ప్రకటిస్తేనే ముందుకుపోతానని, లేకపోతే కష్టమని చెప్పినట్లు తెలిసింది. అందుకు ప్రతిగా చంద్రబాబు కూడా ‘నీకు ముందే చెప్పాం. ఇప్పుడు చెబుతున్నాం.. పనిచేయండి. పట్టుతెచ్చుకుంటే మీకే అవకాశం ఇస్తాం, లేకపోతే ప్రత్యామ్నాయం తప్పదు. ఇప్పటికిప్పుడు చెప్పాలంటే కష్టం’ అని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఆ నియోజకవర్గ వ్యవహారంపై అధిష్ఠానం రానున్న రోజుల్లో ఎలా ముందడుగు వేస్తుందనేది వేచిచూడాలి.


బాపట్ల లోక్‌సభలో.. 

బాపట్ల లోక్‌సభ పరిధిలో ఎస్‌ఎన్‌పాడు, పర్చూరు సభ్యత్వ నమోదులో ముందున్నాయి. ఇప్పటికీ పార్టీ సభ్యత్వం ఎస్‌ఎన్‌పాడులో 5,227మంది తీసుకోగా ఆ తర్వాత అధికంగా పర్చూరులో 4,985 మంది తీసుకున్నారు. అయితే బాదుడేబాదుడు కార్యక్రమం, కమిటీల ఏర్పాటు ఇతర పార్టీ వ్యవహారాల్లో పర్చూరు ముందుంది. బాపట్ల జిల్లా వరకు చూస్తే ఇటు ఎమ్మెల్యే ఏలూరి ప్రాతినిథ్యం వహిస్తున్న పర్చూరు, ఆ తర్వాత రేపల్లె, అనంతరం రవికుమార్‌ ప్రాతినిథ్యం వహించే అద్దంకి ముందున్నాయి. ప్రస్తుతం బాదుడేబాదుడును ఉధృతంగా నిర్వహించటం ద్వారా ఏలూరి, రవికుమార్‌లు దూసుకుపోయారు. అయితే అన్ని కార్యక్రమాల్లో చీరాల వెనుకబడింది. 2,086మంది మాత్రమే అక్కడ సభ్యత్వం తీసుకున్నారు. ఇన్‌చార్జిగా కొండయ్య బాధ్యతలు తీసుకున్నది ఇటీవలే అయినప్పటికీ పనితీరులో వేగం పెరగాలంటూ చంద్రబాబు ఆయన్ను హెచ్చరించారు. 


కందుకూరులో అన్నీ తానై...

కందుకూరు నియోజకవర్గంలో కూడా సభ్యత్వం, బాదుడే బాదుడు కార్యక్రమాల నిర్వహణలో మరింత పురోగతి అవసరమని టెలీకాన్ఫరెన్స్‌లో అధినేత అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ ఇన్‌చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు కష్టపడుతున్నా నియోజకర్గంలోని ముఖ్యనాయకుల నుంచి సహకారం లేదని అధిష్ఠానం తేల్చింది. అందులోభాగంగా పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ను పిలిచి మాట్లాడింది. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో మాట్లాడేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో పోటీలు ఉండకూడదని, ఇన్‌చార్జ్‌ నిర్వహించే కార్యక్రమాల్లోనే పాల్గొనాలని అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఫలితంగా ఇన్‌చార్జ్‌ ఇంటూరికి మిగిలిన ముఖ్య నాయకులు సహకరిస్తారా లేదా అనేది వేచిచూడాలి.

Updated Date - 2022-07-07T07:18:07+05:30 IST