పత్రికా రచన పథనిర్దేశకుడు

ABN , First Publish Date - 2022-09-17T07:10:29+05:30 IST

తాపీ ధర్మారావుకు బాల్యం నుంచి రచనా వ్యాసంగంపై మక్కువ. పట్టభద్రుడైన తర్వాత కొంతకాలం గణిత శాస్త్ర అధ్యాపకుడిగా...

పత్రికా రచన పథనిర్దేశకుడు

తాపీ ధర్మారావుకు బాల్యం నుంచి రచనా వ్యాసంగంపై మక్కువ. పట్టభద్రుడైన తర్వాత కొంతకాలం గణిత శాస్త్ర అధ్యాపకుడిగా, తరువాత బొబ్బిలి సంస్థానంలో దివాన్‌గా పనిచేశాడు. ప్రాచీన సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి ఆంధ్ర విశారద బిరుదు అందుకున్నారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తికి ఆయన ప్రియ శిష్యుడు. పద్యకవిగా పాత పాళీ పేరిట చారిత్రక, సాంఘిక అంశాలపై 12 పద్య ఖండికల సంపుటి ప్రచరించి పండితుల మన్ననలు పొందాడు. సుప్రసిద్ధ పాత్రికేయుడిగా నవదర్శిని, కాగడా, జనవాణి, ప్రజాతంత్ర వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించి మంచి ఎడిటర్‌గా పేరొందాడు. తొట్టతొలుత వాడుక భాషలో సంపాదకీయాలు రాసి పాత్రికేయులకు మార్గదర్శకుడయ్యాడు. ఆయన జయంతిని (సెప్టెంబర్‌ 19) ప్రభుత్వం తెలుగు మాధ్యమాల దినోత్సవంగా ప్రకటించింది.


‘పత్రికలు వట్టి మాటల పోగులే కాదు, క్రియాకలాపానికి కూడా దారి తీయాలి. సంఘంలో ఒక కొత్త జీవనకళను కలిగించడంలో చేతనైన విధంగా పత్రికాముఖంగా పాటు పడాలి’– ఇది తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘కాగడా’ వార పత్రికలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన విషయం! అది ఇప్పటికీ అర్థవంతమైనదే.


తాపీ ధర్మారావు ఆంధ్ర సాహితీ రంగంలో అద్వితీయమైన కృషి చేసిన మహనీయుడు. తొలుత ఆయన గ్రాంథిక భాషావాదిగా కావ్య రచన చేశాడు. తరువాత వ్యావహారిక భాషావాదిగా మారి పత్రికా రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆయన మొట్టమొదట పత్రికారంగంలో ప్రవేశించింది ‘సమదర్శిని’ సంపాదకుడుగా. అది జస్టిస్‌ పార్టీ పత్రిక. ఆ పత్రిక వల్ల గూడవల్లి రామబ్రహ్మం, మరుపూరి కోదండ రామిరెడ్డి వంటివారు ధర్మారావు సన్నిహితులయ్యారు. అనేక విషయాలమీద ఆ పత్రికలో రచనలు వస్తూ ఉండేవి. అయితే భాష సరళ గ్రాంథికంలో ఉండేది.


‘సమదర్శిని’ నుంచి ధర్మారావు ‘ప్రజామిత్ర’కు మారడం జరిగింది. ఆ మార్పు సాదా సీదా మార్పు కాదు. భాషాపరంగా గుణాత్మకమైన మార్పు. గ్రాంథిక భాషావాదిగా ఉన్న ఆయన వ్యావహారిక భాషావాదిగా మారి తెలుగు జర్నలిజానికి నూతన దిశానిర్దేశం చేసిన మార్పు. ప్రజామిత్ర సారథి గూడవల్లి రామబ్రహ్మం. ధర్మారావుకీ ఆయనకీ సమదర్శిని నాటినుంచే ఆత్మీయ బంధం ఉంది. రామబ్రహ్మం ధర్మారావును గురూజీ అనే పిలిచేవారు.


ఈనాటికీ ధర్మారావు పేరుకు పర్యాయంగా నిలిచే ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’ వ్యాసాలు ప్రజామిత్రలో వచ్చినవే. అలాగే ‘కొత్త పాళీ’ వ్యాసాలను ప్రజామిత్ర ధారావాహికంగా ప్రచురించింది. ప్రజామిత్ర తరువాత ధర్మారావు సంపాదకత్వం వహించిన పత్రిక ‘జనవాణి’. రాజకీయ కారణాల వల్ల పిఠాపురం రాజా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో దినపత్రిక స్థాపించారు. తెలుగు పత్రికకు జనవాణి అని పేరు పెట్టారు. జనవాణి వెలువడేనాటికి ఆంధ్రపత్రిక ఒక్కటే దిన పత్రిక. ఆ పత్రికలో భాష గ్రాంథికం. ఆ పత్రికలో రెండు కాలమ్‌ల శీర్షికలు గాని, బానర్‌ గాని ఉండేవి కావు. ఒకప్పుడు హిందూ పత్రిక ఆంగ్లంలో ఉన్నట్టుగా మొదటి పేజీ నిండా వ్యాపార ప్రకటనలే ఉండేవి. అలాంటి నేపథ్యంలో ధర్మారావు వ్యావహారిక భాషలోనే పత్రిక నడపాలని సంకల్పించారు. పత్రిక స్వరూపాన్ని ధర్మారావు మార్చారు. రకరకాల టైపుల్ని ఉపయోగించారు. శీర్షికల్ని రెండు కాలమ్‌లలో, మూడు కాలమ్‌లలో పెట్టేవారు. వార్తలు కూడా ఇంగ్లీషు నుంచి మక్కికి మక్కీ అనువాదం కాకుండా సొంత మాటల్లో, సొంతంగా రాస్తున్నట్టు ఉండాలని సిబ్బందికి శిక్షణ నిచ్చారు. శీర్షికలు పాఠకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని చెప్పేవారు. ఆ రకంగా పత్రిక ఆకర్షణీయం అయ్యేలా చూసేవారు.


ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు. తన బాణీని ధర్మారావే ఒక సందర్భంలో వివరించారు. ‘తక్కువ పదాలతో వాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారికమనిపిస్తుంది. క్రియా పదాలు వ్యావహారికం చెయ్యడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్‌ కనిపెట్టాను. గ్రాంథిక భాషా వాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది కాదు’. ధర్మారావు పస గల వ్యవహారిక భాషావాది అవుతున్నా’రని గ్రాంథిక భాషావాది అయిన కట్టమంచి రామలింగారెడ్డి మెచ్చుకున్నారని నార్ల చెప్పారు. ధర్మారావు అలా ఆ తరవాత వచ్చిన తెలుగు పత్రికలన్నింటికీ పథ నిర్దేశకులయారు. ఆంధ్ర పత్రిక కూడా కొత్తమార్గాన్ని అనుసరించక తప్పింది కాదు.


– తన్నీరు కళ్యాణ్ కుమార్

(సెప్టెంబరు 19: తాతాజీ జయంతి, తెలుగు 

మాధ్యమాల దినోత్సవం)

Updated Date - 2022-09-17T07:10:29+05:30 IST