ఎయిమ్స్ నుంచి జైలుకు జర్నలిస్ట్ కప్పన్‌ తరలింపు

ABN , First Publish Date - 2021-05-08T00:34:14+05:30 IST

కొద్ది రోజుల క్రితం కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య రైహంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తికి ఆమె ఒక లేఖ రాశారు. మధుర ఆసుపత్రిలో తన భర్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని

ఎయిమ్స్ నుంచి జైలుకు జర్నలిస్ట్ కప్పన్‌ తరలింపు

న్యూఢిల్లీ: ఉపా చట్టం కింద కేసు నమోదై జైలు పాలై అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖి కప్పన్‌ను మధుర జైలుకు తరలించారు. అయితే ఈ విషయాన్ని కప్పన్ లాయర్‌కు గానీ, భార్యకు గానీ తెలియకుండానే తరలించారని సమాచారం. గురువారం అర్థరాత్రి కప్పన్‌ను జైలుకు తరలించినట్లు శుక్రవారం ఉదయం మధుర జైలు సూపరింటెండెంట్ శైలేంద్ర కుమార్ మైత్రేయ స్పష్టం చేశారు.


అయిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదన్న వ్యాఖ్యలపై శైలేంద్ర కుమార్ స్పందిస్తూ ‘‘ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న దృష్ట్యా అతడిని కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. అతడి ఆరోగ్యంపై ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందింది. అతడి గురించి ఇంతకు మించి తెలియాల్సింది ఏముంది? నిందితుల కుటుంబానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించడం నా పని కాదు. చట్టబద్ధంగానైనా నైతికంగానైనా దానికి నేను బాధ్యత వహించను. నేను కోర్టుకు మాత్రమే జవాబుదారీని’’ అని చెప్పుకొచ్చారు.


కొద్ది రోజుల క్రితం కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య రైహంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తికి ఆమె ఒక లేఖ రాశారు. మధుర ఆసుపత్రిలో తన భర్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచానికి కట్టేసి ఉంచారని సీజేఐకి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. కప్పన్ లాయర్ విల్స్ మాథ్యూ సహాయంతో తన లేఖను సీజేఐకి మెయిల్ ద్వారా పంపించారు.

Updated Date - 2021-05-08T00:34:14+05:30 IST