కాళ్లపై పడినా కనికరించలేదు

ABN , First Publish Date - 2022-05-01T08:32:54+05:30 IST

అతను సీఎం జగన్‌రెడ్డి పత్రిక సాక్షి విలేకరి. యువకుడు, బలిష్టుడు. ‘అయ్యా కొట్టొద్దు... కనికరించండి’ అంటూ ఓ వృద్ధుడు అతని కాళ్ల మీదపడి..

కాళ్లపై పడినా కనికరించలేదు

వృద్ధుడన్న దయకూడా లేదు

బూతు పురాణంతో మహిళలపై దాష్టీకం

తాడేపల్లిలో సాక్షి విలేకరి రౌడీయిజం


గుంటూరు, మంగళగిరి, ఏప్రిల్‌30: అతను సీఎం జగన్‌రెడ్డి పత్రిక సాక్షి విలేకరి. యువకుడు, బలిష్టుడు. ‘అయ్యా కొట్టొద్దు... కనికరించండి’ అంటూ ఓ వృద్ధుడు అతని కాళ్ల మీదపడి ప్రాధేయపడ్డాడు. అతనిపై ఏ మాత్రం కనికరం లేకుండా ఆ విలేకరి బలమంతా ఉపయోగించి తోసిపారేశాడు. అడ్డువచ్చిన మహిళలను అసభ్యకరంగా దుర్భాషలాడాడు. బూతు పురాణంతో దాష్టీకానికి పాల్పడ్డాడు. సీఎం జగన్‌ నివాస ప్రాంతమైన తాడేపల్లిలో ఏప్రిల్‌ 29న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. వివరాలు... స్థానికుడు అట్లా కోటేశ్వరరావు, ఆయన తమ్ముడు శ్రీను మధ్య ఓస్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఆ స్థలాన్ని శ్రీను నుంచి సాక్షి విలేకరి నాగిరెడ్డి కొనుగోలు చేశాడు. అందులో గోడ నిర్మాణం చేపడుతున్నారు. దీనిని వృద్ధుడు కోటేశ్వరరావు వ్యతిరేకించాడు. స్థల వివాదం పరిష్కారం కాలేదని, గోడ నిర్మాణం చేపట్టొద్దనడంతో వివాదం రేగింది. ఆ క్రమంలోనే నాగిరెడ్డి కోటేశ్వరరావుని తోసేశాడని, అసభ్యకరంగా దుర్భాషలాడాడని, ఘటనను వీడియో తీస్తున్న తమపైనా దాడికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 


నాగరెడ్డికి ఏమిటి సంబంధం?: బాధితుడు

‘‘మా సోదరుల మధ్య భూ వివాదం వుంటే మాలో మేము పరిష్కరించుకుంటాం. నాగరెడ్డికి ఏమిటి సంబంధం? రెండు నెలలుగా నన్ను, నా కుటుంబాన్ని నాగిరెడ్డి అనేక విధాలుగా బెదిరిస్తూ హింసపెడుతున్నాడు. తాడేపల్లిలో అతని అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరిని అడిగినా సాక్షి విలేకరి భూకబ్జాల గురించి, అక్రమ వసూళ్ల గురించి చెబుతారు’’ అంటూ కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాగిరెడ్డి మా కుటుంబంపై పగబట్డాడు. ఇవ్వాళ నా ఇంటి మీదకు వచ్చి నన్ను గుండెలపై ఎగిరిఎగిరి తన్నాడు. ఆడవాళ్లపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలన్నాయి. నాగిరెడ్డిని చట్టపరంగా శిక్షించండి’’ అంటూ కోటేశ్వరరావు వేడుకున్నాడు. కాగా, తాను కొనుక్కున్న స్థలంలో గోడ కట్టుకుంటుంటే కోటేశ్వరరావే తనపై దౌర్జన్యానికి దిగాడని నాగిరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తనను రెచ్చగొట్టారని, వీడియోలు తీసి, వాటిని మార్ఫింగ్‌ చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 


సాక్షి గూండాల బరితెగింపు: చంద్రబాబు

సీఎం జగన్‌రెడ్డి నివాసం ఉన్న తాడేపల్లి ప్రాంతంలో ఆయన పత్రికలో పనిచేసే గూండాల బరితెగింపునకు అడ్డు లేకుండా పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికార మదంతో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా జగన్‌? అని ఆయన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2022-05-01T08:32:54+05:30 IST