జర్నీ@ నైట్..!

ABN , First Publish Date - 2021-12-01T16:40:02+05:30 IST

రాత్రి. 8.45 - 9.00 గంటలు: దర్గా (మణికొండ) ప్రాంతంలో వెలుతురు అంతంత మాత్రంగానే ఉంది. కొందరు ప్రయాణికులు ఆటోలు, బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రివేళ ప్రజారవాణా తగ్గడంతో ఆటోలను ఆశ్రయించడం కనిపించింది.

జర్నీ@ నైట్..!

ఇటీవల రాత్రివేళ దోపిడీలు పెరుగుతున్నాయి. ఆటోడ్రైవర్ల అవతారమెత్తి కొందరు ప్రయాణికులను బెదిరించి దోచుకుంటున్నారు. నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇలాంటి ముఠాలు హుమాయున్‌నగర్‌, లంగర్‌హౌజ్‌, నార్సింగ్‌, రాజేంద్రనగర్‌లతో పాటు శివారుప్రాంత పీఎ్‌సల పరిధుల్లో అధికంగా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ‘ఆంధ్రజ్యోతి’ రాత్రివేళ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేసింది. 


మహానగరంలో రాత్రి ప్రయాణం సురక్షితమేనా?

‘ఆంధ్రజ్యోతి’ బృందం పర్యటనలో విస్తుపోయే విషయాలు 

హైటెక్‌సిటీలో కుగ్రామం నాటి పరిస్థితులు

చాలా ప్రాంతాల్లో అంధకారం

నేరాలకు ఆస్కారమున్న ప్రదేశాలెన్నో..

30 కిలోమీటర్లలో రెండే పెట్రోలింగ్‌ వాహనాలు


పరిశీలన సాగింది ఇలా..

హైదరాబాద్‌: రాత్రి. 8.45 - 9.00 గంటలు: దర్గా (మణికొండ) ప్రాంతంలో వెలుతురు అంతంత మాత్రంగానే ఉంది. కొందరు ప్రయాణికులు ఆటోలు, బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రివేళ ప్రజారవాణా తగ్గడంతో ఆటోలను ఆశ్రయించడం కనిపించింది. మెహఫిల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న రోడ్డుపై చీకట్లు నెలకొనగా, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం అని ఆటోడ్రైవర్లు అరుస్తున్నారు. ఈ టైంలో ఆటో దొరికిందే అదృష్టం అన్నట్లుగా మహిళలు, యువతులు సైతం ఆటోల్లో సర్దుకుని వెళ్తున్నారు. ఒక పోలీస్‌ వాహనం కనిపించింది. 


రాత్రి 9.10 - 9.25 గంటలు: షేక్‌పేట్‌ నాలా నుంచి దర్గా వరకు కిలోమీటరు మేర ఉన్న రోడ్డుపై షాపులన్నీ తెరిచే ఉన్నాయి. రోడ్డుపై మాత్రం చీకట్లు కమ్ముకుని ఉన్నాయి. బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఎదురుగా, పాస్‌పోర్టు సేవా కేంద్రం వద్ద ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం వేచి ఉన్నారు. అక్కడే ఓ పెద్ద వైన్‌షాపు ఉంది. అక్కడ వాహనాలు ఎక్కువగా కనిపించాయి. భారీ జనమున్న ఆ ప్రాంతంలో ఆటోలు ఒకదాని వెనక ఒకటి ఆగుతున్నాయి. ఆటోల్లో స్థలం దొరక్క కొందరు వాహనదారులను లిఫ్టు అడుగుతున్నారు. వైన్‌షాపు పక్క నుంచి గోల్కొండ వైపు వెళ్లే రోడ్డుపై లైట్లు వెలుగుతున్నా నిర్మానుష్యంగా ఉంది. పెట్రోలింగ్‌ వాహనం ఒకటి సైరన్‌ మోగించుకుంటూ వెళ్లింది. 


రాత్రి 10.10 - 10.20 గంటలు (నానల్‌ నగర్‌ చౌరస్తా): ఓ వైపు దర్గా, గచ్చిబౌలి వెళ్లే ప్రయాణికులు ఆటోల కోసం ఎదురు చూస్తున్నారు. ఆటోలు వస్తున్నాయి. ప్రయాణికులను తీసుకుని వెళ్తున్నాయి. ఆ స్టాప్‌ వద్ద అంతా చీకటిగా ఉంది. అక్కడి నుంచి టోలీచౌకీ, షేక్‌పేట్‌, మణికొండ, దర్గా రోడ్ల వైపు వెళ్లే ప్రయాణికులు ఆటోల కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డుమధ్యలో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఉన్నారు. సిగ్నల్‌పై దృష్టి సారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి.

రాత్రి 10.45-11.00 గంటలు (టిప్పుఖాన్‌ బ్రిడ్జి): నానల్‌ నగర్‌ చౌరస్తా నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత లంగర్‌హౌజ్‌, బాపూఘాట్‌ వద్ద కాస్త పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద సుమారు 300 మీటర్ల దూరం పూర్తి చీకటిగా ఉంది. బ్రిడ్జి ప్రారంభానికి ముందు గోల్కొండ ప్రవేశం, మిలటరీ ప్రాంతం ఉందనే ఊరట ఉన్నప్పటికీ బ్రిడ్జి వద్ద పరిస్థితి భిన్నంగా ఉంది. కనీసం వీధిలైట్లు లేవు. సీసీ కెమెరాలు ఎక్కడా కనిపించలేదు. 15 నిమిషాల వ్యవధిలో 10 ఆటోలు ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్లాయి. ఆటోలలో ప్రయాణికులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. పోలీసులు, పెట్రోలింగ్‌ వాహనం కనిపించ లేదు. 


రాత్రి 11.15 - 11.30 గంటలు (సన్‌ సిటీ): సన్‌సిటీ వద్ద నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఏం జరిగినా బయటకు తెలియని పరిస్థితి. ఆటో డ్రైవర్లు నార్సింగి, మంచిరేవుల అని అరుస్తున్నారు. జనం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ... ఒకరిద్దరు ప్రయాణికులతో వస్తున్న ఆటోలు ఇక్కడ ఉన్న ఒకరిని, ఇద్దరినీ కూర్చొబెట్టుకుని వెళ్తున్నాయి. సీసీ కెమెరాలు కనిపించాయి. పోలీసులు కానరాలేదు. 


రాత్రి 12.00- 12.15 గంటలు (రాజేంద్రనగర్‌): సన్‌సిటీ, బండ్లగూడ జాగీర్‌ నుంచి కిస్మత్‌పూర్‌ మీదుగా 8 కిలోమీటర్లు. కిస్మత్‌పూర్‌ రోడ్‌ నిర్మానుష్యంగా కనిపించింది. కిస్మత్‌ పూర్‌ గ్రామంలో సోమవారం సంత ఉన్నందున కాస్త జనం ఉన్నారు. రోడ్డు ఖాళీగానే కనిపించింది. ఆటోలు తిరుగుతున్నాయి. లైటింగ్‌ అంతంత మాత్రమే. సీసీ కెమెరాలు రెండు చోట్ల మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత రాజేంద్రనగర్‌ పీఎస్‌ నుంచి డెయిరీ ఫామ్‌ వరకు రోడ్డు మీద అక్కడక్కడ ఒకటి రెండు వాహనాలు మాత్రమే కనిపించాయి. రోడ్లపై వెలుతురు బాగానే ఉంది. పోలీస్‌ వాహనాలు కూడా తిరుగుతున్నాయి. కెమెరాలు కూడా ఉన్నాయి. డెయిరీ ఫామ్‌ వద్ద యూటర్న్‌ చేస్తే హిమాయత్‌ సాగర్‌ వైపు వెళ్లే రోడ్డులో రాజేంద్రనగర్‌ గ్రామం దాటిన తర్వాత ఔటర్‌ వరకు వీధిలైట్లు ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదకరంగానే ఉంది. 


నాలుగు గంటలు... 30 కిలోమీటర్లు

సోమవారం రాత్రి 8.45 గంటలకు దర్గా (మణికొండ) నుంచి ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలన ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది ఆటో స్టాండ్‌లు, ఒక్కో స్టాండ్‌ వద్ద పదిహేను నిమిషాల పాటు ఆగి పరిస్థితిని సమీక్షించారు. మొత్తం 30 కిలోమీటర్లు తిరిగి రోడ్ల పరిస్థితి, వీధిలైట్ల తీరును పరిశీలించారు. ఈ నాలుగు గంటల్లో పోలీసుల జాడ కొన్నిచోట్లే కనిపించింది. రెండు చోట్ల మాత్రమే పెట్రోలింగ్‌ వాహనాలు సంచరిస్తున్నాయి. కొన్ని చోట్ల పూర్తి అంధకారం. మరికొన్ని చోట్ల జరగరానిది జరిగితే సమీపంలో ఉన్న వారికి కనీసం సమాచారం కూడా చేరవేయలేని పరిస్థితి కనిపించింది. 


రాత్రి 9.40-10.00 గంటలు (మెహిదీపట్నం బస్టాండ్‌)

షేక్‌పేట్‌ నాలా నుంచి మెహిదీపట్నం వరకు మూడు కిలోమీటర్లు ఉన్న రోడ్డుపై జనం ఫుల్‌గా ఉన్నారు. పూర్తిస్థాయి లైటింగ్‌, సీసీ కెమెరాలు ఉన్నాయి. టోలీచౌకీ ఫ్లైఓవర్‌ దాటే వరకూ వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత మెహిదీపట్నం వరకు మిలటరీ ప్రాంతం కావడంతో ఓ వైపు పూర్తిగా ఫెన్సింగ్‌ ఉంది. మెహిదీపట్నం ఆటో స్టాండ్‌లో ఆటోలు భారీగానే ఉన్నాయి. ఆటో డ్రైవర్ల అరుపులు, ఆర్టీసీ బస్సుల హారన్లు, వాహనాల హడావిడితో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. బస్సులున్నా కొందరు ఆటోల కోసం పరుగులు తీస్తున్నారు. వీధిలైట్లు వెలుగుతున్నాయి. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రయాణానికి కాస్త అనుకూలం అన్నట్లుగా ఉంది. 


వారు డ్రైవర్లు కాదు : ఆటో డ్రైవర్లు

ఆటో డ్రైవర్ల మాటున కొందరు చేస్తున్న నేరాల గురించి ఓ డ్రైవర్‌ను ప్రశ్నించగా ‘మాలోనూ కొందరు చెడ్డ వారు ఉన్నారు. వారి కారణంగా మాకూ ఇబ్బందులు కలుగుతున్నాయి’ అని చెప్పారు. ‘అప్పుడప్పుడు పోలీసులు సైతం ఫొటోలు పట్టుకుని మా చుట్టూ తిరుగుతుంటారు. గుర్తు పడతారా.. ఎక్కడైనా చూశారా అని ప్రశ్నిస్తుంటారు’ అని ఇంకొకరు చెప్పారు. అసలు నేరాలు చేసే వారు ఆటో డ్రైవర్లు కారని, నేరం చేయడానికే కొందరు ఆ అవతారమెత్తుతుంటారని మరో డ్రైవర్‌ చెప్పారు. పేర్లు, వివరాలు చెప్పడానికి ఇష్టపడ లేదు.


అదే ప్రాంతంలోని మొరైన్‌ బేకరీ పక్కన లంగర్‌హౌజ్‌, సన్‌సిటీ, వెళ్లే ఆటోల కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. ముందు బస్టాప్‌ ఉన్నప్పటికీ ఆటోల కోసమే ఎక్కువ మంది చూస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం కన్నా ఆటోలు ఎక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. కాస్త వెలుతురుగానే ఉంది. సివిల్‌ డ్రెస్‌లో కొంతమంది పోలీసుల్లా కనిపించారు. కానీ పోలీసులా, కాదా అనేది స్పష్టంగా చెప్పలేం.

Updated Date - 2021-12-01T16:40:02+05:30 IST