Jr NTR: హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్

ABN , First Publish Date - 2022-09-22T21:08:02+05:30 IST

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును జగన్ సర్కార్ తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో..

Jr NTR: హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్

హైదరాబాద్: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును జగన్ సర్కార్ తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నొప్పింపక.. తానొప్పక అనే రీతిలో ఉందని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. నందమూరి కుటుంబంలోని ఇతర కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేసి మరీ ముక్త కంఠంతో ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సుతిమెత్తగా స్పందించారని జూనియర్ ట్వీట్ చూసిన నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌ను యధాతథంగా చూద్దాం.


‘NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’.



నందమూరి కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో..

విజయవాడలోని ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చుతూ (ntr health university name change) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై నందమూరి కుటుంబం (Nandamuri Family) అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై స్పందిస్తూ.. నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రెస్ నోట్ విడుదల చేసింది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ప్రెస్‌ నోట్‌లో ఎన్టీఆర్ కుటుంబం పేర్కొంది. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని నందమూరి కుటుంబం గుర్తుచేసింది. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని.. అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని తెలిపింది.


వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో 'డాక్టర్'.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని, ఆ పేరును‌ నేడు జగన్ మార్చడం దురదృష్టకరమని నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరును తొలగించటం తెలుగు జాతిని అవమానించినట్లేనని, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని నందమూరి కుటుంబం డిమాండ్ చేసింది.

Updated Date - 2022-09-22T21:08:02+05:30 IST