కశ్మీర్‌ తీర్పు

ABN , First Publish Date - 2020-12-24T06:08:53+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల ఎనిమిది విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలోనే ఉన్నాయి. జిల్లాకు 14 చొప్పున, ఇరవై జిల్లాల్లో మొత్తం 280 సీట్లకు...

కశ్మీర్‌ తీర్పు

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల ఎనిమిది విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలోనే ఉన్నాయి. జిల్లాకు 14 చొప్పున, ఇరవై జిల్లాల్లో మొత్తం 280 సీట్లకు జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డిస్ట్రిక్ట్‌ డెవలప్‌ మెంట్‌ కౌన్సిల్‌–డీడీసీ) ఎన్నికల ఫలితాలను రాజకీయపక్షాలు తమకు నచ్చినరీతిలో విశ్లేషిస్తున్నాయి. ఏడుపార్టీల ‘పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌’ (పీఏజీడీ) లోయలో అధిక స్థానాలు సాధిస్తే, భారతీయ జనతాపార్టీ జమ్మూ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుచుకుంది. గుప్కర్‌ కూటమి జమ్మూలోనూ నలభైఐదు స్థానాలు గెలుచుకోవడంతో, తాము లోయకు మాత్రమే పరిమితం కాదనీ, జమ్మూకశ్మీర్‌ యావత్తూ తమకు విస్తృత ప్రజాదరణ ఉన్నదని నేషనల్ కాన్ఫరెన్స్‌ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇక, పూర్తిగా జమ్మూకే పరిమితం కాకుండా, కశ్మీర్‌ లోయలో సైతం తొలిసారిగా ఓ మూడు వార్డుల్లో నెగ్గి అక్కడ ప్రత్యక్షంగా కాలూనడం బీజేపీని ఆనందంలో ముంచెత్తుతున్నది. ఉగ్రవాద, వేర్పాటువాదాలతో దశాబ్దాల పాటు వేగి, విసిగిన కశ్మీరీలు మోదీ అభివృద్ధి మంత్రానికి జేజేలు పలికారని బీజేపీ చెప్పుకుంటున్నది. మరో అరడజను స్థానాల్లో అతితక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్నీ గుర్తుచేస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ తన ప్రత్యేక ప్రతిపత్తినీ, రాష్ట్ర హోదానూ కోల్పోయిన తరువాత, తొలిసారిగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ డీడీసీ ఎన్నికలు. 


ఓటింగ్‌ శాతం గత ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే కాస్త మెరుగ్గా, ఎటువంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా డీడీసీ ఎన్నికలు ముగియడం విశేషం. జిల్లా స్థాయి అభివృద్ధికి వీలుకల్పించే ప్రక్రియ కనుక ప్రజలూ కాదు పొమ్మనలేదు. గడ్డ కట్టించే చలిలోనూ ప్రజలు ఓటు చేశారు. రాజకీయ పక్షాలు మాత్రం తమకు నచ్చినరీతిలో ఈ ఫలితాలకు భాష్యం చెప్పుకుంటున్నాయి. గుప్కర్‌ కూటమికి అత్యధిక స్థానాలు రావడమంటే 2019 ఆగస్టు 5 న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించడమేనని నేషనల్‌ కాన్ఫరెన్సు అంటున్నది. డీడీసీ ఎన్నికలను కేంద్రం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తున్నది కనుక, ఈ ఫలితాల వెనుక ఉన్న ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ఒమర్‌ అబ్దుల్లా  అంటున్నారు. ఈ ఎన్నికలతో కశ్మీరీ పార్టీలను తుడిచిపెట్టేయాలన్న బీజేపీ దురాలోచనను కూడా ప్రజలు వమ్ముచేశారని కూటమి నాయకులు అంటున్నారు. ఏడాది కాలంగా కేంద్రంమీద గుర్రుగా ఉన్న ఈ పార్టీలేవీ డీడీసీ ఎన్నికల్లో పాల్గొనవనీ, పాల్గొన్న పక్షంలో 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని ఆమోదించినట్టు అవుతుంది కనుక ప్రజాగ్రహానికి జడుస్తాయని బీజేపీ భావించింది. కానీ, తాము ఎన్నికలకు దూరంగా ఉండిపోతే జమ్మూకశ్మీర్‌ను బీజేపీ పూర్తిగా ఆక్రమించుకుంటుందన్న భయంతో, వాదనతో, ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో సంఘటితంగా పాల్గొనాలని ఏడు పార్టీలూ నిర్ణయించుకున్నాయి. ఇంతటి బలమైన కూటమిని ఒంటరిగా ఢీకొట్టి, బీజేపీ అత్యధికస్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీగా అవతరించిన విషయాన్ని కమలనాథులు గుర్తుచేస్తూ, ఇక జమ్మూకశ్మీర్‌ అంతటా బీజేపీ ఓ ప్రబలమైన శక్తిగా విస్తరించిందని అంటున్నారు. 


ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్నిస్థానాలు గెలిచారన్న కంటే, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రజలు ఆదరించి గౌరవించినందుకు అభినందించాలి. అలాగే, అన్ని పార్టీలూ ఎన్నికల్లో పాల్గొనడం, విజయోత్సవ వేడుకలు చేసుకోవడం, మరీ ముఖ్యంగా ఇండిపెండెట్లు పెద్ద సంఖ్యలో నిలబడటం మంచి పరిణామం. గెలిచినవారంతా తొలిసారిగా భారత రాజ్యాంగంమీద ప్రమాణం చేయబోతూండటమూ కేంద్రానికి సంతృప్తికలిగించే అంశమే. ప్రజలు అభివృద్ధే లక్ష్యంగా తమకు ఓట్లు వేశారన్న విషయాన్ని అన్ని పార్టీలూ గుర్తుపెట్టుకోవాలి. అర్థంలేని వివాదాలకూ, అనవసర రాజకీయాలకు ప్రజలను బలిచేయకుండా వారి ఆకాంక్షలు నెరవేరేందుకు కేంద్రమూ, కశ్మీరీ పార్టీలూ కృషిచేయాలి. 

Updated Date - 2020-12-24T06:08:53+05:30 IST