ధర్మపథంలో అడుగుజాడలు

ABN , First Publish Date - 2021-01-05T06:04:56+05:30 IST

నిజాయితీపరులకు జననీరాజనాలు లభిస్తాయి. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల పదవీ విరమణ చేసిన ఎ.పి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఉదంతం. నిప్పులా బతికిన న్యాయమూర్తులు కింది స్థాయిలోనూ ఎంతోమంది ఉన్నారనడానికి...

ధర్మపథంలో అడుగుజాడలు

నిజాయితీపరులకు జననీరాజనాలు లభిస్తాయి. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల పదవీ విరమణ చేసిన ఎ.పి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఉదంతం. నిప్పులా బతికిన న్యాయమూర్తులు కింది స్థాయిలోనూ ఎంతోమంది ఉన్నారనడానికి గురజాలలో మెజిస్ట్రేట్‌గా పనిచేసిన సూర్యారెడ్డి ఒక ఉదాహరణ. రాజకీయాల నుంచి న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్‌ కృష్ణయ్యర్‌, మెజారిటీ తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన జస్టిస్‌ చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి. చంద్రచూడ్‌, జస్టిస్‌ భగవతి, జస్టిస్‌ దేశాయ్‌లాంటి వారిపై ఎవరూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు.


‘‘పూలు–-బొకేలు పట్రాకండి, నేను రాజకీయ నాయకుణ్ణి కాదు. ఆకలితో లేను కనుక ఫ్రూట్స్‌, స్వీట్స్‌ తేకండి. చలితో గడగడ లాడటం లేదు కనుక శాలువాలు వద్దు. అలా అని మీ నుంచి నేను ఏమీ ఆశించటం లేదనుకోకండి. వచ్చేప్పుడు శుభాశీస్సులు మాత్రం మరచిపోకండి’’. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు ఛాంబర్‌ బయట ఈ బోర్డు ఉండేది. పదవీ విరమణ చేసిన రోజున మామూలుగా కోర్టుకు వచ్చి తన ఆస్తిపాస్తుల వివరాలు స్వచ్ఛందంగా ప్రకటిస్తూ ఒక పత్రాన్ని ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. సాయంత్రం అధికారిక వాహనం ఎక్కకుండా, డఫేదారును వెంట తీసుకెళ్ళకుండా కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్‌ చంద్రబోస్‌ రోడ్డు దాటి అక్కడ ఒక రెస్టారెంటులో తనను కల్సిన మిత్రులతో మాట్లాడి ఓ కప్పు కాఫీ తాగారు. తరువాత బీచ్‌రోడ్‌ స్టేషన్‌కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే లోకల్‌ ట్రయిన్‌ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారాయన. 


హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసే రోజు కోర్టులో ఫుల్‌ బెంచ్‌ సమావేశమై వీడ్కోలు పలకటం, న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ తదితరులు వీడ్కోలు ప్రసంగం చేసి, జ్ఞాపికను, నూతన వస్త్రాలను బహుకరించటం, సాయంత్రం ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో విందు ఏర్పాటు చేయటం ఆనవాయితి. కాని జస్టిస్‌ చంద్రు ముందే ప్రధాన న్యాయమూర్తికి ఈ ఆనవాయితి తన విషయంలో పాటించవద్దని అభ్యర్ధించారు. ఆయన తన ఏడేళ్ళ పదవీ కాలంలో 54,000 కేసులు పరిష్కరించి రికార్డు నెలకొల్పారు. దేశవ్యాపితంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 3 కోట్ల కేసులు పరిష్కరించటానికి మా దగ్గర ‘మంత్ర దండం’ లేదని చెప్పే న్యాయమూర్తులకు ఈయన పని విధానం ఒక కనువిప్పు. ఎందుకంటే కింద స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు చాలామంది న్యాయమూర్తులు మధ్యాహ్నం తర్వాత అసలు బెంచ్‌పైకే రారు. గతంలో బ్రిటిష్‌ కాలంలో జస్టిస్‌ జాక్సన్‌ కూడా ఇదే రకమైన నిరాడంబరతతో పదవీ విరమణ చేశారు. మన రాష్ట్రంలో కూడా మేజిస్ట్రేట్‌ నుంచి హైకోర్టు వరకు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ కె.జి. శంకర్‌ కూడా తన 35 సంవత్సరాల పదవీకాలంలో పనిచేసిన ఎక్కడా వీడ్కోలు పార్టీలు తీసుకోలేదు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినప్పుడు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. 


అవినీతిపరులకి ఆదాయం లభించినట్లే నిజాయితీపరులకు జననీరాజనాలు లభిస్తాయి. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల పదవీ విరమణ చేసిన ఎ.పి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఉదంతం. దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా నిలబడి నమస్కరిస్తూ ప్రజలు పలికిన వీడ్కోలు. ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేసి తన స్వస్థలమైన బిహారుకి వెడుతుంటే ప్రజలు కన్నీరుపెట్టటం, అపూర్వమైన రీతిలో వీడ్కోలు పలకడాన్ని ధన రూపంలో కొలవగలమా?


ఇలాంటిదే గతంలో గుంటూరు జిల్లా గురజాలలో మేజిస్ట్రేట్‌గా పనిచేసిన సూర్యారెడ్డి ఉదంతం. అర్ధరాత్రి పూట ఎవరైనా బాధితుడు వచ్చి తన కష్టం చెప్పుకుంటే లాయర్లు, పిటిషన్లు లాంటి సాంకేతిక విషయాల జోలికి వెళ్ళకుండా తగు ఆర్డర్‌ జారీ చేసేవారు. పల్నాడు ప్రాంతంలో ఎప్పుడూ విద్యుత్‌ కోత ఉండకూడదని, కోత విధిస్తే ఎ.ఇకి అరెస్టు వారెంటు జారీ చేస్తానని హెచ్చరించారు. తనకు అధికారం లేకపోయినా తల్లి ఏడుస్తుంటే లాకప్‌డెత్‌ కారణంగా చనిపోయిన కొడుకు శవాన్ని తవ్వి తీయించి చూపించారు.


అలా ప్రజారంజకంగా విధులు నిర్వహించిన ఆ న్యాయమూర్తి అనేక సంవత్సరాలు పదోన్నతికి నోచుకోలేదు. ఆయన బదిలీ అయిన చాలాకాలానికి సబ్‌కోర్టు ప్రారంభిస్తున్న సందర్భంగా వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన జనమంతా హైకోర్టు న్యాయమూర్తుల్ని వదిలేసి, ఈయన చుట్టూ మూగారు. అందులో ఒక వ్యక్తి మీకు ప్రమోషన్‌ ఎందుకు రాలేదు? అని అడిగాడు. I got it longback in the hearts of the people అని చెప్పారు. వారి నిజాయితీ వలనే ఈ మాట అనగలిగారు. అత్యంత నిజాయితీగా, నిప్పులా బతికిన న్యాయమూర్తులు కింద స్థాయిలో కూడా అసంఖ్యాకంగా ఉన్నారు. అన్ని వ్యవస్థల వలెనే న్యాయవ్యవస్థ కూడా దిగజారటం సహజంగానే జరుగుతూ ఉంది. 


జిల్లా జడ్జిలుగా, సబ్‌ జడ్జిలుగా, మేజిస్ట్రేట్‌లుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వాళ్ళు ఎక్కడైనా ప్రాక్టీసు చేయవచ్చు. హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన వాళ్ళు సుప్రీం కోర్టులో మాత్రమే ప్రాక్టీసు చేయవచ్చు. న్యాయమూర్తుల కుటుంబసభ్యులు ఎక్కడైనా ప్రాక్టీసు చేయవచ్చు. ఇందులో కొన్ని చట్టబద్ధంగాను, మరికొన్ని సాంప్రదాయకంగానూ జరుగుతున్నాయి. వీటిని క్రోడీకరించి ఒక పద్ధతిని రూపొందించటం అవసరం. జిల్లా జడ్జిలుగా పని చేసిన వాళ్ళు ఇంకా చిన్న కోర్టుల్లో న్యాయవాదులుగా పనిచేస్తే తన సబార్డినేట్‌లుగా పనిచేసిన వారి ముందు వారు కేసులు వాదించటంలో అనుమానాలు రావటం సహజం. అలాగే ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, బంధువులు ప్రాక్టీసు చేయటం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. కొందరు నిజాయితీపరులు ‘నాట్‌ బిఫోర్‌’ ఉత్తర్వులు ఇస్తారు. అంటే తనతో సంబంధం ఉన్న న్యాయవాదుల కేసులు తమ ముందు విచారణకు రాకుండా రిజిస్ట్రీని ఆదేశిస్తారు. ఇది కూడా సంప్రదాయమే కాని రూల్‌ కాదు. బెంచ్‌ని మరోపక్క హంటింగ్‌ చేసే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. తమకు అనుకూలమైన ఆర్డర్‌ రాదని తెలిసి ఆ జడ్జిని తప్పించే ప్రయత్నం చేయటాన్ని ‘బెంచ్‌ హంటింగ్‌’ అంటారు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ విషయంలో ఇదే జరిగింది. పై కోర్టులు గాని, కక్షిదారు గాని, ప్రజలు గాని, పత్రికలు గాని ఆయనపై ఏ ఆరోపణా చేయలేరు. న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణ చేయలేదంటే అది ప్రభుత్వ అనుకూల వాదనలు చేసేవారి గొప్పతనం కాదు. నిప్పుకు చెదలు పట్టవు. అయితే, జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఉదంతంలో న్యాయమూర్తులు నేర్చుకోవాల్సిన విషయం ఒకటుంది.


న్యాయమూర్తి ఏమి చేయాలన్నా తీర్పు రూపంలోనే చేయాలి గాని ముందే తన అసహనాన్ని మాటల రూపంలో ప్రకటించకూడదు. బిహార్‌లో పని చేసినప్పుడు సహచర న్యాయమూర్తులపై విచారణకు ఆదేశించిన నిజాయితీ ఆయనది. అలాంటి వ్యక్తిని బెంచ్‌ హంటింగ్‌ చేస్తే ఉన్నత న్యాయస్థానంలో స్టే రావటం విచారకరం. ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని ‘కొత్తగాలి వీస్తున్నదని’ ‘చైతన్య పవనాలు’ వీస్తున్నాయని కొందరు చంకలు గుద్దుకోవటం చూస్తున్నాం. అన్నిచోట్లా జనం కోసం నిలిచేవాళ్ళు ఉన్నట్లే ‘భజన’ చేసే వాళ్ళూ ఉంటారు. 


ఇక, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన వాళ్ళు మరే ప్రభుత్వ పదవీ చేపట్టకుండా ఉండటం బ్రిటిష్‌ కాలం నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం. అలాంటిది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ సదాశివం కేరళ గవర్నర్‌గా నియమితులవ్వటం చూసి దేశం నివ్వెరపోయింది. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సైతం పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని ఆమోదించటం విచారకరం. పదవీ విరమణకు ముందు బాబ్రి కేసులో పాలకులకు అనుకూలమైన తీర్పు ఇవ్వటం విశేషం. భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించే ప్రధాన న్యాయమూర్తి పదవిలో పనిచేసిన వ్యక్తి, ఆ రాష్ట్రపతితో నియమించబడి రాజ్యసభలో కూర్చోవటం ఎంత తలవంపు? ప్రధానమంత్రి మోదీని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ఒక సదస్సులో పొగిడి విమర్శలకు గురయ్యాడు. న్యాయమూర్తుల్ని లక్ష్యం చేసుకొనే చెడు సంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇందిరాగాంధీ కాలంలో జస్టిస్‌ సిక్రి పదవీ విరమణ అనంతరం ప్రధాన న్యాయమూర్తులుగా రావల్సిన ముగ్గురు సీనియర్లు జస్టిస్‌ హెగ్డే, జస్టిస్‌ గ్రోవర్‌, జస్టిస్‌ షెలాత్‌లను కాదని ఎ.ఎన్‌.రేని ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పుడే ఈ అక్రమం ప్రారంభమయింది. ఇంతకీ ఆ న్యాయమూర్తులు చేసిన నేరం ఏమిటంటే కేశవానంద భారతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పటమే. బ్యాంకుల జాతీయకరణ సందర్భంగా వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ చేసుకున్నారే గాని న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేయలేదు. 


న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోవటమంటే నిజాయితీ పరులను కించపరిచేవాళ్ళ చేతికి ఆయుధాన్ని అందించటమే. గతంలో రాజకీయాల నుంచి న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్‌ కృష్ణయ్యర్‌, మెజారిటీ తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన జస్టిస్‌ చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి. చంద్రచూడ్‌, జస్టిస్‌ భగవతి, జస్టిస్‌ దేశాయ్‌లాంటి వారిపై ఎవరూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదంటే వారు నిజాయితీగా ఉండటమే గాక ఆనాటి రాజకీయ నాయకుల్లో ఎంతో కొంత ప్రజాస్వామిక భావనలు ఉండటం, న్యాయవ్యవస్థ ఇప్పుడున్నంత క్రియాశీలకంగా లేకపోవటం కూడా కారణమే. ఎవరో చిన్న ఆరోపణ చేశారని హైకోర్టు న్యాయమూర్తి పదవినే శాంతి భూషణ్‌ తిరస్కరించారు.



చెరుకూరి సత్యనారాయణ

(ఎ.పి. బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు)

Updated Date - 2021-01-05T06:04:56+05:30 IST