దేశ సంపద కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం : జూలకంటి

ABN , First Publish Date - 2020-12-03T06:02:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.

దేశ సంపద కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం : జూలకంటి
సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ రూరల్‌, డిసెంబరు 2 : కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, పూర్తికాలం కార్యకర్తల సంయు క్త సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నవంబరు 26న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైందన్నారు. ఈ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి ఎలా ంటి చర్యలు చేపట్టకపోవడం వారిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులను చర్చలకు పిలిచి  రైతాంగ వ్యతిరేక చట్టాలు, విద్యుత్‌ సంస్కరణ బిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తెచ్చిన రైతాంగ చట్టాలు వ్యతిరేకిస్తున్నామని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం, ఇటీవల కాలంలో ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పేరుతో తెచ్చిన రెవెన్యూ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలు చేస్తున్న రాస్తారోకోకు సీపీఎం సంపూర్ణ మద్దతుతో పాటు పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్ని రకాల సన్న ధాన్యాలని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. అనంతరం ఇటీవల కాలంలో మరణించిన నోముల నర్సింహయ్య, తంగెళ్ల నర్సింహారెడ్డి, చిలుక రాధమ్మ, వెంకట్‌రెడ్డితో పాటు కరోనాతో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమావేశంలో తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, కున్‌రెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T06:02:23+05:30 IST