3న చెన్నైలో Shashikala పర్యటన

ABN , First Publish Date - 2022-06-30T12:43:05+05:30 IST

అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ ఈ నెల మూడున చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం అన్నాడీఎంకే

3న చెన్నైలో Shashikala పర్యటన

చెన్నై, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ ఈ నెల మూడున చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి క్యాంపు కార్యాలయం పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. దుష్టశక్తుల బారినుంచి పార్టీని కాపాడేందుకు, డీఎంకే ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ శశికళ ఈ నెల మూడున పర్యటిస్తారని పేర్కొన్నారు. మూడో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టి.నగర్‌ నివాసం నుంచి శశికళ ప్రచార వాహనంలో బయలుదేరి గిండి, కత్తిపారా జంక్షన్‌, పోరూరు మీదుగా పూందమల్లి చేరుకుంటారు. ఆ తర్వాత కుమనన్‌ చావిడి నుంచి బయలుదేరి తిరుమళిసై, వెల్లవేడవు, పాక్కం, తామరైపాక్కం ప్రాంతాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను కలుసుకుని అక్కడి నుంచి టి.నగర్‌ చేరుకుంటారు. ఈ నెల ఐదున మధ్యా హ్నం ప్రచార వాహనంలో బయలుదేరి విల్లుపురం జిల్లా దిండివనం, ఏడున వానూరు, ఎనిమిదిన కల్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేటలో పర్యటించనున్నారు.


పోస్టర్‌ కలకలం...

ఇదిలా ఉండగా శశికళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైకి విచ్చేయనున్నట్లు నగరంలో వెలసిన పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టించాయి. పార్టీ కార్యాలయం సమీపంలోని గోడలపై ఈ పోస్టర్లను అతికించారు. వాటిని చూసిన పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. వేలూరుకు చెందిన ‘చిన్నమ్మ అభిమానులు’ పేరుతో ఆ పోస్టర్లు ముద్రించి ఉన్నాయి. అయితే ఆ పోస్టర్లలో పేర్కొన్నట్లు శశికళ పార్టీ కార్యాలయానికి రాలేదు.

Updated Date - 2022-06-30T12:43:05+05:30 IST