Advertisement

న్యాయమేవ జయతే!

May 31 2020 @ 00:28AM

2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన తన సొంత బాబాయి వై.ఎస్‌.వివేకానందరెడ్డి వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనల వల్ల తన విజయావకాశాలు సన్నగిల్లుతాయనీ, ముఖ్యమంత్రిని నియంత్రించాలనీ ఇదే జగన్మోహన్‌రెడ్డి, ఇదే హైకోర్టును ఆశ్రయించలేదా? వివేకా హత్య విషయమై వాస్తవాలు నిర్ధారణ కాకుండా ప్రకటనలు చేయకూడదని ఇదే హైకోర్టు సూచించలేదా? హైకోర్టు నిర్దుష్టంగా ఆదేశించకపోయినా, మాట్లాడవద్దన్న సూచనను గౌరవించి చంద్రబాబు మౌనం వహించలేదా? అప్పుడు ఇదే హైకోర్టు నుంచి ఉపశమనం పొందింది జగన్మోహన్‌రెడ్డే కదా! అంతేకాదు , ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గుంటూరు జిల్లాలో తాను ఏర్పాటుచేసిన సరస్వతి సిమెంట్‌ కంపెనీకి ఇదే హైకోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు పొందలేదా? అప్పుడు ఇప్పుడు అదే హైకోర్టు.. అదే న్యాయమూర్తులు! ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఎత్తిచూపితే న్యాయ వ్యవస్థకు బురద పూయాలని ప్రయత్నించడం ఏమిటి?


తమకు 50 శాతం ఓట్లు, 151 సీట్లు వచ్చిన తర్వాత తమను అడ్డుకోవడానికి న్యాయస్థానానికి ఉన్న అధికారం ఏమిటి? అనే ధోరణితో జగన్‌ ప్రభుత్వం ముందుకు పోతోంది. అలా చూసుకున్నా 50 శాతం ఓటర్లు జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కదా? వారిని ఎవరు పట్టించుకోవాలి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు ప్రాతిపదికే యాంటీ మెజారిటేరియన్‌! మెజారిటీ ఉందని చట్టసభలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి, పరిధికి లోబడి ఉండేలా చూడటానికే న్యాయ వ్యవస్థ ఉంది. మిగతా వ్యవస్థలలో ఉన్నట్టుగానే న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చును గానీ, సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజల హక్కులను కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ ముందు వరుసలో ఉంటోంది. 


ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన విధంగా ఈ ఏడాది కాలంలో ఆయన కొందరికి మాత్రం మంచి ముఖ్యమంత్రిగానే కనిపిస్తున్నారు. మరికొందరికి మాత్రం మరో రకంగా కనిపిస్తున్నారు. ఇన్ని రోజులుగా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన ఆయన ఇప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాలకు పూనుకున్నారు. ఇలా ఎంతకాలం సాగుతుందో తెలియదు. రాష్ట్ర సంపద హరించుకుపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ సంక్షేమం పేరిట వ్యక్తిగత లబ్ధి పొందుతున్నవారు జేజేలు పలుకుతూనే ఉండవచ్చు. జగన్మోహన్‌రెడ్డి కోరుకుంటున్నది కూడా ఇదే!


న్యాయ వ్యవస్థను కూడా గౌరవించలేని ముఖ్యమంత్రిని ఎలా అర్థంచేసుకోవాలి? న్యాయ వ్యవస్థను కించపరచడంపై హైకోర్టు సీరియస్‌ అయిన తర్వాత కూడా జగన్మోహన్‌రెడ్డి తన మనుషులను అదుపు చేయకపోవడం మూర్తీభవించిన అహంభావానికి నిదర్శనం. న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదా? అని గొంతు చించుకుంటున్నవారు ప్రశ్నించడానికీ, దూషించడానికీ మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం మంచిది. ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే..’ అని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు. ఇది కలికాలం కనుక కలిపురుషులు అధికారంలోకి వస్తుంటారు కనుక అధికారం నెత్తికెక్కిన వారిలోని అహంకారాన్ని అదుపు చేయడానికే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది అని భావించాలేమో!


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను తొలగించడం కోసం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ చెల్లదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. రమేశ్‌కుమార్‌ పదవీకాలాన్ని కుదిస్తూ ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన 77 ఏళ్ల జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించడం చెల్లబోదనీ, రాజ్యాంగంలోని 243 కె (1) నిబంధనకు ఇది విరుద్ధమనీ ఆర్డినెన్స్‌ జారీ చేసినప్పుడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు కూడా అందుకు అనుగుణంగానే వెలువడింది. అయితే జరిగిన పొరపాటును సరిదిద్దుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్టు చెబుతోంది. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై అప్పీలు చేసుకునే అధికారం, అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది కనుక జగన్‌ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టలేం. అయితే గత ఏడాది కాలంగా ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలు చెల్లబోవని హైకోర్టు తీర్పులు ఇవ్వడం వల్ల న్యాయ వ్యవస్థను కూడా వివాదంలోకి లాగే ప్రయత్నాలను అధికార పార్టీ నాయకులు చేపట్టారు.


తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో నిలబడకపోవడానికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవలసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం యథావిధిగా ఎదురుదాడి వ్యూహాన్నే ఎంచుకుంది. దీంతో న్యాయ వ్యవస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందా? అన్న భావం వ్యాపిస్తోంది. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్‌ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో వివాదం పరాకాష్ఠకు చేరింది. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కారం కింద 90 మందికిపైగా పోస్టులు పెట్టినవారికి, వ్యాఖ్యలు చేసినవారికి నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపడుతుంటారు. వైసీపీ నాయకులకు ఈ భయం, వెరపు కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. తాము మంచి చేస్తుంటే న్యాయస్థానం అడ్డుపడుతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. న్యాయస్థానాల విషయంలో ప్రభుత్వాలు జాగరూకతతో, ఆచితూచి వ్యవహరిస్తుంటాయి.


జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం పల్లదనంతో న్యాయ వ్యవస్థను కూడా తమ రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తూ దానిపై దుష్ప్రచారానికి తెర లేపింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తాజా తీర్పు తర్వాత కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుపై అధికారంలో ఉన్నవారి మద్దతుతో కొంతమంది సోషల్‌ మీడియాలో అత్యంత అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనీ, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ ప్రముఖ న్యాయవాది హరీష్‌ సాల్వే తాజాగా అభిప్రాయపడ్డారు. వివిధ స్థాయిలలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు ఆమోదయోగ్యంగా లేవు అని భావించేవారు ఉన్నత న్యాయస్థానాలలో అప్పీలు చేసుకోవచ్చు. ఏ తీర్పు కూడా ఫైనల్‌ అనడానికి లేదు. చివరకు సుప్రీంకోర్టు కూడా తమ తీర్పునే ఫైనల్‌ అని భావించడం లేదనీ, అయితే మరో వ్యవస్థ ఏదీ లేనందున ఆయా తీర్పులను ఫైనల్‌గా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడిన సందర్భాలూ ఉన్నాయి.


ఇంతటి వెసులుబాటు ఉన్నప్పటికీ, వాటిని వినియోగించుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నాలకే ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరం. తమకు 50 శాతం ఓట్లు, 151 సీట్లు వచ్చిన తర్వాత తమను అడ్డుకోవడానికి న్యాయస్థానానికి ఉన్న అధికారం ఏమిటి? అనే ధోరణితో జగన్‌ ప్రభుత్వం ముందుకు పోతోంది. అలా చూసుకున్నా 50 శాతం ఓటర్లు జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కదా? వారిని ఎవరు పట్టించుకోవాలి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు ప్రాతిపదికే యాంటీ మెజారిటేరియన్‌! మెజారిటీ ఉందని చట్టసభలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి, పరిధికి లోబడి ఉండేలా చూడటానికే న్యాయ వ్యవస్థ ఉంది. ఒక బలహీనుడిపై పది మంది బలవంతులు దాడి చేస్తే బాధితుడు వెళ్లేది పోలీస్‌ స్టేషన్‌కే కదా? పోలీసులు న్యాయం చేయని పక్షంలో న్యాయస్థానాలనే ఆశ్రయిస్తాడు కదా? కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయమే ఫైనల్‌ అయ్యే పక్షంలో బలహీనుల పరిస్థితి ఏమిటి? మన రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని చెప్పుకొనే నక్సలైట్లు సైతం పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలలో న్యాయ వ్యవస్థనే ఆశ్రయిస్తున్నారు కదా? మిగతా వ్యవస్థలలో ఉన్నట్టుగానే న్యాయవ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చును గానీ, సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజల హక్కులను కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ ముందు వరుసలో ఉంటోంది.


అధికారం ఉంది కదా అని మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ను ఉపయోగించుకుని చీకట్లోనే దేవేంద్ర ఫడణవీస్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు అడ్డుపడింది సుప్రీంకోర్టే కదా! అంతెందుకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయమే తీసుకుందాం. తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆయన ఆశ్రయించింది సుప్రీంకోర్టునే కదా? సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడం వల్లనే కదా ఆయన ఇవ్వాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు! తనపై సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులు అక్రమమని ఆయన కూడా న్యాయస్థానం తలుపే కదా తట్టింది! 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన తన సొంత బాబాయి వై.ఎస్‌.వివేకానందరెడ్డి వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనల వల్ల తన విజయావకాశాలు సన్నగిల్లుతాయనీ, ముఖ్యమంత్రిని నియంత్రించాలనీ ఇదే జగన్మోహన్‌రెడ్డి, ఇదే హైకోర్టును ఆశ్రయించలేదా? వివేకా హత్య విషయమై వాస్తవాలు నిర్ధారణ కాకుండా ముఖ్యమంత్రి సహా పోలీసులు కూడా ప్రకటనలు చేయకూడదని ఇదే హైకోర్టు సూచించలేదా? హైకోర్టు నిర్దుష్టంగా ఆదేశించకపోయినా, మాట్లాడవద్దన్న సూచనను గౌరవించి చంద్రబాబు మౌనం వహించలేదా? అప్పుడు ఇదే హైకోర్టు నుంచి ఉపశమనం పొందింది జగన్మోహన్‌రెడ్డే కదా! అంతేకాదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గుంటూరు జిల్లాలో తాను ఏర్పాటుచేసిన సరస్వతి సిమెంట్‌ కంపెనీకి ఇదే హైకోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు పొందలేదా? అప్పుడు ఇప్పుడు అదే హైకోర్టు.. అదే న్యాయమూర్తులు! ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఎత్తిచూపితే న్యాయ వ్యవస్థకు బురద పూయాలని ప్రయత్నించడం ఏమిటి? అవినీతి కేసులలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవడం ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఇబ్బందిగా ఉందని ఇదే జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించలేదా? తీర్పులు అనుకూలంగా వస్తే న్యాయ వ్యవస్థ గొప్పది.. లేని పక్షంలో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని నిందించడం ఏమిటి? ఎవరు ఎన్ని రకాలుగా నోరు పారేసుకున్నప్పటికీ మిగతా వ్యవస్థలతో పోల్చితే ప్రజలకు న్యాయ వ్యవస్థపైనే అధిక విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది.


అంతమాత్రాన సదరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎవరూ తప్పుబట్టకూడదు అని భావించడం అహంకారమే అవుతుంది. దాదాపు 64 సందర్భాలలో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పులలో హేతుబద్ధత లేని పక్షంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించి ఉండేది కదా? అలా జరగడం లేదంటే ప్రభుత్వంలోనే లోపం ఉన్నట్టు భావించాలి కదా? ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించే విధంగా జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇందుకు కారణం.. మాతృ భాషలోనే ప్రాథమిక విద్యను బోధించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా జారీ చేసే జీవోలను ఏ న్యాయస్థానమైనా కొట్టివేస్తుంది. తెలుగు మాధ్యమంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. మాతృభాషకు చోటు లేకుండా చేయడం వల్లనే తంటా అంతా! ఈ లాజిక్‌ను విస్మరించి న్యాయస్థానాన్ని నిందించడం వల్ల ప్రయోజనం ఏమిటి? గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ప్రభుత్వ వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ తన జెండా రంగులు వేయడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టినా దాన్ని సవరించుకోవలసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొండికేసింది. దీంతో హైకోర్టు కల్పించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు మరో ఇద్దరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది.


ఇంత జరిగిన తర్వాత కూడా పొరపాటును సవరించుకోకుండా ఏ సుప్రీంకోర్టు అయితే వద్దని అందో.. అదే సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకోదా? విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు నిబంధనలు పాటించకుండా అనుచితంగా వ్యవహరించినందున సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించడంపై కూడా అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ ఇప్పుడు పోలీస్‌ కస్టడీలో ఉన్నారా? జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారా? అని శుక్రవారంనాడు న్యాయస్థానం ప్రశ్నించినప్పుడు ప్రభుత్వ న్యాయవాది జవాబు చెప్పడానికి సమయం కావాలనడం దేనికి సంకేతం? నిందితులు ఎవరైనా 24 గంటలలో న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలన్న నిబంధనను విశాఖ పోలీసులు కాలరాశారని భావించాల్సి ఉంటుంది. పోలీసులకు ఇటువంటి అనుచిత అధికారాలు ఉంటే ఏమి జరుగుతుందో చెప్పాలా? హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వెసులుబాటు ఇలాంటి సందర్భాలు వస్తాయనే కదా కల్పించింది? ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు కూడా రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉండాలి. మాకు అసాధారణ మెజారిటీ లభించింది కనుక మేం ఏమైనా చేస్తాం, అడ్డుకోవడానికి మీరు ఎవరు? అంటే కుదరదు. న్యాయస్థానం పదే పదే తప్పుబట్టడం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కూడా గౌరవం తెచ్చిపెట్టదు. జగన్మోహన్‌రెడ్డికి ముందు, తర్వాత కూడా రాజకీయాలు ఉన్నాయి.. ఉంటాయి! న్యాయ వ్యవస్థను కూడా గౌరవించలేని ముఖ్యమంత్రిని ఎలా అర్థంచేసుకోవాలి? న్యాయ వ్యవస్థను కించపరచడంపై హైకోర్టు సీరియస్‌ అయిన తర్వాత కూడా జగన్మోహన్‌రెడ్డి తన మనుషులను అదుపు చేయకపోవడం మూర్తీభవించిన అహంభావానికి నిదర్శనం. న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదా? అని గొంతు చించుకుంటున్నవారు ప్రశ్నించడానికీ, దూషించడానికీ మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం మంచిది. ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే..’ అని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు. ఇది కలికాలం కనుక కలిపురుషులు అధికారంలోకి వస్తుంటారు కనుక అధికారం నెత్తికెక్కిన వారిలోని అహంకారాన్ని అదుపు చేయడానికే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది అని భావించాలేమో!


జేజేలకే ప్రాధాన్యం!

ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ఏడాది కాలం పూర్తిచేసుకున్నారు. ఏడాది కాలంలో మెరుపులెన్ని, మరకలెన్ని అంటే.. కొంతమందికి అన్నీ మెరుపులే కనిపిస్తుండగా, మరికొంతమందికి అన్నీ మరకలే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయన ఎంచుకున్న మార్గం, అనుసరిస్తున్న వ్యవహార శైలి! తెలంగాణలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను రీడిజైన్‌ చేయడంతోపాటు కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ మంత్రాన్ని జపిస్తున్నారు. సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని నమ్ముతున్న ఆయన అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. దీంతో ప్రభుత్వ రాబడి తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రాధినేతగా సంపద పెంచడానికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా అప్పు చేసి పప్పుకూడు విధానాన్ని మాత్రమే అనుసరిస్తున్నారు. బాధ్యత గల తండ్రి.. పిల్లలు అడిగినవన్నీ స్థోమత ఉన్నప్పటికీ కొనివ్వరు. అలా చేస్తే పిల్లలు చెడిపోతారు. పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత తమను బాధ్యతగా పెంచి, అంతో ఇంతో సంపద కూడబెట్టిన తండ్రినే గౌరవిస్తారు. బాధ్యతారహితంగా తాము అడిగినవన్నీ ఇచ్చి తాము ప్రయోజకులు కాకుండా పోవడానికి కారణమైన తండ్రిని పిల్లలు కూడా ఇష్టపడరు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఆరు సంవత్సరాలు అయింది. తెలంగాణ రాష్ట్రం దక్షిణ కొరియా బాటలో పయనిస్తుండగా, రాజధాని కూడా లేకుండా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఉత్తర కొరియా బాటలో పయనిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి తన తొలి ఏడాది పాలనలో ప్రత్యర్థులను అణచివేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో కుల విద్వేషాన్ని కూడా దాచుకోలేదు. ముఖ్యమంత్రిగా తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదికను కూల్చివేయడం. అలా అని రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు ఆగిపోయాయా? అంటే అదీ లేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నోటిఫై అయిన అమరావతి ఉసురు తీయడం మొదలుపెట్టారు. దీంతో ఏడాది క్రితం వేల మంది కార్మికులతో సందడిగా కనిపించిన అమరావతి ఇప్పుడు శ్మశానాన్ని, ఏడారిని తలపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకున్న జగన్‌.. ఒక వైద్యుడుగా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఏడు పదుల వయసులో బలవన్మరణానికి పాల్పడటానికి పరోక్షంగా కారకుడు అయ్యారు. ఇలాంటి చర్యలు కూడా కొందరిలో మోదాన్ని కలిగించి ఉండవచ్చు గానీ రాజకీయాలలో దుష్ట సంప్రదాయానికి తెరతీసిన వారయ్యారు. పేదలకు కడుపునిండా భోజనం పెట్టిన అన్న క్యాంటీన్లు అన్నీ రద్దు చేసి అపఖ్యాతిని మూటకట్టుకున్నారు.


నిజానికి జగన్మోహన్‌రెడ్డి అమలుచేసిన అమ్మ ఒడి వంటి పథకాలు మంచివే అయినప్పటికీ ఇతరత్రా విషయాలలో కక్షపూరిత వైఖరి అవలంబించడం వల్ల మరకలే డామినేట్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. కుళ్లిపోయిన రాజకీయాలను సంస్కరించడానికై తాను పుట్టానని నమ్మబలుకుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రజాస్వామ్య వాసనలు లేకుండా చేయడం ద్వారా న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తింటున్నారు. కొన్ని విషయాలలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి వారికి అనధికారికంగా అధికారాలు కట్టబెట్టారు. దీంతో ఆయనకు చెడ్డపేరు వచ్చింది. ఇది గమనించిన జగన్మోహన్‌రెడ్డి తెలివిగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి వారికి నెలకు ఐదు వేల రూపాయల వంతున ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. వారికి అధికారాలతోపాటు కొన్ని సేవా కార్యకలాపాలను అప్పగించడం ద్వారా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరహాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈ కారణంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సైతం కుక్కిన పేనుల్లా పడి ఉంటున్నారు. న్యాయస్థానాలు శిక్ష విధించినా పర్వాలేదు అనుకుంటున్నారే గానీ, ముఖ్యమంత్రి తీసుకుంటున్న అభ్యంతరకర నిర్ణయాలను మాత్రం కాదనలేకపోతున్నారు. ఏడాది పాలన సమీక్షల సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి ఉపన్యాసం వింటే ‘ఆయన ఎంత ఉత్తముడు’ అని అనుకోకుండా ఉండలేం! రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు కూడా ఒకప్పుడు తియ్యగా మాట్లాడేవారు. అయితే వారు ప్రత్యర్థులను అంతమొందించాలనుకున్న రోజు తాము ఆస్పత్రుల్లో చేరేవారు.. లేదా ఇతర నగరాలకు వెళ్లినట్టు విమానం టికెట్‌ కొనుక్కునేవారు. అదొక మోడల్‌! లోతుగా పరిశీలించినవారికి మాత్రమే జగన్మోహన్‌రెడ్డిలో మరో కోణం గురించి తెలుస్తుంది. అయితే ప్రజలకు ఆ విషయం తెలియకుండా ఉండటం కోసమే ఆయన సంక్షేమబాటను ఎంచుకున్నారు. అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి తన ప్రభుత్వంలో అవినీతి లేదంటున్నారు.. నమ్మేవాళ్లు నమ్ముతున్నారు.


న్యాయస్థానంలో నిందితుడిగా నిలబడిన వ్యక్తి ఇవ్వాళ న్యాయమూర్తులను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని నిందించిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పట్లో రాదని తేల్చిపారేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నందున హోదా కోసం నిలదీయలేమని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీనే ఉంది. అయినా మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా చచ్చినట్టు వస్తుందని ప్రకటించిన జగన్‌.. ఇప్పుడు నాలుక మడతేయడం అంటే మడమ తిప్పడం కాదా? ఆయన చెప్పే ‘విలువలతో కూడిన రాజకీయాలు’ అంటే ఇవేనేమో! అయితే ఒక్కటి మాత్రం నిజం.. జగన్మోహన్‌రెడ్డిలో ఉన్నంత ఆత్మవిశ్వాసం మరెవ్వరిలోనూ కనిపించదు. ఈ కారణంగానే పలు అబద్ధాలను కూడా నిజాలుగానే ఆయన ప్రజలకు చెప్పగలుగుతున్నారు.


న్యాయ వ్యవస్థ కన్నెర్రజేస్తే ముఖ్యమంత్రి పదవి కోల్పోవడమే కాకుండా మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా న్యాయ వ్యవస్థతోనే ఢీకొనడానికి సిద్ధపడటం మొండితనమో, మూర్ఖత్వమో తెలియదు. ఇలాంటి లక్షణాలు ఉన్నందువల్లే ఆయనకు బలమైన అనుచరవర్గం ఉందన్న అభిప్రాయం కూడా ఉంది. కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొని అలుపెరగని బాటసారిలా ఇంట గెలిచి, తన ఏకైక లక్ష్యమైన ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు. అయితే ముఖ్యమంత్రిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన అభాసుపాలయ్యారు. ఇంట్లో ఈగల మోత– బయట పల్లకీ మోత విధానంపై ఆయనకు నమ్మకం లేదు. అందుకే ఎవరు ఏమి అనుకుంటున్నప్పటికీ కనీస వెరపు లేకుండా ఓటుబ్యాంకు సుస్థిరం చేసుకునే దిశగా ఈ ఏడాదికాలంగా అడుగులు వేశారు. తన ఆయువుపట్టు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దల గుప్పెట్లో ఉందని బాగా తెలిసిన జగన్మోహన్‌రెడ్డి వారితో సత్సంబంధాలను మాత్రం కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన విధంగా ఈ ఏడాది కాలంలో ఆయన కొందరికి మాత్రం మంచి ముఖ్యమంత్రిగానే కనిపిస్తున్నారు. మరికొందరికి మాత్రం మరో రకంగా కనిపిస్తున్నారు. ఇన్ని రోజులుగా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన ఆయన ఇప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాలకు పూనుకున్నారు. ఇలా ఎంతకాలం సాగుతుందో తెలియదు. రాష్ట్ర సంపద హరించుకుపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ సంక్షేమం పేరిట వ్యక్తిగత లబ్ధి పొందుతున్నవారు జేజేలు పలుకుతూనే ఉండవచ్చు. జగన్మోహన్‌రెడ్డి కోరుకుంటున్నది కూడా ఇదే!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.