‘అమ్మ’ మృతిపై విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2022-03-22T16:21:50+05:30 IST

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రేగుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటైన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణను వేగవంతం చేసింది.

‘అమ్మ’ మృతిపై విచారణ వేగవంతం

జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట హాజరైన ఓపీఎస్‌, ఇళవరసి

విదేశాలలో చికిత్సలందించాలని కోరగా వారంలో డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు చెప్పారని వెల్లడి

చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రేగుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటైన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణను వేగవంతం చేసింది. కమిషన్‌ ముందు సోమవారం మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఇళవరసి హాజరయ్యారు. ఈ సందర్భంగా  కమిషన్‌ ముందు ఓపీఎస్‌ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి జయలలితను విదేశాలకు తీసుకెళ్ళి చికిత్సలందించాలని సూచించానని, అయితే ఆ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి అల్లుడు డాక్టర్‌ విజయకుమార్‌ రెడ్డి ఆమె కోలుకుంటున్నారని వారంలో డిశ్చార్జ్‌ అవుతారని తనకు తెలిపారని ఓపీఎస్‌ వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.


అన్నాదురై, ఎంజీఆర్‌కు విదేశాలల్లో చికిత్సలందించినట్లు జయకు కూడా విదేశీ ఆసుపత్రిలో చికిత్సలందించాలని తాను ప్రతిపాదించానని పేర్కొన్నారు. తన ప్రతిపాదన గురించి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌కు చెప్పినప్పుడు డాక్టర్లతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారని చెప్పారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహహన్‌రావు తన ప్రతిపాదన పట్ల స్పందించలేదని చెప్పారు. ఆ తర్వాత డాక్టర్‌ విజయకుమార్‌ రెడ్డి తనతో మాట్లాడుతూ జయ కోలుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగైందని తెలిపారన్నారు. వారంలో డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారన్నారు. జయను విదేశాలకు తీసుకెళ్లేందుకు అందరూ అంగీకరించి వుంటే అప్పటి ముఖ్యమంత్రిగా తాను ఫైలుపై సంతకం చేసి ఉండేవాడినని చెప్పారు. అటుపిమ్మట మంత్రి విజయభాస్కర్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు కలిసి జయకు చికిత్సలందించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి వైద్యనిపుణులను రప్పించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 


జయ ఆరోగ్య పరిస్థితులు తెలియవు...

మాజీ ముఖ్యమంత్రి జయ మధుమేహంతో బాధపడుతుండేవారని, అంతకు మించి ఆమె అనారోగ్య పరిస్థితులు గురించి తనకేమీ తెలియవని ఓపీఎస్‌ వివరించినట్లు తెలిసింది. జయ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నప్పుడు ఆమెను చూడనేలేదని చెప్పారు. జయ ఆసుపత్రిలో చేరటానికి ముందు రోజు మెట్రోరైలు సర్వీసు ప్రారంభోత్సవంలోనే ఆమెను చివరిసారిగా చూశానని తెలిపారు. జయ ఆసుపత్రిలో చేరినరోజు ఆమెకు ఏమి జరిగిందో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఆమెకు ఎలాంటి చికిత్సలందిస్తున్నారో, ఏయే వైద్యనిపుణులు చికిత్స చేస్తున్నారో కూడా తనకు తెలియవని అన్నారు. తాను స్వస్థలంలో ఉన్నప్పుడే జయ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారనే సమాచారం తెలిసిందని, చెన్నైకి తిరిగిరాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఆమె ఆరోగ్యపరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నానని పన్నీర్‌సెల్వం వివరించారు. జయ మృతిపై ప్రజానీకంలో అనుమానాలు వ్యక్తం కావడం వల్లే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చిందని, అప్పట్లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా తాను జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఫైళ్లపై సంతకాలు చేశానని ఆయన  పేర్కొన్నారు.


ఆసుపత్రిలో జయకు శశికళ తోడుగా ఉండేవారు...

శశికళ బంధువు ఇళవరసి సాక్ష్యమిస్తూ... అపోలో ఆసుపత్రిలో జయ చికిత్సపొందుతున్నప్పుడు తాను రోజూ ఆసుపత్రికి వెళ్ళానని, ఒకటి రెండు సార్లు కిటికీ అద్దాల నుండి జయను చూశానని చెప్పారు. ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్నప్పుడు ఆమె వెంట శశికళ మాత్రమే ఉండేవారని తెలిపారు. అంతకు మించి జయకు అందించిన చికిత్సల వివరాలు గురించి తనకేవీ తెలియవని ఆమె పేర్కొన్నట్లు   సమాచారం. 


ఓపీఎస్‌ హాజరుతో కమిటీ విచారణ వేగవంతం...

అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం హాజరై వాంగ్మూలం ఇవ్వడంతో జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ విచారణ వేగం పుంజుకుంది. జయ మృతిపై విచారణ జరుపుతున్న ఆ కమిటీ మూడేళ్ల తర్వాత మళ్ళీ తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆ కమిటీ జయకు చికిత్సలందించిన అపోలో ఆసుపత్రి వైద్యులు సహా 154 మంది సాక్ష్యుల వద్ద వాంగ్మూలాలు సేకరించింది. అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ అభ్యర్థన మేరకు అపోలో ఆసుపత్రి వైద్యుల వద్ద మళ్ళీ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో తమ విచారణకు హాజరుకావాలంటూ శశికళ బంధువు ఇళవరసి, అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వంకు కమిటీ సమన్లు జారీ చేసింది.


ఆ మేరకు సోమవారం ఉదయం తొలుత ఇళవరసి జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట హాజరై సాక్ష్యమిచ్చారు. కమిటీ అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలిచ్చారు. ఆ తర్వాత పన్నీర్‌సెల్వం విచారణ సంఘం ఎదుట హాజరై వాంగ్మూలమిచ్చారు. గతంలో పన్నీర్‌సెల్వంకు ఎనిమిది సార్లు ఆర్ముగస్వామి కమిటీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ పరిస్థితులలో పన్నీర్‌సెల్వం కమిటీ ఎదుట తొలిసారిగా హాజరై వాంగ్మూలమిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధుమేహంతో బాధపడుతుండేవారనే సమాచారం తప్ప ఆమెకు సంబంధించిన  ఇతర రోగాలు గురించి తనకేమీ తెలియదని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-22T16:21:50+05:30 IST