ltrScrptTheme3

అక్బర్‌కో న్యాయం, అజయ్‌కో న్యాయమా?

Oct 22 2021 @ 01:53AM

ఒక మంత్రి తన పదవి నుంచి ఎప్పుడు వైదొలగాలి? తనకు తానుగా రాజీనామా చేయని పక్షంలో అతనికి ఉద్వాసన చెప్పాలా? చీకాకు పెట్టే ఈ ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ ప్రజల పిచ్చాపాటీలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. లఖీంపూర్ ఖేరీ భీతావహ హింసాత్మక ఘటన విషయంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలకు గురవుతున్న కేంద్ర హోం మంత్రి అజయ్ మిశ్రా తన పదవిలో నిశ్చింతగా కొనసాగుతున్నారు! ఆయన పదవీ వైభోగాన్ని హర్షించ లేకపోతున్నవారే పై ప్రశ్నలను సంధిస్తున్నారు. 


లఖీంపూర్ ఖేరీ గ్రామం అజయ్ మిశ్రా నియోజకవర్గంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పైకి వివిఐపీల కాన్వాయ్ దూసుకువెళ్ళడంతో హింసాత్మక ఘటనలు సంభవించాయి. ఆ భీతావహ దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. అమాయక ప్రజల పైకి వాహనాలను ఉరికించిన ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనల వీడియో మంత్రిని చాలాకాలం పాటు వెంటాడుతుందనడంలో సందేహం లేదు. మానవ ప్రాణాల పట్ల క్షమార్హం కాని కక్షపూరిత వైఖరికి ఆ వీడియో అద్దం పట్టింది. లఖీంపూర్ ఘటనను ఉద్దేశపూర్వకంగా పాల్పడిన క్రూరహత్య అని అభివర్ణించవచ్చు. ఆ ఘోరం పట్ల ఆ అమాత్యుడు అనుతాపం చూపకపోగా అందులో కీలకపాత్ర వహించిన తన కుమారుడి పక్షమే వహిస్తున్నాడు. అజయ్ మిశ్రాను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళి ‘న్యాయం చేయాలని’ రాష్ట్రపతికి విన్నవించాయి. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుసంఘాలు రైల్‌రోకో నిరసనలు తెలిపాయి. ఇంత జరుగుతున్నా మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. లేదంటే ఉద్యమకారులపై ప్రత్యారోపణలు చేస్తోంది! ఈ రెండు వైఖరులూ గర్హనీయమైనవే. మన పాలనావ్యవస్థలో నైతిక భ్రష్టత్వం ఎంతగా ఉందో అవి స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ జవాబుదారీతనం, రాజకీయ ఔచిత్యం అనేవి ఇప్పుడు ఎంతమాత్రం నైతిక విశ్వాసాలు కానేకావు. అవి కేవలం ఉపయోగకరమైన అనుకూలతలు, అవకాశాలు మాత్రమే. విలువుల పతనానికి ఇదొక పరాకాష్ఠ.


ఒక దశాబ్దం క్రితం కేవలం జిల్లా పరిషత్ సభ్యుడుగా ఉన్న అజయ్ మిశ్రా 2014లో తొలిసారి లోక్్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది జూలైలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. ప్రతిభ, యోగ్యత, పాలనానుభవం కంటే కుల ప్రాబల్యం ప్రాతిపదికనే అజయ్ మిశ్రా తన రాజకీయ జీవితంలో శీఘ్ర గతిన ఎదిగారు. కేంద్ర మంత్రిమండలిలో బ్రాహ్మిణ్ కోటాలో భాగంగానే ఆయనకు మంత్రి పదవి దక్కింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న కీలక ఎన్నికలలో తమ సంప్రదాయ ఓటుబ్యాంక్‌ను కాపాడుకునేందుకే మిశ్రాకు మంత్రి పదవినిచ్చారన్నది స్పష్టం. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితాలు వివాదాస్పదమైనవి. దాడి, బెదిరింపు, చివరకు హత్యారోపణలు కూడా ఆయనపై ఉన్నాయి ఒక హత్య కేసులో ఆయనపై వెలురించాల్సిన తీర్పును లక్నో హైకోర్టు 2018 నుంచి నిలిపివేసి ఉంచింది. దేశంలో శాంతిభద్రతలను కాపాడవలసిన హోంశాఖ సహాయ మంత్రిగా హత్యారోపణల నెదుర్కొంటున్న వ్యక్తి నియమితుడవడం మన రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో స్పష్టమవుతోంది. 


ఆశిష్ మిశ్రా పాల్పడిన నేరాలకు తండ్రి అజయ్ మిశ్రా ఎలా బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది సహేతుకమేనా? కుమారుడి నేరంపై పోలీసు దర్యాప్తును తండ్రి ప్రభావితం చేయకుండా ఉంటారా? అందునా , లఖీంపూర్ ఖేరీ ఘటనకు కొద్దిరోజుల ముందు రైతు ఉద్యమకారులను ఆశిష్ మిశ్రా బెదిరించాడు. ఇందుకు తిరుగులేని రుజువులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి తన కుమారుడిని వెనకేసుకుని రావడమంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే కాదా? కనీసం దర్యాప్తు పూర్తయ్యేంతవరకైనా మంత్రి పదవి నుంచి ఆయన వైదొలగాల్సిన అవసరం లేదా? ఇటువంటి నైతిక ప్రవర్తనకు దోహదం చేసే రాజకీయ వాతావరణం ఇప్పుడు మనదేశంలో లేనేలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనుకనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రజాబాధ్యతల మధ్య రేఖలను అస్పష్ట పరచగలుగుతున్నారు.


రాజ్యాంగ ప్రమాణాన్ని నిర్భీకంగా ఉల్లంఘిస్తున్న మంత్రులను కనీసం మందలించాలి కదా. దేశ పాలనలో ఘనమైన ప్రమాణాలను నెలకొల్పినట్టు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మోదీ పాలనా నమూనా ఇందుకు ప్రయత్నించడమే లేదు. ఇది దురదృష్టకరమైన విషయం. గుజరాత్ ముఖ్యమంత్రిగానూ, ప్రధానమంత్రిగానూ తన ఇరవైఏళ్ళ అధికార జీవితంలో నరేంద్ర మోదీ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఒక మంత్రిని నిర్బంధంగా రాజీనామా చేయించారు. నేను ఎం.జె.అక్బర్ గురించి ప్రస్తావిస్తున్నాను. లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన కారణంగా 2018లో అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా ఆయనపై పలువురు మహిళలు ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ అనేది దాఖలు కాలేదు కానీ వాటివల్ల ఆయన గౌరవానికి ఎనలేని హాని జరిగింది. పాత్రికేయ ప్రముఖుడైన అక్బర్‌కు సొంత రాజకీయ బలం లేదు. అతడి అవసరం తమకు లేదని భావించినందునే ఆ పాత్రికేయ-–రాజకీయవేత్తను అలా వదిలించుకున్నారు. 


ముఖ్యమంత్రిగా మోదీ హయాంలో మంత్రులు అనివార్యంగా రాజీనామా చేసిన ఉదాహరణలు రెండే ఉన్నాయి. 2009-10లో మోదీ మంత్రి మండలిలో అమిత్ షా, మాయా కొడ్నానిలు తమ పదవులకు రాజీనామా చేశారు. ముందస్తు బెయిల్‌కు వారు దాఖలు చేసిన దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. దాంతో అమిత్ షా, మాయాలను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశమున్నందున మోదీ వారి రాజీనామాలను అంగీకరించక తప్పలేదు. మిగతా సందర్భాలలో మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ లేదా ఎన్నికల సందర్భంలో పార్టీ టిక్కెట్‌ను నిరాకరించడం ద్వారా తమ మంత్రిమండలిలో మార్పులు చేర్పులు జరిగాయి. అంతేగానీ హఠాత్తుగా రాజీనామా చేయాలని ఆయన ఎప్పుడూ ఎవరినీ ఆదేశించలేదు. నిజానికి మరో సందర్భంలో ఒక సహకార బ్యాంకు కుంభకోణంలో గుజరాత్ మంత్రి ప్రతిభా సింగ్ చౌహాన్‌పై ఛార్జిషీటు దాఖలయింది. అయినప్పటికీ మోదీ ఆయనను మంత్రిమండలిలో కొనసాగించారు. 


ఈ వాస్తవాల దృష్ట్యా అజయ్ మిశ్రాను రాజీనామా చేయమని మోదీ ఆదేశించే ప్రసక్తి ఉండబోదు. కోర్టు తప్పుపడితే మాత్రం అజయ్ మిశ్రా పరిస్థితి అంగీకారయోగ్యం కాబోదు. నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే ఆయన్ని రాజీనామా చేయమని మోదీ తప్పక అడుగుతారు. ఈ విషయంలో మీడియా, ప్రతిపక్షాల ఒత్తిడికి ఆయన తలొగ్గరు. అలా తలొగ్గడం నాయకత్వ బలహీనతకు చిహ్నంగా ఆయన భావిస్తారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. అవినీతి ఆరోపణలు కాదు కదా తమ విధుల నిర్వహణలో కించిత్ అనుచితంగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కోవలసివచ్చిన వారు కూడా పదవుల నుంచి నిష్క్రమించవలసివచ్చేది. 2013లో అశ్వినీ కుమార్, పవాన్ బన్సాల్ రాజీనామాలే ఇందుకు ఉదాహరణలు. 


మన్మోహన్ సర్కార్‌తో పోలిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం మహా శక్తిమంతమైనది. అదుపులేని రీతిలో అధికారాలను చెలాయిస్తున్న ప్రభుత్వమిది. అదే ప్రజల నిశిత దృక్కుల నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని రక్షిస్తోంది. అయితే ప్రధానమంత్రి నాయకత్వానికి లభిస్తున్న మద్దతును టీమ్ మోదీకి మొత్తంగా లభిస్తున్నదిగా పొరపడుతున్నారు. ఈ అస్పష్టత వల్ల మోదీ ప్రభుత్వం కొన్ని వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు సంకోచిస్తోంది. ఇది ఒక విధంగా ప్రభుత్వాన్ని బలహీనపరుస్తోందని చెప్పక తప్పదు. కేంద్ర మంత్రిమండలి నుంచి అజయ్ మిశ్రాకు ఉద్వాసన చెప్పకపోవడమే కాకుండా, కనీసం లఖీంపూర్ ఖేరీ ఘటనపై ఆందోళన సైతం వ్యక్తం చేయకపోవడం వల్ల చట్టబద్ధ పాలన నందించే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధత, విశ్వసనీయతకు తీవ్ర విఘాతం వాటిల్లింది. ఈ నిర్లక్ష్యవైఖరి, దురహంకార ధోరణి ఇలానే కొనసాగితే ప్రభుత్వాధినేతకు కూడా ఏదో ఒక రోజు బయటపడలేనంతగా చిక్కుపరిస్థితులు ఏర్పడతాయి.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

దీపశిఖ

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.