ltrScrptTheme3

న్యాయం నడిస్తే చాలదు, పరుగెత్తాలి!

Oct 21 2021 @ 00:37AM

న్యాయ వ్యవస్థలో ఇటీవల పరిణామాలను గమనించిన వారికి వ్యవస్థ మీద కొత్త ఆశ, నమ్మకం కలుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు చొరవ తీసుకున్న న్యాయమూర్తులకు కక్షిదారుల సమాజం ఎంతో ఋణపడి ఉంటుంది. ఆలస్యంగానైనా మేల్కొని సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడ అభినందించాలి. ఇదే స్ఫూర్తితో మిగిలిన ఖాళీలను కూడ త్వరగా భర్తీ చేయాలి. 


సత్వర న్యాయం అన్నది ప్రజల హక్కా కాదా అన్న విషయం పక్కన పెడితే– ఎంతో బాధతో, వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం కోసం తలుపు తట్టిన వారికి సకాలంలో న్యాయం అందించడం అన్నది వ్యవస్థకు మూలస్తంభాలుగా ఉన్న విభాగాల మౌలిక బాధ్యత. ఆ బాధ్యతను ఆ విభాగాలు సరిగా నిర్వహించనినాడు దానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ మొదలవుతుంది. చట్టబద్ధంగా వ్యవహరించే వారు సైతం తప్పనిసరి పరిస్థితుల మధ్య గూండాల, రాజకీయ నాయకుల మధ్యవర్తిత్వం వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే గొడ్డలి పెట్టు. 


‘‘జీవనం అంటే శ్వాసిస్తూ కేవలం జంతువులా బతకడం కాదు. గౌరవప్రదంగా, ఆరోగ్యకరమైన, కాలుష్య రహితమైన, అర్థవంతమైన, పరిపూర్ణమైన జీవితం కొనసాగించడం’’ అంటూ భారత అత్యున్నత న్యాయస్థానం జీవించే హక్కుకు ఎన్నో కేసుల విచారణ సందర్భంగా భాష్యం చెప్పింది. మరి న్యాయస్థానాల్లో సంవత్సరాలు, పుష్కరాలు, తరాల వారీగా కేసులు మగ్గుతుంటే  రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు భంగం కలిగినట్లే కదా! తమ కష్టార్జితమైన ఆస్తులు వివాదంలో చిక్కుకున్నప్పుడు ఏ వ్యక్తీ సంతోషంగా జీవించలేడు. 


ఒక మనిషి డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. నెలవారీ ప్రభుత్వానికి జి.ఎస్.టి., టి.డి.ఎస్., అడ్వాన్స్ టాక్స్, ఇ.ఎస్.ఐ., పి.ఎఫ్., ప్రొఫెషనల్ టాక్స్, ఇంకా చాలా పన్నులు నిర్దేశించిన గడువు లోపల కట్టాలి. మరి ఇన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటించి సంపాదించిన ఆస్తులు వివాదాల్లో చిక్కుకుంటే సత్వర న్యాయం అందించాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థ మీద లేదా? ప్రభుత్వాలకు పన్నుల రూపంలో బడ్జెట్ నిధులను సమకూర్చుతున్న ప్రజలకు ఆ నిధుల్లో కొంత శాతమయినా కేటాయించి సత్వర న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థల మీదే ఉంది. 60–70 సంవత్సరాల మధ్య ఉన్నవారు– వారు యువకులూ కారు,  వృద్ధులూ కారు. మధ్యలో ఉంటారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులవల్ల ఇంకా బాధ్యతల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. ఆదాయపు పన్నుల తాయిలాలు, రైలు టికెట్ల రాయితీలు, వృద్ధుల చట్టాలు వారికి ఒరగబెట్టేది ఏదీ ఉండదు. వ్యవస్థాగత సమస్యల వల్ల అందరికీ సత్వర న్యాయం అందించలేని పక్షంలో కనీసం వయో వృద్ధుల వివాదాల విచారణలోనైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల మీద ఉంది. ప్రతి వయోవృద్ధుని వివాదం, లేదా ఏదైనా వివాదం విచారణలో ఉంటే ఆ వివాదంలోని ఏ వ్యక్తి అయినా 60 సంవత్సరాల వయసుకు చేరుకుంటే అప్పటినుంచి ఒకటి రెండేళ్ళ నిర్ణీత కాలవ్యవధి లోపల విచారణ ముగించి తీర్పు ఇవ్వాలి. అలా ఇచ్చేటట్లు చట్టాలు చేసి ఖచ్చితంగా అమలు చేస్తే వృద్ధుల ఆస్తుల విషయంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు నిజమైన అర్థం కల్పించినట్లు అవుతుంది.

మన్నే విజయ కరుణాకర రావు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.