నీతి అయోగ్యం

ABN , First Publish Date - 2022-08-08T08:12:44+05:30 IST

నీతి ఆయోగ్‌ అసలు రూపాన్ని సీఎం కేసీఆర్‌ బయట పెడితే అది రాజకీయ రంగుపులుముుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

నీతి అయోగ్యం

సీఎం కేసీఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబు ఇవ్వలేదు

బీజేపీకి వంతపాడుతూ ప్రకటన చేయడం బాధ్యతారాహిత్యం

పన్నుల్లో వాటా పెరిగిందనడం శుద్ధ అబద్ధం: మంత్రి హరీశ్‌రావు

తెలంగాణకే మంచిది కాదు‘నీతి ఆయోగ్‌’ బహిష్కరణ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం 

సీఎం కేసీఆర్‌ది దుర్మార్గపు చర్య

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ



సీఎం అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబు లేదు: హరీశ్‌

 హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : నీతి ఆయోగ్‌ అసలు రూపాన్ని సీఎం కేసీఆర్‌ బయట పెడితే అది రాజకీయ రంగుపులుముుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబివ్వని నీతి ఆయోగ్‌.. బీజేపీకి వంతపాడుతూ పత్రికాప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యమని ఆదివారం ఆయన మీడియా సమావేశంలో అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ విలువ దిగజారిందని విమర్శించారు. రూ.3922 కోట్లు జల్‌ జీవన్‌ కింద కేటాయిేస్త రూ.200 కోట్లు మాత్రమే తెలంగాణ వాడుకున్నట్లు నీతి ఆయోగ్‌ చేసిన ప్రకటన పూర్తిగా సత్యదూరమని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణకు నిధులు ఇవ్వాలని పలుమార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులు పోతుంటే సహకార సమాఖ్య స్పూర్తి ఎక్కడ పోయిందని హరీశ్‌రావు ప్రశ్నించారు.

ఎందుకు ఆమోదించరు?
నీతి ఆయోగ్‌ చేసే సిఫారసులను కేంద్రం చెత్త బుట్టలో వేస్తోందని హరీశ్‌ మండిపడ్డారు. మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే  కేంద్రం బుట్ట దాఖలు చేసిందని పేర్కొన్నారు. కాగితాలపై కేటాయింపులు చేస్తున్నారని.. వాస్తవంగా నిధులు మాత్రం ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ‘‘పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా పెంచామంటున్నారు. ఇది పూర్తిగా సత్యదూరం. ఇది మా మాట కాదు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వట్లేదని 15వ ఆర్థిక సంఘం, కాగ్‌.. రెండూ చెప్పాయి. 32 నుండి 42 శాతానికి రాష్ట్రాలకు నిధులు పెంచామని నీతి ఆయోగ్‌ అంటోంది. కానీ కేంద్రం.. సెస్సుల పేరుతో రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకుండా చేస్తోంది. తద్వారా రాష్ట్రాల నోరు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏడేళ్లలో సెస్సుల రూపంలో వసూలు చేసింది రూ.15,47,560 కోట్లు. ఈ ఏడాది రూ.5,35,112 కోట్లు. రెండూ కలిపితే.. మొత్తం రూ.21 లక్షల కోట్లు. 41 శాతం రాష్ట్రాల వాటా అంటే.. దానిప్రకారం రూ.8,60,000 కోట్లు హక్కుగా అన్ని రాష్ట్రాలకూ రావాలి. కానీ సెస్సుల పేరుతో కేంద్రం చేస్తున్న అన్యాయం కారణంగా.. తెలంగాణకు రావాల్సిన రూ.42 వేల కోట్లు రాకుండా పోయాయి. దీని గురించి నీతి ఆయోగ్‌ మాట్లాడదు.

కేంద్రానికి చెప్పకుండా తప్పుదోవ పట్టించే ప్రకటన ఇచ్చింది’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్రం సెస్సుల రూపంలో వసూలు చేస్తున్నందున.. రాష్ట్రాలకు ఆదాయంలో వాటా కేవలం 29.6 శాతమే వస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. పన్నుల్లో వాటా పెంచామనడం శుద్ధ అబద్ధమని నిప్పులు చెరిగారు. ఒకప్పుడు 10 శాతం ఉన్న ేసస్సు ఇప్పుడు 20 శాతానికి పెరిగిందన్నారు. అలాగే.. గతంలో కొన్ని పథకాలకు కేంద్రం 80 నుంచి 90 శాతం ఇచ్చేదని, ఇప్పుడు కేంద్ర వాటా 60 శాతానికి తగ్గించి రాష్ట్రాల మీద భారం వేసిందని హరీశ్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఈ తగ్గుదల వల్ల రాష్ట్రం పై 2018-19లో 2785 కోట్ల మేర ఆర్థిక భారం పడిందన్నారు.

కేంద్రంపై ఒత్తిడి
టీమ్‌ ఇండియా అంటే రాష్ట్రాలకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడాలని హరీశ్‌ అన్నారు. సీఏఎ్‌సఎస్‌ కేటాయింపులు రెట్టింపు అయినట్లు నీతి ఆయోగ్‌ చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి ఈ కేటాయింపుల కింద 2015-16లో రూ.6003 కోట్లు రాగా.. 2021-22లో కేవలం రూ.5223 కోట్లు వచ్చాయన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్‌ కింద రూ.723 కోట్లు వచ్చినట్లు తెలిపారు. పౌష్టికాహార   రంగం కోసం రూ.171 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే.. కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టిందని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 2021-26 మధ్య తెలంగాణకు సెక్టార్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్స్‌ రూ.3024 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే.. కేంద్రం ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిందని మంత్రి మండిపడ్డారు. మిషన్‌ భగీరథ నిర్వహణ కోసం రూ.2350 కోట్లు సెక్టార్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్‌గా ఇవ్వాలని సూచించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.  ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయాలని కేంద్రానికి చెప్పాల్సింది పోయి, కేంద్రం తప్పులను కప్పిపుచ్చే విధంగా నీతి ఆయోగ్‌ ప్రవర్తించడం బాధాకరమన్నారు.  ‘‘స్ర్టాటజీ ఫర్‌ న్యూ ఇండియా 75 పేరుతో 2022 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎన్ని సాధించారో చెప్పగలరా’’ అని హరీశ్‌రావు నిలదీశారు. నీతి ఆయోగ్‌ తాను పెట్టుకున్న లక్ష్యాల్లో వేటినీ సాధించలేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌ దీనికి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లి ఎన్నిసార్లు చెప్పినా అది అరణ్య రోదన అవుతోందే తప్ప పట్టించుకొనే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-08T08:12:44+05:30 IST