బాధితులకు న్యాయం జరగాలి

ABN , First Publish Date - 2022-05-24T05:41:53+05:30 IST

స్పందన కార్యక్రమానికి వెళ్లి అర్జీ సమర్పిస్తే నాకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగే విధంగా అధికారులు పారదర్శకంగా అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు.

బాధితులకు న్యాయం జరగాలి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

స్పందనలో కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి (కలెక్టరేట్‌), మే 23:
స్పందన కార్యక్రమానికి వెళ్లి అర్జీ సమర్పిస్తే నాకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగే విధంగా అధికారులు పారదర్శకంగా అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారం అవుతుందా లేదా అని అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా బాధితులకు న్యాయం చేయాలన్నారు. స్పందన కార్యక్రమానికి వెళితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికీ నమ్మకం కలగాలన్నారు. అర్జీదారుడి సమస్య పరిష్కారం అవుతుందా కాదా పరిష్కారం కాకపోతే ఎందుచేత కాలేదో బాధితులకు పంపాలని ఆయన తెలిపారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్‌ లేకుండా శనివారం లోపల క్లియర్‌ చేయాలన్నారు.

జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి
జిల్లా అభివృద్ధికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. సోమవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో బ్యాంకర్స్‌తో జరిగిన సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకర్లు రూ.9381.09 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. రుణ ప్రణాళికలో వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందులో ముఖ్యంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ వ్యవసాయం, వాణిజ్యం విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు సంబంధించి రూ.7206.34 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం పంట ఉత్పత్తి నిర్వహణ మార్కెటింగ్‌ కోసం రైతులకు 3872.64 కోట్లు, వ్యవసాయానికి టర్మ్‌ లోన్ల కింద రైతులకు రూ.1181.73 కోట్లు, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు సంబంధించి రూ.248.06 కోట్లు ఇవ్వాలని ప్రణాళికలో పేర్కొన్నామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి ఎంటర్‌ప్రైజె్‌సకు రూ.1293.64 కోట్లు, విద్యా రుణాలకు రూ.51.23 కోట్లు, గృహ రుణాలకు రూ.315.26 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కోసం రూ.14.21 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద రూ.11.04 కోట్లు ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి రూ.218.53 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ నాగరాజు, నాబార్డు డీడీయం, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:41:53+05:30 IST