హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ పీకే మిశ్రా

ABN , First Publish Date - 2021-09-18T08:25:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీ్‌సగఢ్‌ తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ పీకే మిశ్రా

కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు

జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ఛత్తీ్‌సగఢ్‌కు

అలహాబాద్‌ నుంచి జస్టిస్‌ రవినాథ్‌ 

పట్నా నుంచి జస్టిస్‌ అమానుల్లా ఏపీకి

తెలంగాణ సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర 

సుప్రీం కొలీజియం సిఫారసు

8 హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు

5 రాష్ట్రాల హైకోర్టు సీజేల బదిలీ

జస్టిస్‌ అకిల్‌ ఖురేషీ రాజస్థాన్‌కు

వివిధ హైకోర్టుల్లోని 28 మంది బదిలీ

చీఫ్‌ జస్టిస్‌ రమణ సారథ్యంలో106కి చేరిన నియామకాలు


న్యూఢిల్లీ/అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీ్‌సగఢ్‌ తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామిని ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీచేయాలని సూచించింది. ఆంధ్ర, తెలంగాణ సహా ఎనిమిది హైకోర్టులకు చీఫ్‌ జస్టి్‌సలను నియమించడంతో పాటు ఐదు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను, వివిధ హైకోర్టుల్లోని 28 మంది న్యాయమూర్తులను బదిలీచేయాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. ఇంత మందికి పదోన్నతి, బదిలీ కూడా చరిత్రేనని న్యాయ వర్గాలు అంటున్నాయి. న్యాయవ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా.. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి జస్టిస్‌ రమణ నేతృత్వంలోని కొలీజియం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మిశ్రాను నియమించడంతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులను.. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాను బదిలీచేయాలని, తెలంగాణ హైకోర్టు సీజేగా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను నియమించాలని సూచించింది.


అలహాబాద్‌, కలకత్తా, కర్ణాటక, మేఘాలయ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టులకు కూడా కొత్త సీజేల పేర్లను సిఫారసు చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావును పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ను త్రిపుర హైకోర్టుకు, బోంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌ను తెలంగాణకు బదిలీచేయాలని సూచించింది. దేశంలోని హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ అకిల్‌ ఖురేషీ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా ఉన్నారు. ఆయన్ను పెద్దదైన రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీచేయాలని కొలీజియం సిఫారసు చేసింది. గురు, శుక్రవారాల్లో మారథాన్‌ భేటీలు జరిపి.. తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కేంద్రం త్వరలోనే ఈ సిఫారసులకు ఆమోదముద్ర వేస్తుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్ర హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోస్వామి ఈ ఏడాది జనవరి 6న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా బదిలీపై వచ్చారు. 8 నెలల్లోనే ఆయన్ను ఛత్తీ్‌సగఢ్‌ సీజేగా బదిలీ చేయాలని సిఫారసు చేయడం గమనార్హం.


జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి..

లఖ్‌నవూకు చెందిన ఈయన 1969 ఫిబ్రవరి 9న జన్మించారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1988లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో 26 ఏళ్లపాటు ప్రాక్టీసు చేశారు. 2019 డిసెంబరు 12న అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2021 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా..

1963 మే 11న జన్మించిన అమానుల్లా.. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1991లో పట్నా హైకోర్టు బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో రాజ్యాంగ, సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు అంశాల్లో నిష్ణాతుడైన న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నారు. బిహార్‌ ప్రభుత్వ న్యాయవాదిగా, వివిధ కేంద్రప్రభుత్వ రంగ సంస్థల స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు. 2011లో పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


106 మంది న్యాయమూర్తుల నియామకం..

దేశంలోని 25 హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఈ ఏడాది మే 1 నాటికి 420 మంది మాత్రమే ఉన్నారు. ఏప్రిల్‌ 24న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా రమణ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 106 మంది న్యాయమూర్తుల నియామకం జరగడం విశేషం. న్యాయవ్యవస్థలో 90ు ఖాళీల భర్తీకి కంకణం కట్టుకున్నామని జస్టిస్‌ రమణ ఇటీవల బార్‌ కౌన్సిల్‌ తనకు జరిపిన సన్మాన కార్యక్రమంలో వెల్లడించారు. ఆయన సారథ్యంలోని కొలీజియం గత నెలరోజులుగా తరచూ సుదీర్ఘంగా సమావేశాలు జరుపుతూ.. పదోన్నతులు, బదిలీలు, కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేస్తోంది. రికార్డు స్థాయిలో గత నెల 17న ఒకేసారి సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేయగా.. కేంద్రం అంతే వేగంగా ఆమో దం తెలిపింది. ఆగస్టు 31న వీరంతా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 4న ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది న్యాయమూర్తుల నియామకానికి పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.  


బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు..

జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి(ఆంధ్ర నుంచి ఛత్తీ్‌సగఢ్‌ కు), జస్టిస్‌ అకిల్‌ ఖురేషీ(త్రిపుర నుంచి రాజస్థాన్‌కు) జస్టిస్‌ మొహ్మద్‌ రఫిక్‌(మధ్యప్రదేశ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు), జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి(రాజస్థాన్‌ నుంచి త్రిపురకు), జస్టిస్‌ విశ్వనాథ్‌  సమద్దర్‌(మేఘాలయ నుంచి సిక్కింకు)


బదిలీ అయిన న్యాయమూర్తులు

జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి(అలహాబాద్‌ నుంచి ఏపీకి); జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా(పట్నా నుంచి ఏపీకి); జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌ (బాంబే నుంచి తెలంగాణకు); జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు(తెలంగాణ నుంచి పంజాబ్‌-హరియాణాకు); జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌(తెలంగాణ నుంచి త్రిపురకు); జస్టిస్‌ సబీనా (రాజస్థాన్‌ నుంచి హిమాచల్‌కు); జస్టిస్‌ ఎ.ఎం.బదర్‌ (కేరళ నుంచి పట్నాకు) తదితరులను బదిలీ చేశారు.


8 హైకోర్టులకు ప్రతిపాదిత కొత్త సీజేలు వీరే..

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ 

మిశ్రా - ఆంధ్రప్రదేశ్‌

జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ - తెలంగాణ

జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ - అలహాబాద్‌

జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ - కలకత్తా

జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి - కర్ణాటక

జస్టిస్‌ రంజిత్‌ వి.మోరే - మేఘాలయ

జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ - గుజరాత్‌

జస్టిస్‌ ఆర్‌వీ మాలిమత్‌ - మధ్యప్రదేశ్‌


ఏజీ నుంచి న్యాయమూర్తిగా.. 

జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా 1964 ఆగస్టు 29న జన్మించారు. ఛత్తీ్‌సగఢ్‌ బిలా్‌సపూర్‌లోని గురు ఘాసీదాస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. బిలా్‌సపూర్‌లోని ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టులో కూడా ప్రాక్టీసు కొనసాగించారు. 2005 జనవరిలో ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు ఆయనకు సీనియర్‌ అడ్వకేట్‌గా గుర్తింపు ఇచ్చింది. ఛత్తీ్‌సగఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు రెండేళ్లు చైర్మన్‌గా పనిచేశారు. ఆ హైకోర్టు నిబంధనల రూపకల్పన కమిటీలో కో-ఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపికయ్యారు. రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీలో సేవలు అందించారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 వరకు ఛత్తీ్‌సగఢ్‌ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ)గా, 2007 సెప్టెంబరు 1 నుంచి అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేశారు. 2009 డిసెంబరు 10న ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌ 1వ తేదీన ఆ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


జస్టిస్‌ ఖురేషీపై వివాదమెందుకు?

తాజా బదిలీల్లో అత్యంత కీలకమైనది ప్రస్తుత త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా ఉన్న జస్టిస్‌ అకిల్‌ ఖురేషీని రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీచేయడం. నిజానికి దేశంలోని హైకోర్టుల సీనియర్‌ న్యాయమూర్తుల్లో ఈయన రెండోవారు. 2004లో గుజరాత్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 14 ఏళ్లు అక్కడే పనిచేశారు. 2018 నవంబరులో ఆ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పదవి ఖాళీ అయింది. సీనియర్‌ అయిన జస్టిస్‌ ఖురేషీ యాక్టింగ్‌ సీజేగా బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. ఆకస్మికంగా బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ ఆయన సీనియారిటీ లిస్టులో ఐదో స్థానంలో నిలిచారు. ఆయన బదిలీని నిరసిస్తూ గుజరాత్‌ హైకోర్టుకు చెందిన 1,200 మంది న్యాయవాదులు సమ్మెకు దిగారు. సుప్రీంకోర్టుకెక్కారు. దీంతో ఆయన్ను పెద్ద హైకోర్టు (మధ్యప్రదేశ్‌)కు బదిలీచేయాలని 2019లో కొలీజియం సిఫారసు చేయగా.. కేంద్రం ఫైలును తిప్పిపంపింది. దీంతో కొలీజియం తన సిఫారసును ఉపసంహరించుకుని త్రిపుర చీఫ్‌ జస్టి్‌సగా పంపింది. ఇక్కడ నలుగురు న్యాయమూర్తులే ఉంటారు. ఆ తర్వాత కొలీజియం ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు తర్జనభర్జన పడింది. సుప్రీంకోర్టుకు ఎవరి పేర్లు సిఫారసు చేసినా.. ముందు జస్టిస్‌ ఖురేషీ పేరే ఉండాలని నాటి కొలీజియం సభ్యుడైన జస్టిస్‌ ఆర్‌ నారీమన్‌ గట్టిగా పట్టుబట్టారు.


ఆయన గత నెల 12న రిటైరయ్యారు. వారం తర్వాత జస్టిస్‌ ఖురేషీ పేరు లేకుండానే 9 మందిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. ఇప్పుడు జస్టిస్‌ ఖురేషీని పెద్ద కోర్టయిన రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీచేయాలని సూచించింది. ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు జస్టిస్‌ ఖురేషీ ఇచ్చిన తీర్పులే ఆయన పదోన్నతికి అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్‌ హోం మంత్రిగా ఉన్న సమయంలో.. 2010లో సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆయన్ను సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించగా.. ఆ తీర్పును జస్టిస్‌ ఖురేషీ కొట్టివేసి.. షాను రెండ్రోజులు సీబీఐ కస్టడీకి పంపారు. 







Updated Date - 2021-09-18T08:25:40+05:30 IST