న్యాయ‘మూర్తిమత్వం’

ABN , First Publish Date - 2021-04-07T05:45:37+05:30 IST

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియుక్తులు కావడం తెలుగువారందరికీ సంతోషకరమైన...

న్యాయ‘మూర్తిమత్వం’

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియుక్తులు కావడం తెలుగువారందరికీ సంతోషకరమైన సందర్భం. 1960 దశకంలో జస్టిస్ కోకా సుబ్బారావు ఈ పదవిని అధిష్ఠించిన మొదటి వ్యక్తి కాగా, ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతరిపబ్లిక్‌లో వెంకటరమణ రెండవవారు. నాలుగు దశాబ్దాలుగా వివిధ న్యాయవేదికల మీద అనుభవం గడించిన జస్టిస్ రమణ నిష్పక్షపాతంగా నిర్భయంగా న్యాయనిర్ణయం చేయగలిగినవారిగా పేరుపొందారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పాలన క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పదహారు నెలల పాటు చీఫ్ జస్టిస్‌గా తన కర్తవ్యాన్ని సమర్థంగా, జనహితంగా నెరవేరుస్తారని వెంకటరమణపై ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. 


కృష్ణాజిల్లాలోని పొన్నవరం అనే గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన జస్టిస్ వెంకటరమణ పాతికేళ్ల వయస్సులో న్యాయవాదవృత్తిని చేపట్టారు. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైనప్పటి నుంచి ఆయన ఆరోహణం వేగం పుంజుకున్నది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే ఈ నెల 23వ తేదీన రిటైర్ కానున్నారు. తన తరువాత సీనియర్ అయిన జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని బాబ్డే చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం నాడు ఆమోదించారు. జస్టిస్ రమణ నియామకాన్ని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అభియోగాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయవ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయపోరాటాన్ని యావత్ దేశం, న్యాయవేత్తల సమాజం తీవ్రంగా తప్పుపట్టింది, ఏవగించుకుంది. 


దేశంలో పరిస్థితులు బాగా లేవు. న్యాయవ్యవస్థ కూడా అన్ని సందర్భాలలోనూ ఆశించిన ప్రతిస్పందనలు ఇవ్వడం లేదు. ప్రభుత్వాల అప్రజాస్వామిక వర్తనకు అండగా నిలవడమో, మౌనాంగీకారం తెలపడమో చేస్తున్నాయన్న అభిప్రాయం కనీసం కొన్ని అంశాల విషయంలోనైనా బలంగా వినిపిస్తున్నది. దానికి తోడు, న్యాయవ్యవస్థ, ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం ఇటీవలి సంవత్సరాలలో వివాదాస్పదంగా మారింది. న్యాయమూర్తుల నియామక విధానం కావచ్చు, కొందరు న్యాయమూర్తులు తమ ఫిర్యాదులను బాహాటంగా వ్యక్తం చేయడం కావచ్చు, ఒక ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కావచ్చు, పదవీ విరమణ జరిగిన వెంటనే ఒక చీఫ్ జస్టిస్‌కు రాజకీయ పదవి లభించడం కావచ్చు- న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, గౌరవానికి తగని పరిణామాలుగా అవి కనిపించాయి. తాము అనుకున్న విధంగా దేశ వ్యవస్థను మార్చడానికి, ప్రత్యర్థులను అణచిపెట్టడానికి వివిధ యంత్రాంగాలను వాడుకుంటున్న ప్రభుత్వాలు, న్యాయస్థానాలపై కూడా రకరకాల ఒత్తిడులు తేవడం సహజం, ప్రలోభపెట్టడమూ సహజం. అన్ని మార్గాలు మూసుకుపోయినా, న్యాయదేవత తమ గోడు వింటుందన్న నమ్మకం ప్రజలలో సడలిపోతే, వ్యవస్థకు నైతిక ఆలంబనే ఉండదు. రాజ్యాంగ నైతికత సుపరిపాలనకు, రాజకీయ లక్ష్యాలకు కొలమానం కాకపోతే, శాంతీ ఉండదు, భద్రతా ఉండదు. విలువల ప్రామాణికతను అనుసరించే నిబద్ధ విశిష్టులు గౌరవస్థానాలలో ఉండాలి. జస్టిస్ వెంకటరమణ ఆ పదవిని అలంకరించడం కొత్త ఆశలను, విశ్వాసాన్ని కలిగిస్తున్నది. 


మద్రాస్ బార్ అసోసియేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, విలువలకు కట్టుబడి ఉండాలని, నిర్ణయాలలో నిర్భయంగా ఉండాలని ఇచ్చిన సందేశం వెంకటరమణ సొంత నిబద్ధతను కూడా సూచిస్తుంది. ఆర్టికల్ 370 నిర్వీర్యం తరువాత, జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను దీర్ఘకాలం నిలిపివేయడంపై జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పు ప్రస్తావించదగినది. టెలికాం వంటి సేవలను అందుబాటులో ఉంచాలన్న తరహాలో మాత్రమే కాకుండా, ఇంటర్నెట్ అందుబాటు అన్నది భావవ్యక్తీకరణ హక్కులో భాగమని, అది ఒక ప్రాథమిక హక్కు అన్న అర్థంలో ఆయన తీర్పు చెప్పారు. అట్లాగే, చీఫ్ జస్టిస్ కార్యాలయం కూడా సమాచారహక్కు పరిధిలోకి వస్తుందని చెప్పిన న్యాయమూర్తుల బృందంలో రమణ కూడా ఉన్నారు. ఫిరాయింపుల సమస్య గురించి జస్టిస్ రమణకు ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపులకు సంబంధించిన ఒక కేసులో ఆయన పదవ షెడ్యూలును మార్చాలని సూచించారు. అట్లాగే, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం తీవ్రంగా జరుగుతున్న ఫిరాయింపుల పర్వం మధ్య ఆయన, సభావేదిక మీద వెంటనే బలపరీక్ష జరగాలని ఆదేశించారు.  


రెండు రోజుల కిందట దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఇచ్చిన ఆన్‌లైన్ సందేశం హక్కుల పరిరక్షణను నొక్కిచెప్పింది. మానవహక్కుల ఉల్లంఘనను ఉపేక్షించవద్దని, మాట్లాడాలనుకున్నది నిర్భయంగా మాట్లాడాలని ఆయన న్యాయవిద్యార్థులకు ఉద్బోధించారు. అంతేకాదు, విద్యార్థులు జాతినిర్మాణంలో పాలుపంచుకునేలా విద్యావ్యవస్థ తీర్చిదిద్దాలని, పోటీల వలయంలో విద్యార్థులు చిక్కుకుపోవడానికి కారణం విద్యావ్యవస్థ వ్యక్తిత్వాన్ని, సామాజిక చైతన్యాన్ని అందించే బాధ్యతనుంచి తప్పుకోవడమే అని ఆయన చెప్పిన మాటలు లోతైనవి, విధానకర్తలు తలకెత్తుకోవలసినవి. ఇటువంటి ఉదాత్త భావాలు కలిగిన మన నూతన ప్రధాన న్యాయమూర్తి, మన దేశ సమ్మిశ్రిత వ్యవస్థకు, మహోన్నతమైన రాజ్యాంగానికి, ప్రగతిశీల పురోగమనానికి హాని కలగకుండా శాయశక్తులా కాపాడతారన్న నమ్మకం కలుగుతోంది.

Updated Date - 2021-04-07T05:45:37+05:30 IST