న్యాయం సకాలంలో అందుబాటులో ఉండాలి : శివరాజ్ సింగ్ చౌహాన్

ABN , First Publish Date - 2021-03-06T20:04:08+05:30 IST

సకాలంలో సత్వర న్యాయం జరిగినపుడే మనసు సంతృప్తి చెందుతుందని

న్యాయం సకాలంలో అందుబాటులో ఉండాలి : శివరాజ్ సింగ్ చౌహాన్

జబల్‌పూర్ : సకాలంలో సత్వర న్యాయం జరిగినపుడే మనసు సంతృప్తి చెందుతుందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సకాలంలో జరిగే న్యాయమే సమర్థనీయమైనదవుతుందని తెలిపారు. సత్వర న్యాయాన్ని ఏవిధంగా అందజేయాలనేదానిపై దృష్టి సారించాలన్నారు. ఆలిండియా స్టేట్ జ్యుడిషియల్ అకాడమీస్ డైరెక్టర్స్ రిట్రీట్ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. 


న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలని, సకాలంలో న్యాయం జరగాలని న్యాయం జరిగితే మనసు సంతోషంగా ఉంటుందని చెప్పారు. న్యాయం వల్ల ఆత్మ సంతృప్తి లభిస్తుందని చెప్పారు. న్యాయం సకాలంలో జరిగితేనే సమర్థనీయమైనదవుతుందన్నారు. సత్వర న్యాయాన్ని ఏవిధంగా అందజేయాలనేదానిపై శ్రద్ధవహించాలని తెలిపారు. న్యాయం తప్పనిసరిగా సకాలంలో లభించేదిగా, భరించగలిగినదిగా, సుగమమైనదిగా ఉండాలని తెలిపారు. 


జాతీయ బ్యాంకులను మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఉదాహరణగా చూపిస్తూ, లండన్ కోర్టు కూడా భారత దేశ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని ధ్రువీకరించిందని చెప్పారు. దేశంలోని సామాన్యులు నమ్మే వ్యవస్థ న్యాయ వ్యవస్థ అని చెప్పారు. కొందరు పరిపాలనా యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని నమ్మకపోవచ్చునని, వాటి ద్వారా తమకు న్యాయం జరగదేమోననే అనుమానం ఉండవచ్చునని, అయితే వారికి న్యాయ వ్యవస్థపై ఎప్పుడూ సందేహాలు రావని చెప్పారు. ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన న్యాయ వ్యవస్థ మన దేశంలో ఉందన్నారు. న్యాయ వ్యవస్థ కార్యకలాపాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని చెప్పారు. 


ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మధ్య ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-06T20:04:08+05:30 IST