జ్యోతి మళ్లీ జిగేల్‌

ABN , First Publish Date - 2022-05-24T09:44:07+05:30 IST

తెలుగు అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజి అలవోకగా జాతీయ రికార్డులను బద్దలు గొడుతోంది.

జ్యోతి మళ్లీ జిగేల్‌

జాతీయ రికార్డు బద్దలుగొట్టిన తెలుగు అథ్లెట్‌

లండన్‌ మీట్‌లో స్వర్ణం కైవసం

న్యూఢిల్లీ: తెలుగు అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజి అలవోకగా జాతీయ రికార్డులను బద్దలు గొడుతోంది. ఇటీవల సైప్రస్‌ అంతర్జాతీయ మీట్‌లో జాతీయ రికార్డును తిరగరాసిన ఈ విశాఖపట్నం అమ్మాయి మరోసారి తన రికార్డును అధిగమించింది. లండన్‌లో ఆదివారం జరిగిన లోబొరో ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌ను 13.11 సెకన్ల రికార్డు సమయంలో  పూర్తి చేసి స్వర్ణం సాధించింది.


జెస్సికా హంటర్‌ (13.26సె) రెండు, అలీసియా బారెట్‌ (13.35సె.) మూడో స్థానంలో నిలిచారు. ఈనెల 10న జరిగిన సైప్రస్‌ పోటీలలో 22 ఏళ్ల  జ్యోతి 13.23 సె.లలో గమ్యం చేరింది. అయితే సైప్రస్‌ మీట్‌కు నెల రోజుల కిందట కోజికోడ్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో జ్యోతి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. కానీ ఆ రోజు గాలివేగం ఎక్కువగా ఉండడంతో ఆమె రికార్డును పరిగణనలోకి తీసుకోలేదు. 2020లోనూ బిస్వాల్‌ రికార్డును తుడిపివేసినా..జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ ఆ మీట్‌లో జ్యోతికి పరీక్షలు నిర్వహంచని కారణంగా అది కూడా రికార్డుగా నమోదు కాలేదు. 

Updated Date - 2022-05-24T09:44:07+05:30 IST