Scindia on Mann deplaning: సీఎం దించివేతపై కేంద్రం విచారణ!

ABN , First Publish Date - 2022-09-20T23:02:34+05:30 IST

న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కిన పంజాబ్‌

Scindia on Mann deplaning: సీఎం దించివేతపై కేంద్రం విచారణ!

న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌‌ను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది విమానం నుంచి దించివేశారని వస్తోన్న కథనాలపై కేంద్రం స్పందించింది. ఘటన తాలూకు వాస్తవాలను పరిశీలిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఘటనపై విచారణ జరపాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు సింధియాను డిమాండ్ చేయడంతో విచారణ చేయిస్తామని చెప్పారు. ఘటన విదేశీ గడ్డపై జరిగిందని తెలుస్తున్నందున పూర్తి వివరాలు అందించాలని ఆయన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌‌ను కోరారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌‌ వివరాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.




ఈ నెల 11 నుంచి 18 వరకూ పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ జర్మనీలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ వ్యాపారవేత్తలను కోరే లక్ష్యంతో ఆయన జర్మనీ వెళ్లారు. అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రోజు కాకుండా ఒక రోజు ఆలస్యంగా భారత్ వచ్చారు. మాన్ ఆలస్యానికి అసలు కారణం ఫుల్లుగా మద్యం తాగి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కడమేనని, తనను తాను అదుపుచేసుకోలేకపోతోన్న మాన్‌ను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది విమానం నుంచి దించివేశారంటూ శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మాన్ కారణంగా విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని, దీనివల్ల ఆప్ జాతీయ సదస్సుకు కూడా మాన్ హాజరు కాలేకపోయారని సుఖ్‌బీర్ ఆరోపించారు. మాన్‌ నిర్వాకం వల్ల ప్రపంచం ముందు పంజాబ్‌ పరువు పోయిందని సుఖ్‌బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.




సుఖ్‌బీర్‌ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడింది. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షనేత ప్రతాప్ సింగ్ బాజ్వా కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు. వెంటనే మాన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. 




అయితే తమ పార్టీని, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. గుజరాత్ ఎన్నికల వేళ వస్తోన్న ఈ కథనాలతో ఆమ్ ఆద్మీ పార్టీ అప్రమత్తమైంది.  





మరోవైపు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ఈ అంశంపై వివరణ ఇచ్చింది. విమానం ఆలస్యమైన మాట నిజమేనని, అనుబంధ విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. ప్రయాణికుల వ్యక్తిగత డేటాను పంచుకోలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో స్వయంగా కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదేశించడంతో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ పూర్తి వివరాలు అందించే అవకాశాలున్నాయి. అసలు జరిగిందేంటో ఆ తర్వాతే తెలుస్తుంది. 

Updated Date - 2022-09-20T23:02:34+05:30 IST