నన్ను టార్చర్‌ పెట్టినోళ్లని దేవుడు శిక్షిస్తాడు

Published: Wed, 13 May 2020 15:08:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నన్ను టార్చర్‌ పెట్టినోళ్లని దేవుడు శిక్షిస్తాడు

వైఎస్‌ నన్ను 20 కోట్లు అడిగారు..

ఇవ్వనందుకే టార్చర్‌ పెట్టారు.. చివరకు శిక్షించబడ్డారు

జగన్ మారకుంటే ఆయనకే నష్టం

నాకు ఒక్కో ప్రసంగానికి 20 కోట్లు చెల్లిస్తారు

నేను మత బోధకుడిని కాదు.. శాంతిదూతనే

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్‌


విశాఖ జిల్లాలో పుట్టిన ఆయన.. ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాధినేతలు తన అభిమానులని ఆయన చెబుతుంటారు. ఆయనే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేఏ పాల్‌. రాష్ట్రంలో ఓ రాజకీయ నేతతో వైరం కారణంగా.. ఎన్నో కష్టాలు అనుభవించిన పాల్‌ ఇప్పుడు మళ్లీ రంగంలోకి వస్తానని , తన ప్రతాపం చూపిస్తానని చెబుతున్నారు. ఆయనతో 09-04-2012న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన హార్ట్‌ విత ఆర్కే’ కార్యక్రమం విశేషాలు.


ఆర్కే: మీ అసలు పేరు?

కేఏ పాల్‌: నా అసలు పేరు కిలారి ఆనంద్‌. ప్రభువును నమ్ముకున్న తర్వాత కేఏ పాల్‌గా మారాను. హిందూ మతంలోనే పెద్దకాపు కులంలో పుట్టాను. సొంతూరు విశాఖ జిల్లా చిట్టివలస.


ఆర్కే: మతం మారడానికి కారణం?

కేఏ పాల్‌: మా నాన్నగారికి మానసిక సమస్య వచ్చింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా తగ్గలేదు. ఓ ప్రబోధకుడి సలహాతో చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అంతే, మూడో రోజే సమస్య పూర్తిగా తగ్గిపోయింది.


ఆర్కే: వైద్యశాస్త్రం చేయలేని పనిని, మతాలు చేయగలవా?

కేఏ పాల్‌: నేను మతాన్ని ప్రమోట్‌ చేయను. కేవలం శాంతిని మాత్రమే ప్రచారం చేస్తా. అందుకే ఇరాన తదితర దేశాల ముస్లిం నేతలు, కేథలిక్‌లు, జగద్గురు పీఠాధిపతి సహా ఎంతో మంది హిందూ నేతలు కూడా నాకు దగ్గరి స్నేహితులు. ‘డివైన హీలింగ్‌’ అనేది వంద శాతం నిజమనేది నా అభిప్రాయం.


ఆర్కే: మీరు ఏం చదువుకున్నారు?

కేఏ పాల్‌: చిట్టివలసలో చదువుకున్నప్పుడు పదోతరగతి రెండుసార్లు తప్పాను. తర్వాత నర్సీపట్నంలో ఇంటర్‌. అనంతరం డిగ్రీ చేశాను. ఆరేళ్ల వయస్సు నుంచి 16 ఏళ్ల వయస్సు దాకా బాల కార్మికుడిగా బొగ్గులేరుకున్నా.. నా మొత్తం చరిత్రలో ‘విశ్వవిజేత’ అనే సినిమా తీస్తున్నా. అందులో నేను బొగ్గులేరుకున్నప్పటి నుంచి ఇప్పటివరకూ నన్ను దేవుడు ఎలా దీవించి, ఆశీర్వదించాడనే వరకూ కనిపిస్తుంది.


ఆర్కే: కటిక పేదరికం అనుభవించారు కదా?

కేఏ పాల్‌: రైలు పట్టాల వెంట తిరిగి బొగ్గులేరుకున్నా. 15 పైసలతో 38రోజులు గడిపా. అందుకే నా దగ్గర ఉన్న డబ్బంతా పంచిపెడుతుంటా. 22 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను పంచిపెట్టాం. కాలేజీలో చదువుతున్నప్పుడు నక్సలైట్ల సిద్ధాంతాలు నచ్చి కొంతకాలం ఆ దారిలో నడిచాను.


ఆర్కే: మీ బోయింగ్‌ 747 విమానం సంగతేంటి? మూలకు పడినట్లేనా?

కేఏ పాల్‌: అది బహుమతిగా ఇచ్చిన విమానం. దానికి ఇంధనం దగ్గరి నుంచి ఫైలట్‌దాకా అన్నీ ఉచితంగానే సమకూరాయి. అమెరికన అధ్యక్షుడు, నేను మాత్రమే బోయింగ్‌ 747లో తిరుగుతాం. ప్రస్తుతానికి పక్కన పడింది. మళ్లీ వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా.

నన్ను టార్చర్‌ పెట్టినోళ్లని దేవుడు శిక్షిస్తాడు

ఆర్కే: మరి మీకే మనశ్శాంతి లేని పరిస్థితులు వచ్చాయి కదా?

కేఏ పాల్‌: ఏకంగా యేసు ప్రభువే శారీరకంగా, మానసికంగా హింసలు అనుభవించారు. ఆయనకే తప్పనప్పుడు కేఏ పాల్‌ ఎంత! ఆనాటి ప్రభుత్వం పీస్‌ మిషనను ఆపేసి టార్చర్‌ చేసింది. రాష్ట్రంలోని, దేశంలోని అకౌంట్లన్నింటినీ మూసేశారు. లేనిపోని కేసులు పెట్టి, 50 వేల కోట్ల నిధుల నష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఎంతో ఉంది.


ఆర్కే: విదేశాల నుంచి భారీగా విరాళాలు ఎలా సేకరిస్తున్నారు?

కేఏ పాల్‌: 148 దేశాల్లో సభలు పెట్టాను. ఎక్కడా రూపాయి చందా తీసుకోలేదు. నేను ప్రపంచంలో అత్యంత ఎక్కువ డబ్బు చెల్లించే ప్రసంగకర్తను. ఒక్కో సభకు దాదాపు 20 కోట్ల వరకూ ఇస్తారు. బిలియనీర్లను నేను బ్లెస్సింగ్స్‌ ఇచ్చి, సరైన మార్గంలో నడిపిస్తా. వారు నేను చెప్పిన ఛారిటీలకు భారీగా విరాళాలిస్తారు. అదంతా సంస్థకే. నేను జీతంగా తీసుకునేది కేవలం 2 వేల డాలర్లు (దాదాపు రూ. లక్ష). ఇప్పటికీ అతితక్కువ విలువున్న ఓ చిన్న ఇంట్లో ఉంటున్నా.


ఆర్కే: బ్రదర్‌ అనిల్‌ కన్నా మీరు గొప్ప ఉపన్యాసకులా?

కేఏ పాల్‌: ఆయన స్పీచ్‌ను నేను లైఫ్‌లో ఎప్పుడూ వినలేదు. అతన్ని నాకు మంచి శిష్యుడిగా భావించా. కానీ, పీస్‌ మిషన్‌ను మూసేయించడంలో ఆయన పాత్ర ఉంది. అప్పుడా గొడవకు అనిలే కారణమని ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, ఆజాద్‌, సుశీల్‌ కుమార్‌ తదితరులంతా చెప్పారు కూడా. అయినా.. నేనెప్పుడూ గొప్ప ఉపన్యాసకుడినని చెప్పలేదు. నేను మత బోధకుడిని కాదు. శాంతి దూతగానే చెప్పుకొంటా.


ఆర్కే: మరి వివాదం ఎక్కడొచ్చింది?

కేఏ పాల్‌: 2003లో వైఎస్‌ వాళ్లు నన్ను 20 కోట్లు అడిగారు. అమెరికన కార్పొరేట్‌ సంస్థల అధినేతలతో మీటింగ్‌ పెడతా.. వాళ్లు మీకు ఇస్తారు రండి అని పిలిచా. ఈ విషయాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కేవీపీ, బొత్స సత్యనారాయణ, మా అన్నయ్య అందరూ ఉన్నప్పుడు చెప్పా. అప్పుడు వైఎస్‌ రాకుండా బొత్సను పంపిస్తానన్నారు. దాంతో సమావేశం జరగలేదు. ఆ డబ్బు రాలేదు. ఆ కక్షతోనే తర్వాత నా మీద వైరానికి దిగారు. ‘పీస్‌ మిషన్’ను అపారు. 75 వేల మంది పాస్టర్లతో లక్షల మందికి లేఖలు రాయించి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలవడానికి సాయం చేశాం.


ఆర్కే: చంద్రబాబుతో సాన్నిహిత్యం?

కేఏ పాల్‌: మొదట సన్నిహితులమే. వైఎస్‌ నా ‘పీస్‌ మిషన్’ ఆపేసినప్పుడు.. నాకు చంద్రబాబు మద్దతివ్వలేదు. కనీస బాధ్యత ఉన్న నాయకులెవరూ దాని గురించి అసెంబ్లీలో ప్రస్తావించలేదు. అప్పుడు నాకు రాజకీయాలంటే ఏమిటో అర్థమైంది. అధికారంలో ఉన్నవాళ్లు విచ్చలవిడిగా ప్రవర్తించారు.


ఆర్కే: ఎక్కువగా రాష్ట్రంలోనే ఉంటున్నారు

కేఏ పాల్‌: రాష్ట్ర పరిస్థితి బాగోలేదు. అవినీతి రాజ్యమేలుతోంది. ఇది ఇలాగే కొనసాగితే అంతా నాశనమైపోతుంది. అందుకే రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఉంటా. ఉప ఎన్నికల్లో పోటీపై మే మొదటివారంలో నిర్ణయిస్తాం. ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడతాం. నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం చేస్తాం. అధికారంలోకి వస్తే ఐదేళ్లలోగా బడ్జెట్‌ను రెండింతలు చేస్తా.


ఆర్కే: మీరు చెప్పింది జరుగుతుందా?

కేఏ పాల్‌: వైఎస్‌ దిగిపోయి.. రోశయ్య ముఖ్యమంత్రి అవుతారని చెప్పా. నిజమైంది. అప్పటి ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను, ఉప ఎన్నికల్లో ఫలితాలను ముందే చెప్పా. అప్పుడప్పుడూ దేవుడలా చెప్పిస్తాడు. నాకు ద్రోహం చేసిన వారందరూ మరిణించారు. క్షమాపణ చెప్పినవారు విడిచిపెట్టబడ్డారు.


ఆర్కే: మిమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చిన వైఎస్‌ కొడుకు సీఎం అవుతాడా?

కేఏ పాల్‌: రాజశేఖరరెడ్డి ఎప్పుడూ నాకు శత్రువు కాదు.. జగన కూడా నాకు శత్రువు కాదు. ఆయన మారు మనసు పొందాలని కోరుకుంటున్నా.. లేకపోతే శిక్ష అనుభవించక తప్పదు. కాంగ్రెస్‌, టీడీపీలు పూర్తిగా కుదేలైపోయాయి. దాంతోపాటు సానుభూతితో వచ్చే ఉప ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ గెలుపొందొచ్చు. అయినా, జగనకు క్రైస్తవుల ఓట్లు పడే అవకాశం లేదు. వారంతా జగన్ అవినీతిని ఎండగడుతున్నారు.


ఆర్కే: మీకు అన్యాయం చేసినవాళ్లని దేవుడు శిక్షిస్తాడంటారు?

కేఏ పాల్‌: అవును వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం అలాంటిదే. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన మాకు ఘోరమైన నష్టాలు చేశారు. ఆ సమయంలో బైబిల్‌ ప్రకారం నేను హెచ్చరించాను కూడా. ‘పీస్‌మిషన్’ను మూయించిన ఏడుగురూ శిక్ష అనుభవించారు. ఇప్పుడు కూడా ఒకరు? వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలుస్తోంది. అది నిజమైతే ఆయనకూ శిక్ష తప్పదు. అందుకే మారు మనస్సు పొందాలని కోరుతున్నా.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.