ఉక్కు నిర్వాసితుల భూములు హాంఫట్‌!

ABN , First Publish Date - 2022-05-28T07:09:03+05:30 IST

ఉక్కు నిర్వాసితుల భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి.

ఉక్కు నిర్వాసితుల భూములు హాంఫట్‌!
ఉక్కు నిర్వాసిత కాలనీ

కాలనీల్లో భారీగా ఆక్రమణలు

వడ్లపూడిలో ఒకే కుటుంబానికి పలు ప్లాట్లు

అప్పికొండలో రద్దు చేసిన ప్లాట్‌లో పక్కా భవన నిర్మాణం 

ఆక్రమణదారులకు ఉక్కు భూ సేకరణ అధికారుల వత్తాసు

ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా విచారణలే తప్ప చర్యల్లేవు


 (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉక్కు నిర్వాసితుల భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. తవ్వుతున్న కొద్దీ ఇక్కడి ఆక్రమణల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, విచారణతో సరిపెట్టేస్తున్న అధికారులు చర్యల జోలికి పోవడం లేదు. దీంతో తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది ఆక్రమణలకు తెగబడుతుండగా, వారికి సహకరిస్తూ మరికొందరు అధికారులు జేబులు నింపుకుంటున్నారు.  

నిర్వాసిత కాలనీ పరిధిలోని వడ్లపూడి కాపువీధిలో తప్పుడు ధ్రువపత్రాలతో పొందిన ప్లాట్లను తాజాగా జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. వెంటనే వాటిని జీవీఎంసీ స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు జారీచేసింది. అయినా జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు రద్దు చేసిన వాటిలోని ఒక ప్లాట్‌లో భవన నిర్మాణానికి ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చేశారు. దీనిపై స్థానికులు కలెక్టర్‌, ఉక్కు భూసేకరణ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు జీవీఎంసీకి సమాచారం ఇచ్చారు. దీంతో భవన యజమానికి నోటీస్‌ జారీచేయగా ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కాగా ప్లాన్‌ అనుమతులు ఇచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం నుంచి వచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే వాదన వినిపిస్తోంది. కాగా ఇదే ప్రాంతంలో మిగిలిన రెండు ప్లాట్లు ఇతరులకు అమ్మేశారు. త్వరలో అక్కడ నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నారని  ఫిర్యాదులు అందాయి. 


ఒకే కుటుంబం ఆక్రమణలో...

వడ్లపూడిలో ఒకే కుటుంబానికి చెందిన వారికి ఆరు నుంచి పది ప్లాట్లు ఉన్నాయనే విషయం ఉక్కు భూసేకరణ కార్యాలయంలోని అధికారులకు తెలుసు. భూ సేకరణ ప్రత్యేక ఉపకలెక్టర్‌గా సుభాష్‌చంద్రబోస్‌ పనిచేస్తున్న కాలంలో ఇలా ఒకే కుటుంబం ఆక్రమణలో ఉన్న ప్లాట్లను రద్దు చేసి, జీవీఎంసీకి అప్పగించారు. అప్పట్లో అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. తరువాత ఏమైందోగానీ...సదరు కుటుంబం ఒక్కొక్క ప్లాటును మళ్లీ స్వాధీనం చేసుకుని, భవన నిర్మాణాలు పూర్తిచేసింది. 


ప్లాట్ల పరిరక్షణలో నిర్లక్ష్యం

గాజువాక పరిసరాల్లో కాలనీలు ఏర్పాటుచేసిన జిల్లా యంత్రాంగం అక్కడ ఉక్కు నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించింది. ఆయా కాలనీల్లో మిగిలిన ప్లాట్లను పరిరక్షించడంలో నాలుగు దశాబ్దాలుగా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు ఈ అక్రమ వ్యవహారాల్లో విశాఖ ఉక్కు భూసేకరణ కార్యాలయంలో పనిచేసిన కొందరు ప్రత్యేక ఉపకలెక్టర్లు, ఇతర అఽధికారులు, సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడ్డారు. నిర్వాసితుల పేరిట కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి, ఉక్కు భూ సేకరణ కార్యాలయం అధికారులతో మిలాఖత్‌ అయి ప్లాట్లు దక్కించుకున్నారు. ఇలా అగనంపూడి, వడ్లపూడి, దువ్వాడ నిర్వాసిత కాలనీల్లో సుమారు 528 ప్లాట్లు ఆక్రమణలకు గురైనట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. వాటిని జీవీఎంసీకి అప్పగించినా, ఇంతవరకు రక్షణ చర్యలు చేపట్టలేదు. 


మామూళ్ల మత్తులో అనుమతులు 

ఆక్రమణదారులతో జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు మిలాఖత్‌ కావడంతో ప్లాట్ల కేటాయింపు, ప్లాన్‌ అనుమతులు మంజూరైపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో  నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారీ విచారణకు ఆదేశించి, ప్లాట్ల కేటాయింపు రద్దుచేయడం మినహా, వాటిని కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విచిత్రమేమిటంటే ఒక ఉప కలెక్టర్‌ ప్లాట్లు కేటాయిస్తుండగా, మరో ఉపకలెక్టర్‌ వాటిని రద్దు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేటాయింపులు రద్దు చేసే ముందు విచారణతో ముగించడమే తప్ప సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో పలువురు ఉప కలెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఆక్రమణలకు గురైన వ్యవహారంలో తప్పుడు ధ్రువపత్రాలు దాఖలు చేసిన వ్యక్తులు, సంబంధిత అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటేనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని నిర్వాసితులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-28T07:09:03+05:30 IST