
అమరావతి: ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కొంత వ్యతిరేకత ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. అంత మాత్రాన ఆ వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. బుధవారం పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయంలోనూ అదే జరిగిందని గుర్తుచేశారు. ఏ విషయంపైనైనా ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలకు 30 రోజులు గడువు ఇచ్చారని, గడువు ఇచ్చారు కాబట్టే అక్కడ గొడవలు చెలరేగాయని తెలిపారు. గొడవలు అవుతాయని ప్రభుత్వానికి తెలుసు కాబట్టే గడువు పెట్టారని చెప్పారు. ‘‘వైసీపీ ఎమ్మెల్సీ ఘటన సమయంలోనే కోనసీమ అల్లర్లు ఎందుకు చెలరేగాయి?.. కోనసీమకే అంబేద్కర్ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది?.. కడప జిల్లా (Kadapa district)కు అంబేద్కర్ (Ambedkar) పేరు పెట్టాలని ఎందుకు అనిపించలేదు?.. కడప జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు ఎందుకు పెట్టలేదు?’’ అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏనాడు తప్పులను ఒప్పుకోలేదన్నారు. ఆడబిడ్డ అఘాయిత్యానికి గురై న్యాయం కావాలంటే... సాక్షాత్తు హోంమంత్రి చులకనగా మాట్లాడారని విమర్శించారు. తల్లి పెంపకంలో లోపమే అందుకు కారణమనడం ఎంతవరకు సబబు అని పవన్‌కల్యాణ్ విమర్శించారు
ఇవి కూడా చదవండి