బ్లాక్‌ ఫంగ్‌సతో కడప జిల్లావాసి మృతి

ABN , First Publish Date - 2021-06-17T07:17:09+05:30 IST

కడప జిల్లా కుప్పంతండాకు చెందిన ఎం.ఆంజనేయులు నాయక్‌(38) బ్లాక్‌ ఫంగస్‌తో బుధవారం మృతి చెందాడు.

బ్లాక్‌ ఫంగ్‌సతో కడప జిల్లావాసి మృతి
మృతుడు ఆంజనేయులు(పాతచిత్రం) - ఆస్పత్రి ముందు రోదిస్తున్న కుటుంబ సభ్యులు - బుజ్జమ్మ

సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ

స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రం ఎదుట నిరసన


తిరుపతి సిటీ, జూన్‌ 16: కడప జిల్లా కుప్పంతండాకు చెందిన ఎం.ఆంజనేయులు నాయక్‌(38) బ్లాక్‌ ఫంగస్‌తో బుధవారం మృతి చెందాడు.నెల రోజుల కిందట కొవిడ్‌ బారిన పడ్డ ఆంజనేయులును తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడడంతో మే 28న స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో చేర్పించారు.అప్పటినుంచి అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ‘ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని సూది మందులు కూడా వేయడం లేదని వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలని’  మొరపెట్టుకునే వాడని ఆయన భార్య నిర్మల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ విషయంపై సిబ్బందిని అడిగినా సరైన సమాధానం చెప్పేవారు కాదని ఆమె వాపోయింది. రెండు రోజుల క్రితం సిబ్బంది వచ్చి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉందని శస్త్ర చికిత్స చేయాలని లేకపోతే ప్రమాదం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పారని ఆమె తెలిపారు. న్యూరో సర్జన్స్‌ అందుబాటులో లేకపోవడంతో వారు వచ్చిన వెంటనే ఆపరేషన్‌ చేస్తారని నమ్మించిన సిబ్బంది చివరకు బుధవారం తెల్లవారుజామున తన భర్త మృతిచెందినట్లు  సమాచారం ఇచ్చారన్నారు.సకాలంలో సరైన వైద్యం అందించివుంటే తన భర్త మృతి చెందేవాడు కాదంటూ నిర్మల కుటుంబ సభ్యులతో కలిసి స్విమ్స్‌ ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు వైద్యులు, వైద్య సిబ్బందే పూర్తి బాధ్యులని ఆమె ఆరోపించారు.సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వార్డులో అనేకమంది మృతి చెందుతున్నారని.... ఇక్కడే ఉంటే తనను కూడా చంపేస్తారని.. వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్లండని తన భర్త వేడుకునే వాడని అప్పుడే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఉంటే ప్రాణాలు దక్కేవంటూ మృతుడి భార్య ఆసుపత్రి ముందు చేసిన రోదన చూపరులను కంటతడి పెట్టించింది.

 

సిబ్బంది నిర్లక్ష్యంతోనే నా తమ్ముడు చనిపోయాడు

కొవిడ్‌ కేంద్రంలో సిబ్బంది బాధితుల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.నా తమ్ముడు లోపల విషయాలను ఎప్పటికప్పుడు ఫోన్‌లో చెప్పేవాడు. ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వస్తాననే నమ్మకం లేదని ఏడ్చేవాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా పట్టించుకున్న వారు లేరు. కనీసం డిశ్చార్జి అయినా చేయండి....బయట చూపించుకుంటామని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు.ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నా తమ్ముడు మృతిచెందాడు.

- బుజ్జమ్మ, మృతుడి అక్క

Updated Date - 2021-06-17T07:17:09+05:30 IST