ఖాళీ జాగా.. కనిపిస్తే పాగా...

ABN , First Publish Date - 2020-08-09T10:31:23+05:30 IST

కడప నగరంపైకడప నగరంపై భూ మాఫియా కన్ను పడింది. ఈ మాఫియా టీమ్‌లుగా విడిపోయి ఎక్కడ ప్రభుత్వ భూములు, బలహీనులకు చెందిన ఖాళీ స్థలాలున్నాయో గుర్తించి పాగా వేస్తోంది.

ఖాళీ జాగా.. కనిపిస్తే పాగా...

 నగర శివార్లలో ఆక్రమణల పర్వం

 రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం

 భూమాఫియాకు సహకరిస్తున్న రెవెన్యూ


కడప నగరంపైకడప నగరంపై భూ మాఫియా కన్ను పడింది. ఈ మాఫియా టీమ్‌లుగా విడిపోయి ఎక్కడ ప్రభుత్వ భూములు, బలహీనులకు చెందిన ఖాళీ స్థలాలున్నాయో గుర్తించి పాగా వేస్తోంది. నగరంలో నాలుగు ముఠాలు ఈ ఖాళీ స్థలాల అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మాఫియా ముఠాల వెనుక పేరొందిన పొలిటికల్‌ లీడర్లు ఉండి ఈ తతంగం నడిపిస్తుండడం గమనార్హం. రెవెన్యూ కార్యాలయాల్లో ఉండాల్సిన రికార్డులు ఈ మాఫియా వద్ద ఉన్నట్లు చెబుతారు. బస్సులో సీటు కోసం కర్చీఫ్‌ వేసినట్లుగా.. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు.. గద్దల్లా వాలి ఆక్రమించేస్తున్నారు. 


(కడప - ఆంధ్రజ్యోతి):రెవెన్యూ, భూఅక్రమార్కుల కుమ్మక్కుతో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కరిగిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని ముఠాలు నగర శివారు పరిధిలో ఉన్న ప్రభుత్వ బంజరు భూములు, వాగులు, వంకలు, రైల్వేకు చెందిన ఆస్తులపై కన్నేసి కాజేసే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీకేదిన్నె మండలంలోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలం, కడప మండల పరిఽధిలోని చిన్నచౌకు రెవెన్యూ పొలంలోని ఖాళీ స్థలాలపై కన్నేసి ఆక్రమించే యత్నాల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. విలువైన స్థలాలు కావడంతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై న్యాయస్థానాల్లో అడ్డంకులు లేకుండా చూసుకుంటారని అంటున్నారు.


విలువైన స్థలాలపై కన్ను

సీకేదిన్నె మండలంలోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలంలో విలువైన ఆస్తులు ఉన్నాయి. కడప సమీపంలో రిమ్స్‌, మామిళ్లపల్లె.. రాయచోటి రింగు రోడ్డు, కలెక్టరేట్‌ నుంచి రిమ్స్‌ వెళ్లే దారిలో ఎస్టేట్‌ దాటిన తరువాత కుడి పక్క విలువైన భూములు ఉన్నాయి. సర్వే నెంబరు 505. 505-సి, 506-ఎ, 507-బి, 509 2ఎ, 616/6, 604, 638, 641, 702, 700/6, 700/3 ఇంకా మరికొన్ని సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములున్నట్లు మీసేవ పోర్టల్‌లో చూపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు కొన్ని సర్వే నెంబర్లలో చుక్కల భూములున్నట్లు చెప్పుకొస్తున్నారు.


భూముల డిమాండ్‌తో ఎసరు

నూతన కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణం తరువాత ప్రకాశ్‌నగర్‌, రిమ్స్‌ వెళ్లే రహదారి వరకు స్థలాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కలెక్టరేట్‌లోని అధికారులంతా చుట్టుపక్కల నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఆ ప్రాంతంలో కొత్త కొత్త భవనాలు, అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. రహదారి పక్కనే సెంటు రూ.20 లక్షల పైమాటే పలుకుతుంది. దీంతో అక్కడ సెంటు స్థలం ఉన్నా లక్షాధికారే అన్న పరిస్థితి వచ్చింది. రిమ్స్‌ వెళ్లే దారిలో అపార్ట్‌మెంటు ఉండడం, దాని ఎదురుగానే కొత్తగా వెంచర్‌ వేస్తుండడంతో వైసీపీ కార్యాలయం కూడా అక్కడే నిర్మాణం జరుగుతుందనే ప్రచారం ఉంది. దీంతో అక్కడ నివాస స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. నగరంలో పేరున్న వ్యక్తులే వెంచర్లు వేస్తున్నట్లు చెబుతుండడంతో అక్కడ స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్నే అదునుగా భావించిన కొంతమంది ముఠా అక్కడున్న ఓ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించే యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములైనప్పటికీ తాతల నుంచీ వారసత్వం వచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. కొన్ని రిజిస్ట్రేషన్ల వరకూ పోతుండడంతో ఒరిజినల్‌ భూములనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న సర్వే నెంబరు 604, 18, 38 తదితర నెంబర్ల పరిధిలో సెంటు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పైమాటే ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సరాసరిన ఎకరా రూ.7 కోట్లు పైనే ఉంటుందని అంటున్నారు. ఆ ప్రాంతంలో 50 ఎకరాల పైన ప్రభుత్వ భూములు ఉంటే చాలా మటుకు ఆక్రమణకు గురైనట్లు చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ తతంగం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీకేదిన్నె తహసీల్దారు మహేశ్వర్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. మామిళ్లపల్లె సర్వే నెంబరు 604లో ఉన్న 2.40 ఎకరాల భూమి ఆక్రమణలపై వివరణ కోరగా రెవెన్యూ రికార్డుల్లో డాట్‌ ల్యాండ్‌గా ఉందన్నారు.

Updated Date - 2020-08-09T10:31:23+05:30 IST