ఇవేమి బ్రాండ్లు రా... స్వామీ

ABN , First Publish Date - 2020-10-27T08:07:00+05:30 IST

ఇవేమి బ్రాండ్లు రా... స్వామీ

ఇవేమి బ్రాండ్లు రా... స్వామీ

 గుర్తుకు రాని.. గుర్తుంచుకోలేని మద్యం సీసాల అమ్మకాలు

 కిక్కు కోసం ఆగ్రహం అణుచుకుంటున్న మద్యంప్రియులు

 డబ్బును బట్టి 

మద్యం కొనుగోలు చేస్తున్న వైనం


ఎంచక్కా.. బ్రాంది షాపుకు వెళ్లి తనకు కావాల్సిన బ్రాండ్‌ను దర్జాగా కొనుగోలు చేసేవారు మద్యంప్రియులు.. అదంతా గతం. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో గుర్తుకు రాని, అసలు గుర్తుంచుకోలేని మద్యంబ్రాండ్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉన్న బ్రాండ్‌ రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఏ షాపులో ఎప్పుడు ఏ సరుకు ఉంటుందో తెలియని పరిస్థితి. దీంతో తన వద్ద ఉన్న డబ్బుకు సరిపడా మద్యం సీసా ఉందా, లేదా? అని తెలుసుకుని ఏ బ్రాండ్‌ అయినా తీసుకుపోవడం విశేషం. ఏదోకటి సరేలే.. అని సర్దుకుపోతున్న మద్యం ప్రియులను కొన్ని దుకాణాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది చీదరించుకుంటూ చిన్నచూపు చూడడం గమనార్హం.


కడప (సిటి), అక్టోబరు 26: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగం గా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఆర్థిక సంవత్సరంలో 20శాతం, అనంతరం లాక్‌డౌన్‌ సడలింపుల నేపధ్యంలో మరో 13శా తం దుకాణాలను తగ్గించా రు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా గత బ్రాండ్ల మద్యం అందని ద్రాక్షలా తయారైంది. ఎప్పు డూ వినని పేర్లతో ఉన్న మద్యంసీసాలు కనబడుతున్నాయి. పాత బ్రాండ్ల మద్యం దొరకడం అటుంచి కనిపించడం కూడా గగనంగా మారింది. మద్యం బలహీనతే ఆయుధంగా చేసుకుని తెలియని బ్రాండ్‌ను అధిక ధరలకు విక్రయించడంపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఉన్న డబ్బు చెప్పి సీసాల కొనుగోళ్లు

జిల్లాలో ప్రస్తుతం 173 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో ఏ దుకాణంలో చూసినా పాత బ్రాండ్ల మద్యం రెండు, మూడుకు మించి కనిపించడం లేదు. అవి కూడా భారీ ధరలు ఉండే బ్రాండ్లే. వాటిని సాధార ణ రోజుల్లో సైతం సాధారణ, మధ్యతరగతి మద్యంప్రియులు కొనుగోలు చేసేవారు కాదు. మిగతావన్నీ దాదా పు కొత్త బ్రాండ్లే. సూపర్‌ బ్లెండ్‌, సిల్వర్‌స్టార్‌, మల్బర్‌హౌస్‌, దారుహౌస్‌, 8 పీఎం ఇలా కొన్నీ.. చీఫ్‌లో అయితే మరిన్ని రకాల పేర్లతో సీసాలు ఉంటున్నాయి. వీటి పేర్లను గుర్తుంచుకోలేక పాపం మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి రూ.150, 180, 190, 200గా విక్రయిస్తున్నారు. దీంతో తన వద్ద ఉన్న డబ్బుకు సరిపడా సీసా కోసం వెదుక్కుంటూ కొనుగోలు చేయడం మద్యంప్రియుడి కనీస బాధ్యతగా మారింది. ఆ డబ్బు కు వచ్చే బాటిల్‌ను సిబ్బంది విసిరేసినట్లుగా ఇవ్వడం, చిల్లర లేదంటూ ఈసడించుకోవడం పరిపాటిగా మారింది.


ఇదేం ఖర్మరా బాబూ.. 

జిల్లాలో అన్ని దుకాణాల వద్ద ఇదే పరిస్థితి. అయినా షాపుల వద్ద బారులు తీరి బ్రాండ్లు తెలియకున్నా కిక్కు ఉంటే చాలనుకుంటూ డబ్బును బట్టి మద్యం కొంటున్నారు. దుకాణాల వద్ద కొందరు మద్యం ప్రియులు ఏం కాలం వచ్చిందిరా నాయనా.. ఇదేం ఖర్మరా బాబూ అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇది ఆ రోజు వరకే.. రేపు మళ్లీ మామూలే. ఈ బలహీనతే ఏ సర్కారుకైనా ఆదాయ రాచబాటగా మిగులుతోంది. దీన్ని ఆసరాగా చేసుకునే రకాలు తెలియని మద్యం విక్రయం యథేచ్ఛగా సాగుతోంది.

Updated Date - 2020-10-27T08:07:00+05:30 IST