పోలవరం ఆగితే సీమకు తీవ్ర అన్యాయం

ABN , First Publish Date - 2020-10-27T08:23:56+05:30 IST

పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలో 72 శాతం పూర్తయిందని, అయితే జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరాన్ని కూడా అటకెక్కించే యత్నాలు చేస్తున్నారని

పోలవరం ఆగితే సీమకు తీవ్ర అన్యాయం

నిధుల కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురండి

 టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి


కడప, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలో 72 శాతం పూర్తయిందని, అయితే జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరాన్ని కూడా  అటకెక్కించే యత్నాలు చేస్తున్నారని, ఇదే జరిగితే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చే శారు. సోమవారం కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన, కడప పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం సవరించిన అంచనాకు రూ.58,319 కోట్లకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఏడాదిన్నర తరువాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.28వేల కోట్లకు కుదించడం అన్యాయమన్నారు. పోలవరం అంచనా వ్యయాన్ని తగ్గించినా జగన్‌ సర్కారు ఏమీ మాట్లాడ్డంలేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అని విమర్శించారు.


ప్రాజెక్టు ఆగిపోతే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది కనుక రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు. లేదంటే వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నా, రోడ్లు నాశనమైనా పట్టించుకోవడంలేదన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే గీతం యూనివర్శిటీని కూల్చడం దుర్మార్గమన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, వేధింపులు, తప్పుడు కేసులు ఆపకుంటే తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత వేధించినా పార్టీని వీడేది లేదన్నారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు శ్వేతశ్రీరెడ్డి, బద్వేలు టీడీపీ నేతలు రాజశేఖర్‌, వేణుగోపాల్‌, సురేష్‌, కర్నాటి వెంకటరెడ్డి, జిలానీబాషా, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T08:23:56+05:30 IST